‘అన్‌ కిస్స్‌డ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’... నిమ్మి

ఆమెను నాటి బాలీవుడ్‌ చిత్రసీమ ‘గోల్డన్‌ గర్ల్‌ ఆఫ్‌ గోల్డన్‌ ఎరా’గా కీర్తించింది. స్ఫటికం వంటి నిర్మలమైన కళ్లతో దేదీప్యమానమైన అందంతో మెరసిపోతున్న ఆమెను దాటి వెళ్లడానికి నర్గీస్, మధుబాల వంటి నటీమణులకే కష్టమైంది అంటే నమ్మి తీరాలి. తెరంగేట్రం చేసింది షో మాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్కీన్ర్‌గా కీర్తినందుకున్న రాజకపూర్‌ ‘బర్సాత్‌’ సినిమాతో. స్టార్డం నిలుపుకుంది ట్రాజెడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌ నటించిన ‘దీదార్‌’ అనే మలి చిత్రంతో. హిందీ చిత్రసీమలో ఆమె అంత అదృష్టవంతురాలైన నటీమణి మరొకరు లేరు అనుకునేవాళ్లు అందరూ. దిలీప్‌ కుమార్‌తో ఐదు సినిమాల్లో నటించి మరులుగొన్న ఆ నటీమణే నిమ్మి అనే ‘నవాబ్‌ బానూ’. మెహబూబ్‌ ఖాన్‌ చిత్రం ‘ఆన్‌’లో నటించిన నిమ్మి లండన్‌లో ప్రదర్శించిన ఆ చిత్ర ప్రిమియర్‌ షో పాల్గొన్నప్పుడు ఆమె అందానికి ముగ్ధుడైన హాలీవుడ్‌ నటుడు ఎర్రోల్‌ ఫ్లిన్న్‌ ఆమెను ముద్దు పెట్టుకోబోగా వారించి ‘అన్‌-కిస్స్‌డ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకున్న భారతీయ వనిత నిమ్మి. ‘టెన్‌ కమాండ్‌ మెంట్స్‌’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన సెసిల్‌.బి. డీమెల్లి హాలీవుడ్‌లో నటించమని కోరితే సున్నితంగా తిరస్కరించిన గొప్ప కళాకారిణి నిమ్మి. అటువంటి అరుదైన నటీమణి 87వ జన్మదినం ఫిబ్రవరి 18న జరుగుతున్న సందర్భంగా నిమ్మిని గురించి. కొన్ని విశేషాలు...


షోమ్యాన్‌తో తొలి చిత్రంలో...
నిమ్మి 18 ఫిబ్రవరి 1933న ఉత్తరప్రదేశ్‌లోని ఫహేదాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి అబ్దుల్‌ హకీమ్‌ మిలటరీ కాంట్రాక్టరు, తల్లి వహీదాబాయి మంచి గాయని, సినీ నటి. నిమ్మి మాతామహుడు మనదేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వం ఒక చిన్న పరగణాకు జమీందారుగా వుండేవారు. ఆ రోజుల్లో పద్మశ్రీ లాంటి ‘నవాబ్‌’ అనే బిరుదు పొందేందుకు ఎంతో మంది నిష్ణాతులు పోటీ పడేవారు. ఆ బిరుదు పొందాలని నిమ్మి తాత కలలు కనే వారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో తన ముచ్చట తీర్చుకోవాలని నిమ్మికి ‘నవాబ్‌’ అనే పేరు పెట్టారు. అమ్మమ్మ ఆ పేరు పక్కన ‘బానూ’ అని చేర్చింది. దాంతో నిమ్మి పేరు ‘నవాబ్‌ బానూ’గా స్థిరపడింది. అప్పటికే నిమ్మి తల్లి వహీదా బాయి కొన్ని హిందీ సినిమాల్లో చిన్న వేషాలు వేస్తుండేది. పైగా మెహబూబ్‌ ఖాన్‌ కుటుంబంతో ఆమెకు సత్సంబంధాలు ఉండేవి. అయితే నిమ్మి పదకొండవ ఏటనే ఆమె తల్లి కాలం చేసింది. దాంతో నిమ్మి తన అమ్మమ్మ వుండే అబ్బొట్టాబాద్‌ (పాకిస్తాన్‌)కు వెళ్లి అక్కడే పెరిగింది. తండ్రి మాత్రం మీరట్‌లో ఉంటూ వచ్చారు. స్వాతంతా్ర్యనంతరం నిమ్మి, వాళ్ళ అమ్మమ్మ బొంబాయికి వచ్చేశారు. నిమ్మి మేనత్త జ్యోతి భర్త జి.ఎం.దుర్రాని కూడా మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. ఆమె మేనత్త జ్యోతి నిమ్మిని అప్పట్లో సెంట్రల్‌ స్టూడియోలో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ‘అందాజ్‌’ సినిమా సెట్స్‌ మీదకు తీసుకెళ్ళింది. రాజ్‌కపూర్, దిలీప్‌ కుమార్‌ల మధ్య ఒక సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరిస్తు న్నారు. ఆ చిత్రంలో నర్గీస్‌ హీరోయిన్‌. నిమ్మి నర్గీస్‌ తల్లి జద్దన్‌ బాయి పక్కన కూర్చుండడం రాజ్‌కపూర్‌ కంటపడింది. షాట్‌ మధ్యలో నిమ్మిని పేరేమిటని అడిగారు రాజకపూర్‌. ఆశ్చర్యపోయిన నిమ్మికి సమాధానం చెప్పేందుకు ఐదు నిమిషాలు పట్టింది. కొద్దిరోజులు గడిచాక రాజ్‌కపూర్‌ నిమ్మిని ఆడిషన్‌కు ఆహ్వానించారు. తను నిర్మించ బోయే ‘బర్సాత్‌’ (1949) సినిమాలో ఒక పర్వత శ్రేణుల్లో గొర్రెల్ని మేపుకుంటూ జీవించే గ్రామీణ యువతి పాత్ర పోషించేందుకు కొత్త తారల కోసం రాజ్‌కపూర్‌ అన్వేషిస్తున్నారు. అలా నిమ్మి ని ‘బర్సాత్‌’ చిత్రంలో రెండవ హీరోగా నటించిన ప్రేమ్‌ నాథ్‌కు జంటగా ‘నీల’ పాత్రలో ప్రవేశపెట్టారు. అదే నవాబ్‌ బాను తొలి చిత్రం కావడంతో రాజ్‌కపూర్‌ ఆమె పేరును ‘నిమ్మి’గా మార్చారు. ‘బర్సాత్‌’ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసి మంచి వసూళ్లు రాబట్టడంతో ఆ రాబడితో రాజ్‌కపూర్‌ ఆర్‌.కె స్టూడియోని నిర్మించడం జరిగింది. సంగీత దర్శకులు శంకర్‌-జైకిషన్‌లకు కూడా ‘బర్సాత్‌’ తొలి సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో లతాజీ ఆలపించిన ‘బర్సాత్‌ మే హమ్‌ సే మిలే తుమ్‌ సాజన్‌’, ‘జియా బేకరార్‌ హై చాయీ బహార్‌ హై’, ‘బిచ్‌ డే హుయే పరదేశి ఇక్‌ బార్‌ తో ఆనా తూ’, ‘పత్లి కమర్‌ హై తిరచ్చి నజర్‌ హై’ (ముఖేష్‌ గళంతో కలిపి) వంటి హిట్‌ పాటలకు రాజ్‌కపూర్, నర్గీస్, ప్రీమ్‌ నాథ్‌లతో కలిసి అభినయం చేసింది నిమ్మి. ఈ చిత్ర నిర్మాణ సమయంలో చెల్లెలు అన్నకు రాఖీ కట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రాజ్‌కపూర్‌ నిమ్మితో ‘ఈ రాఖీ అనే రక్షాబంధన్‌ ఎందుకు కడతారో, ఎవరికి కడతారో తెలుసా’ అని అడిగి మరీ రాఖీ కట్టించుకున్నారు. అంతే... రాజకపూర్‌ అందుకు కట్టుబడి జీవిత కాలంలో నిమ్మి సరసన హీరోగా నటించలేదు. ఈ సినిమాతో రాత్రికి రాత్రే నిమ్మి పెద్ద నటిగా ఆదరణ పొందింది. తరువాత రాజేంద్ర జైన్‌ నితిన్‌ బోస్‌ దర్శకత్వంలో ‘దీదార్‌’ (1951) చిత్రం నిర్మిస్తే అందులో నిమ్మికి ‘చంప’ పాత్రలో నటించే అవకాశం లభించింది. దిలీప్‌ కుమార్, నర్గీస్‌ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్టయింది. ఇందులో నిమ్మి మేనత్త భర్త దుర్రాని శంషాద్‌ బేగంతో కలిసి ‘నజర్‌ ఫేరో న హమ్సే’ అనే పాటను ఆలపించడం విశేషం. అదే సంవత్సరం నిర్మాత జి.పి. సిప్పీ ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్‌ ఫాలి మిస్త్రీ దర్శకత్వంలో ‘సజా’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో దేవానంద్‌ సరసన నిమ్మి అతనికి చిన్ననాటి లవ్‌ ఇంట్రెస్ట్‌గా నటించింది. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ సమకూర్చిన పాటలు భావగర్భితంగా ఉండటమే కాకుండా కథలో భాగంగా కలిసిపోవడంతో అతి తక్కువ సంభాషణలతో సినిమా మంచి పేరు తెచ్చుకొని విజయవంతమైంది. ముఖ్యంగా తేనెకళ్ల నిమ్మి ఈ చిత్రంలో అందంగా కనిపించింది. ‘తుమ్‌ న జానే కిస్‌ జహా మే ఖో గయా’, ‘ధక్‌ ధక్‌ జియా కరే ధక్‌ ఆంఖియో మే’ పాటల్లో నిమ్మి అందాన్ని వర్ణించతరం కాదు.


మెహబూబ్‌ ఖాన్‌ చిత్రం ‘ఆన్‌’లో...

ఈ మధ్య కాలంలో నిమ్మి మరికొన్ని చిత్రాల్లో నటించినా తరవాత చెప్పుకోతగిన చిత్రం ప్రముఖ దర్శక నిర్మాత మెహబూబ్‌ ఖాన్‌ 1952లో నిర్మించిన ‘ఆన్‌’. భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రంలో దిలీప్‌ కుమార్‌ పక్కన నిమ్మిని, కొత్తనటి నాదిరాను ఎంపిక చేశారు. అందులో నిమ్మిది ‘మంగళ’ అనే ఒక గ్రామీణ యువతి పాత్ర కాగా నటి ‘నాదిరా’కు ఇది తొలి చిత్రం. 17 భాషల్లో ఈ చిత్రానికి సబ్‌-టైటిల్స్‌ వేసి అమెరికా, లండన్, జపాన్, ఫ్రాన్స్‌ వంటి వివిధ దేశాల్లో మెహబూబ్‌ ఖాన్‌ విడుదల చేస్తే విపరీతమైన వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఇందులో నిమ్మి పాత్ర మధ్యలోనే చనిపోతుంది. ఆ రోజుల్లో సినిమా అభిమానులకు నిమ్మి అంటే విపరీతమైన క్రేజ్‌ వుండేది. దాంతో ప్రేక్షకుల కోరిక మేరకు మెహబూబ్‌ ఖాన్‌ నిమ్మికి ఒక డ్రీమ్‌ సాంగ్‌ జోడించి, పాత్ర నిడివిని కాస్త పొడిగించారు. ఈ సినిమా ప్రీమియర్‌ను ‘సావేజ్‌ ప్రిన్సెస్‌’ పేరుతో లండన్‌ నగరంలో ప్రదర్శించినప్పుడు, మెహబూబ్‌ ఖాన్‌ దంపతులతోబాటు నిమ్మి కూడా హాజరైంది. ఆ ప్రీమియర్‌కు హాజరైన ప్రముఖ హాలీవుడ్‌ హీరో ఎర్రోల్‌ థామస్‌ ఫ్లిన్‌ నిమ్మి అందానికి ముగ్ధుడై ఆమెను ముద్దుపెట్టుకోబోగా, నిమ్మి అతణ్ణి వారిస్తూ ‘ నేను భారతీయ మహిళను. మీ ముద్దు ముచ్చటకు మేము దూరం’ అంటూ త్రోసిపుచ్చింది. దాంతో లండన్‌ పత్రికలు ‘అన్‌-కిస్స్‌డ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’ అంటూ వార్తలు రాశాయి. ఫ్రాన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసినప్పుడు ఆ చిత్రానికి ‘మంగళ.. గర్ల్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేరు పెట్టి నిమ్మి చిత్రంతో పెద్ద పెద్ద వాల్‌ పోస్టర్లు ముద్రించడం విశేషం. ఈ చిత్రాన్ని తిలకించిన ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శక నిర్మాత సెసిల్‌.బి. డీమెల్లీ నుంచి నిమ్మికి ఆఫర్లు వచ్చాయి. కానీ నిమ్మి బాలీవుడ్‌ను వదలి వెళ్లేందుకు ఇష్టపడలేదు. నిమ్మి హిందీ వెండితెరపై రాణించడం ఒక ‘ఫెయిరీ టేల్‌’ని తలపిస్తుందని ప్రముఖ పత్రిక ‘ఫిలిమ్‌ ఇండియా’ అధిపతి బాబురావు పటేల్‌ అభివర్ణించడం నిమ్మికి ‘పద్మ అవార్డు’ సిద్ధించినట్లుగా భావించవచ్చు. ఈ సినిమా తరువాత నిమ్మికి మంచిపేరు తెచ్చిపెట్టిన హిట్‌ చిత్రం అమియా చక్రవర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘దాగ్‌’. హీరో దిలీప్‌ కుమార్‌కు తొలి ఫిలింఫేర్‌ బహుమతి తెచ్చిపెట్టిన ఈ చిత్రంలో నిమ్మి హీరోయిన్‌గా నటించింది. లతాజీ నిమ్మి కోసం ఆలపించిన ‘మౌత్‌ ఆగయీ న ఆయే వో మర్నే కే బాత్‌ భీ’, ‘ప్రీ ఏ కిసీ బోల్‌ రి దునియా’ రెండు పాటలను శంకర్‌ జైకిషన్‌ సూపర్‌ హిట్లుగా మలిచారు. ‘డాగ్‌’ చిత్రం తరువాత చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఆంధియా’, ఎస్‌.ఎన్‌.భగత్‌ దర్శకత్వంలో ‘హమ్‌ దర్ద్‌’, అమర్‌ నాథ్‌ దర్శకత్వంలో ‘ఆలిఫ్‌ లైలా’, రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో ‘మెహమాన్‌’ చిత్రాల్లో నిమ్మి నటించింది. 1953లో రాజకుమార్‌ సరసన ‘ఆబ్షర్‌’ చిత్రంలోనూ, నితిన్‌ బోస్‌ దర్శకత్వంలో ‘దర్ద్‌-ఎ-దిల్‌’ చిత్రాల్లో నటించాక మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అమర్‌’ (1954)లో దిలీప్‌ కుమార్‌కు జంటగా మధుబాలతో కలిసి నటించింది. అద్భుతమైన కథా గమనం వున్న చిత్రమైనా హీరో దిలీప్‌ కుమార్‌ ఒక పాలు పోసే యువతిని బలాత్కరించి గర్భిణిని చేయడం ప్రేక్షకులు హర్షించలేక పోయారు. దాంతో చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఆ నిర్భాగ్యురాలి పాత్రను పోషించింది నిమ్మి. చిత్రం ఆర్ధికంగా నష్టపోయినా, క్లాసిక్‌గా నిలిచిపోయింది. తను నిర్మించిన చిత్రాలలో కెల్లా నచ్చిన సినిమా ఇదేనంటారు మెహబూబ్‌ ఖాన్‌.


భాయి భాయి చిత్రంతో పెరిగిన స్టార్డం...
1956లో ఎ.వి.ఎం ప్రొడక్షన్స్‌ అధిపతి మెయ్యప్పన్‌ ఎం.వి.రామన్‌ దర్శకత్వంలో తమిళంలో డంకా బజాయించిన ‘రత్త పాశం’ చిత్రాన్ని ‘భాయి భాయి’ పేరుతో పునర్నిర్మించారు. అశోక్‌ కుమార్, కిశోర్‌ కుమార్, నిరూపరాయ్, నిమ్మిలు కలిసి నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్టయింది. ఇందులో నిమ్మి స్ట్రీట్‌ సింగర్‌గా కిశోర్‌ సరసన మంచి పాత్ర పోషించింది. ముఖ్యంగా మదన్‌ మోహన్‌ సమకూర్చిన ‘ఏ దిల్‌ ముఝే బతా దే, తు కిస్‌ పే ఆగయీ హై’ పాట మంచి హిట్‌. అలాగే నిమ్మి మీద చిత్రీకరించిన ‘ఖదర్‌ జానే న ఖదర్‌ జానే న మోరా బాలం బేదర్ది జి’కి మంచి పేరొచ్చింది. ‘భాయి భాయి’లో నటనకు నిమ్మి క్రిటిక్స్‌ అవార్డ్‌ అందుకుంది. ఆమె నటించిన సినిమాలలో అద్భుతమైన పాటలు నిమ్మి పాత్రకు లభించడం అదృష్టమనే చెప్పాలి. తదనంతరం నరేష్‌ సైగల్‌ సునీల్‌ దత్‌ హీరోగా నిర్మించిన ‘రాజధాని’లో నటించిన నిమ్మి ఆ తరువాత భరత్‌ భూషణ్‌ సరసన రాజా నవాథే దర్శకత్వంలో ‘బసంత్‌ బహార్‌’ (1956) అనే గొప్ప మ్యూజికల్‌ హిట్‌ సినిమాలో నటించింది. కన్నడ నవల ‘హంసగీతె’ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో తొమ్మిది అద్భుతమైన పాటలకు అంతే అద్భుతమైన స్వరాలు అల్లారు శంకర్‌ జైకిషన్‌. ఈ చిత్రానికి రాష్ట్రపతి బహుమతి లభించింది. ‘మై పియా తేరి తు మానె యా నా మానే’ ‘నైన్‌ మిలే చైన్‌ కహా దిల్‌ హై వహి తు హై జహా’ వంటి నిమ్మి మీద చిత్రీకరించిన పాటలు అద్భుతాలుగా చెప్పవచ్చు. భరత్‌ భూషణ్‌ తోనే విజయభట్‌ దర్శకత్వంలో ‘అంగుళిమాల’ అనే చిత్రంలో నిమ్మి హీరోయిన్‌గా నటించింది. నిమ్మి మధుబాల, సురయ్యా, గీతాబాలి, మీనాకుమారిలతో కలిసి కొన్ని సినిమాలలో నటించింది. నిమ్మి తల్లిలాగే మంచి గాయని కూడా. ‘బేదర్ది’ సినిమాలో నిమ్మి తనపాటలు తనే పాడుకుంది. నిమ్మి సొంతంగా ‘డంకా’ (1954) అనే సినిమా నిర్మించింది. సోహ్రాబ్‌ మోడీ నిర్మించిన ‘కుందన్‌’లో సునీల్‌దత్‌ సరసన ద్విపాత్రాభినయం చేసింది. దిలీప్‌ కుమార్‌తో ఐదు సినిమాల్లో నిమ్మి హీరోయిన్‌గా నటించింది. దిలీప్‌తో నటించిన ఆఖరి చిత్రం 1955లో విడుదలైన ‘ఉరన్‌ ఖటోలా’. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. అందులో పాటలు నేటికీ సుపరిచితాలే! కె.ఎ.అబ్బాస్‌ నిర్మించిన ‘చార్‌ దిల్‌ చార్‌ రాహే’ (1959) సినిమాలో నిమ్మి వెలయాలు పాత్ర పోషించడం ఆమె అభిమానులకు మింగుడు పడలేదు. ఆ తరువాత బి.ఆర్‌.చోప్రా నిర్మించిన ‘సాధనా’, ‘వో కౌన్‌ థీ’ సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చినా నిమ్మి తిరస్కరించడం విశేషం. అలాగే 1963లో విడుదలైన ‘మేరే మెహబూబ్‌’ బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రంలో రాజేంద్రకుమార్‌ సరసన నటించే అవకాశం లభించినా దానిని వదలుకుంది. ఆ పాత్ర సాధనాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అందులో రాజేంద్రకుమార్‌ సోదరి పాత్రనే నిమ్మి కోరుకోవడం కూడా విశేషమే. 60 దశకంలో శృంగారతారలుగా సాధనా, నందా, ఆశాపరేఖ్, మాలాసిన్హా, సైరాబాను రాణిస్తూ బాలీవుడ్‌ సినీరంగానికి పెట్టని గోడలై వెలిగిపోవడంతో నిమ్మి వంటి సనాతన నటీమణుల ప్రభావం కాస్త సన్నగిల్లింది. 1964లో ఎ.వి.ఎం వారు తమిళ సినిమా ‘కుముదం’ను ‘పూజా కె పూల్‌’ పేరుతో పునర్నిర్మిస్తే నిమ్మి అందులో ప్రాణ్‌కు చెల్లెలి పాత్రలో గుడ్డిపిల్లగా నటించింది. ధర్మేంద్ర సరసన మాలాసిన్హా హీరోయిన్‌ అవతార మెత్తింది. అలాగే ‘ఆకాష్‌ దీప్‌’లో అశోక్‌ కుమార్‌కు మూగ భార్యగా నటించింది. మరోవైపు ధర్మేంద్రకు హీరోయిన్‌గా నందా నటించింది. వీటితో నిమ్మి ప్రభావం బాగా తగ్గిపోయింది.


వెండితెర మరుగవుతూ...
తన ప్రభావం తగ్గుతుండడంతో నిమ్మి వైవాహిక జీవితంలో కాలం గడపాలని నిశ్చయించుకుంది. కె.ఆసిఫ్‌ దర్శకత్వంలో 1963లో ‘లవ్‌ అండ్‌ గాడ్‌’(ఖైస్‌ అవుర్‌ లైలా) సినిమా నిర్మాణానికి పునాదులు పడ్డాయి. పూర్తి రంగుల్లో నిర్మించబడిన ఈ సినిమా ఆసిఫ్‌కు చివరి సినిమా. అందులో లైలాగా నిమ్మి నటించింది. అయితే ఈ సినిమా 1986 వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్ర నిర్మాణానికి అడ్డంకుల మీద అడ్డంకులు ఎదురయ్యాయి. తొలుత నిమ్మికి జతగా ఖైస్‌ పాత్రకు గురుదత్‌ను ఎంపిక చేశారు. 1964లో గురుదత్‌ అకాలమరణం చెందారు. దాంతో ఈ సినిమా నిర్మాణాన్ని పక్కన పెట్టారు. మరలా 1970లో సంజీవ్‌ కుమార్‌ను ఖైస్‌ పాత్రకు ఎంపికచేసి నిర్మాణపనులు వేగవంతం చేశారు. కానీ 1971 మార్చిలో కె.ఆసిఫ్‌ తన 47వ ఏట మరణించడంతో మరలా చిత్ర నిర్మాణం ఆగిపోయింది. తరువాత ఆసిఫ్‌ భార్య ఈ అసంపూర్ణ చిత్రానికి కొన్ని సన్నివేశాలు జోడించి పంపిణీదారుడు కె.సి. బొకాడియా ఆర్ధిక సహకారంతో మే 27, 1986న విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల నాటికి హీరో సంజీవ్‌ కుమార్‌ కూడా కాలం చేశాడు. సినిమా మాత్రం ఫ్లాపయింది. అప్పటికే నిమ్మి నటజీవితం నుంచి నిష్కమ్రించింది. నిమ్మి ప్రముఖ సినీ రచయిత సయ్యద్‌ ఆలి రజాను ప్రేమించి పెళ్లాడింది. మెహబూబ్‌ స్టూడియోలో ‘ఆన్‌’ చిత్ర నిర్మాణం జరుగుతుండగా ఆలి రజాను నిమ్మి చూడటం జరిగింది. తరువాత నిమ్మికి కేశాలంకరణ చేసే వ్యక్తి దగ్గర పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రముఖ హాస్య నటుడు ముఖ్రి వీరిద్దరికీ సయోధ్య కుదిర్చి మధ్యవర్తిగా వుండి పెళ్లి తంతు జరిపించాడు. నిమ్మికి సంతానం లేనందున తన చెల్లెలి కుమారుణ్ణి దత్తత తీసుకుంది. అతడు లండన్‌లో స్థిరపడ్డాడు. నిమ్మి భర్త ఆలి రాజా నవంబరు 2007లో చనిపోయాడు.

- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.