'రజనీగంధ’ సుగంధం..విద్యా సిన్హా
నటులు అమోల్ పాలేకర్, దినేష్ ఠాకూర్ ల మధ్య ప్రేమ ఎవరికి పంచాలో సందిగ్ధంలోపడిన కాలేజి విద్యార్ధినిగా బాసు చటర్జీ దర్శకత్వం వహించిన ‘రజనీగంధ’(1975) చిత్రంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నటి విద్యాసిన్హా. ఆమెకు ‘రజనీగంధ’ సినిమా తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, తరవాతి సంవత్సరం బి.ఆర్. చోప్రా బసు చటర్జీ దర్శకత్వం లో సమర్పించిన ‘చోటి సి బాత్’ కూడా హిట్ కావడంతో విద్యా సిన్హా పేరు పెద్ద నతీమణుల జాబితాలో చేరిపోయింది. వివాహితగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించిన విద్యా సిన్హా 1986లో చలనచిత్ర నటనకు స్వస్తి చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. కొంతకాలానికి తిరిగివచ్చిన ఆమె 2000 నుంచి బుల్లితెరమీద ప్రత్యక్షమై ‘బహురాణి’. ‘హమ్ దో హై నా’, ‘భాభి’, ‘కావ్యాంజలి’ వంటి ధారావాహికల్లో నటిస్తూ వదినగా, దాదిమాగా మంచి పేరుతెచ్చుకుంది. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో స్వాతంత్ర్య పర్వదినాన (ఆగస్టు 15, 2019) జూహులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈరోజు ఆమె (15 నవంబరు 1947) జయంతి. ఈ సందర్భంగా..  విద్యా సిన్హా గురించిన విశేషాలను తెలుసుకుందాం...


రజనీగంధ తో స్టార్డం...
విద్యా సిన్హా పుట్టింది 15 నవంబరు 1947న బొంబాయిలో. తండ్రి ప్రతాప్.ఎ. రాణా (రాణా ప్రతాప్ సింగ్) హిందీ చలనచిత్ర రచయిత, నిర్మాత. ఆయన ‘పర్వానా’ (కె.ఎల్. సైగల్, సురయ్యా-1947), ‘విద్యా’ (దేవానంద్, సురయ్యా-1948), ‘జీత్’ (దేవానంద్, సురయ్యా-1949) సినిమాలను నిర్మించారు. ఆ చిత్రాలకు రచనకూడా ఆయనే చేశారు. ఆయన తండ్రి మోహన్ సిన్హా కూడా రచయితే. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. విద్యా సిన్హా టీనేజి వయసులో మోడల్ గా పనిచేసింది. ’మిస్ బాంబే’ గా ఎన్నికైంది. కొన్ని సౌందర్య ఉత్పత్తులకు మోడలింగ్ చేసింది. అప్పుడే బాసు చటర్జీ ఆమెను చూడటం తటస్థించింది. 1968 లో విద్యా కు వెంకటేశ్వరన్ అయ్యర్ తో వివాహం జరిగింది. 1974లో ఆమెకు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఛోటు బిహారీ దర్శకత్వం వహించిన ‘రాజా కాకా’ చిత్రంలో కిరణ్ కుమార్ సరసన విద్యా హీరోయిన్ గా నటించింది. అయితే అదే సంవత్సరం విడుదలైన బాసు చటర్జీ చిత్రం ‘రజనీగంధ’ విద్యా సిన్హాకు మంచిపేరు తెచ్చి పెట్టింది. పేరుకి లఘు బడ్జెట్ చిత్రమైనా ‘రజనీగంధ’ బాక్సాఫీస్ హిట్టయింది. ఇందులో హీరోగా నటించిన అమోల్ పాలేకర్ కు కూడా ‘రజనీగంధ’ తొలిచిత్రం కావడం విశేషం. అశేష ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘రజనీగంధ’ చిత్రాన్ని ముప్పై నాలుగేళ్ల తరవాత అంటే...2012 లో ‘హోతత్ శేదిన్’ పేరుతో బెంగాలీ లో పునర్నిర్మించారు. అసలు ఈ చిత్రాన్ని బసు చటర్జీ శశికపూర్, అమితాబ్ బచన్, షర్మిలా టాగూర్ వంటి భారీ తారాగణంతో నిర్మించాలనుకున్నారు. తరవాత షర్మీలా టాగూర్ స్థానంలో అపర్ణా సేన్, మల్లికా సారాభాయ్ లను కూడా పరిశీలించారు. అయితే విద్యా సిన్హా నటించగా బాసు చటర్జీ నిర్మించిన ఒకానొక ప్రచార చిత్రం గుర్తుకొచ్చి, బాసు చటర్జీ విద్యా సిన్హా వైపు మొగ్గు చూపారు. జెజె స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్ లో శిక్షణ పొందుతున్న అమోల్ పాలేకర్ ను హీరోగా తీసుకున్నారు. 1972లోనే ఈ చిత్ర నిర్మాణం మొదలైనప్పటికీ, నిర్మాత సురేష్ జిందాల్ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో చిత్రనిర్మాణానికి రెండేళ్ళు పట్టింది. సలీల్ చౌదరి సంగీతం సమకూర్చగా ముఖేష్ ఆలపించిన ‘కయి బార్ యూ భి దేఖా హై’ పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుని బహుమతి లభించింది. ఫిలింఫేర్ వారి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుని బహుమతులు ఈ సినిమాకు దక్కాయి. ‘రజనీగంధ’ టైటిల్ సాంగ్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. లఘు బడ్జట్ చిత్రం కావడంతో మొదట ఒకే ఒక ప్రింట్ ని దక్షిణ ముంబై లో విడుదల చేశారు. మంచి టాక్ రావడంతో ఎక్కువ ప్రింట్లు ముద్రించి దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. అమోల్ పాలేకర్ కు ‘సిల్వర్ జూబిలీ’ నటుడుగా పేరొచ్చింది. అతడు విద్యా సిన్హా తో నటించిన ‘చోటి సి బాత్’, జరీనా వాహబ్ తో నటించిన ‘చిత్ చోర్’ సినిమాలు వరసగా సిల్వర్ జుబిలీలు చేసుకున్నాయి.ఛోటి సి బాత్ తో విజయ పథంలో...
‘రజనీగంధ’ తరవాత 1976లో నిర్మాత బి.ఆర్. చోప్రా బాసు చటర్జీ దర్శకత్వంలో ‘ఛోటి సి బాత్’ అనే కామెడీ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విద్యా సిన్హా కు జోడీ అమోల్ పాలేకర్. బాసు చటర్జీ సంభాషణలు కూడా సమకూర్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ హిట్టయింది. బాసు చటర్జీ కి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఫిలింఫేర్ బహుమతి కూడా లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ హాస్యనటన విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవి ఫలవంతం కాలేదు. సలీల్ చౌదరి స్వరపరచిన ‘జానేమన్ జానేమన్ తేరే దో నయన్’ (ఏసుదాస్), ‘ఏ దిన్ క్యా ఆయే’ (ముఖేష్), ‘న జానే క్యోం హోతా హై’ (లతాజీ) పాటలు జనంలోకి బాగా వెళ్ళాయి. అదే సంవత్సరం సత్యేంద్ర కపూర్ తో విద్యా సిన్హా బిందూ శుక్లా దర్శకత్వం వహించిన ‘మేరా జీవన్’ చిత్రంలో నటించింది. 1977లో విద్యా సిన్హా ఏడు సినిమాల్లో నటించింది. వాటిలో ‘ఇనకార్’ అనే చిత్రంలో వినోద్ ఖన్నా సరసన హీరోయిన్ గా నటించింది. ‘హై అండ్ లో’ అనే జపనీస్ చిత్రం ఆధారంగా రాజ్ సిప్పీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1979 లో ఈ చిత్రాన్ని ‘దొంగల వేట’ పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. సుధెందు రాయ్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘జీవన్ ముక్తి’ చిత్రంలో పరీక్షిత్ సాహ్ని కి జోడీగా విద్యా సిన్హా నటించింది. ఇందులో గిరీష్ కర్నాడ్, లక్ష్మి, సురేష్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తిలక్ మూవీస్ నిర్మాత దర్శకుడు రాజ్ తిలక్ నిర్మించిన ‘ముక్తి’ చిత్రం విద్యా సిన్హా కు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇందులో శశికపూర్, సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి ఇతర నటులు. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో ముఖేష్ ఆలపించిన ‘సుహానీ చాందినీ రాతే’ పాట బినాకా గీత్ మాలా వార్షిక జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. తరవాత రాజేష్ ఖన్నా తో ‘కర్మ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బి.ఆర్. చోప్రా నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజిగా ఆడింది. గుల్జార్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘కితాబ్’ చిత్రంలో ఉత్తమ కుమార్ సరసన విద్యా నటించింది. సినిమా విజయవంతమైంది. పరీక్షిత్ సాహ్ని తో మరొక సినిమా ‘మమత’ లో విద్యా సిన్హా నటించింది.


దుమ్ము రేపిన పతి పత్ని అవుర్ వో...
1978లో బి. ఆర్. చోప్రా ‘పతి పత్ని అవుర్ వో’ అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో సంజీవ్ కుమార్ హీరోగా నటించగా విద్యా సిన్హా అతని జోడీగా నటించింది. ‘వో’ గా రంజీతా కౌర్ నటించింది. రిషీ కపూర్, నీతు సింగ్, పర్వీన్ బాబి అతిథి పాత్రలు పోషించారు. వివాహేతర సంబంధాల కోరల్లో చిక్కిన హీరో నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ కావడమే కాకుండా ఉత్తమ స్క్రీన్ ప్లే బహుమతిని ఫిలింఫేర్ సంస్థనుంచి సాధించింది. ఇదే పరంపరలో ‘సఫేద్ ఝూట్’, ‘మగ్రూర్’, ‘తుమ్హారే లిఏ’, ‘మీరా’ చిత్రాలు వరసగా వచ్చాయి. 1980 లో ‘స్వయంవర్’, ‘సబూత్’, ‘ప్యారా దుష్మన్’ విడుదలయ్యాయి. ఆ తరవాతి సంవత్సరం ‘లవ్ స్టోరీ’, ‘ప్లాట్ నెంబర్ 5’, ‘జోష్’ చిత్రాలు విడుదల కాగా, 1986లో ఆమె నటించిన ఆఖరి చిత్రం ‘జీవా’ విడుదలైంది. ఇందులో విద్యా సిన్హా ది పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర. ఈ చిత్రం తరవాత 2011లో బాడీ గార్డ్ చిత్రంలో విద్యా నటించింది.


ప్రేమపెళ్ళి...
విద్యా సిన్హా ఇంటి ప్రక్కనే వెంకటేశ్వరన్ అయ్యర్ అనే ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. విద్యా సిన్హా అతడి ప్రేమలో పడి 1968 లో పెళ్లి చేసుకుంది. వారికి సంతు లేకపోతే 1989లో జాహ్నవి అనే పసికందుని దత్తు తీసుకుంది. కొంతకాలం భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళింది. తరవాత భర్త జబ్బు పడడంతో భారత్ వచ్చి ఇంటి పనులకే పరిమితమైంది. వెంకటేశ్వరన్ 1996లో చనిపోయాడు. ఆతను మరణించాక విద్యా సిన్హా మరలా ఆస్ట్రేలియా లోని సిడ్నీకి వెళ్ళిపోయింది. అక్కడ విద్యా సిన్హాకు ఆస్త్రేలియన్ వైద్యుడు నేతాజీ భీమరావు సాలున్కే తో పరిచయమై అది ప్రేమగా పరిణమించింది. 2001లో అక్కడే ఒక గుడిలో నేతాజీ విద్యా మెడలో తాళి కట్టాడు. అయితే తన రెండవ భర్త శారీరికంగా, మానసికంగా హింసలు పెడుతున్నాడని విద్యా సిన్హా పోలీసు కేసు పెట్టింది. అది విడాకుల వరకు నడిచింది. చాలా సంవత్సరాలకుగాని ఆమెకు విడాకులు మంజూరు కాలేదు. తరవాత భరణంతో కూడిన విడాకులు మంజూరయ్యాయి. ఆ తరవాత బొంబాయిలో టెలివిజన్ తారగా అవతారమెత్తి, తల్లి, వదిన, దాదీ పాత్రలు పోషిస్తూ వచ్చింది. ఇటీవల జి టివి లో ప్రసారమైన ‘ఖుబూల్ హై’, ‘ఇత్తి సి ఖుషీ’ సీరియళ్ళలో దాదిమా పాత్రలు పోషించింది. ఆగస్టు  15, 2019న గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో స్వాతంత్ర్య పర్వదినాన జూహులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.


ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.