బాలీవుడ్‌ గోల్డీ... విజయానంద్‌

‘గోల్డీ అని గర్వంగా పిలవబడే విజయానంద్‌ ప్రముఖ దర్శక నిర్మాత చేతన్‌ ఆనంద్, నటుడు, దర్శక నిర్మాత దేవానంద్‌ లకు ప్రియమైన తమ్ముడు. అంతే కాదు...’ విజయానంద్‌ గొప్ప కథా రచయిత, ధారణా శక్తి, వాగ్ధాటి గల మంచి చిత్ర నిర్మాత, దర్శకుడు. విజయానంద్‌ రాసే స్కీన్ర్‌ ప్లే ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుంది. సన్నివేశాల విభజన ఎంత బాగుంటుందంటే ఎక్కడా బోర్‌ అనిపించదు... పైగా తరవాత ఏమవుతుందనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. అందుకే హిందీ చిత్రరంగం అతనికి ‘గోల్డీ’ అనే భుజకీర్తిని తగిలించింది. విజయానంద్‌ దర్శకత్వం వహిస్తే ఆ చిత్రం శతదినోత్సవమే కాదు రజతోత్సవం... వీలయితే స్వర్ణోత్సవం కూడా చేసుకోగలదనే నమ్మకం చిత్రపరిశ్రమకు వుండేది. 1957లో గోల్డీ దర్శకత్వంలో వచ్చిన ‘నౌ దో గ్యారా’ తో మొదలైన సినిమా విజయ పరంపర ‘కాలాబజార్‌’, ‘తెరేఘర్‌ కే సామనే’, ‘గైడ్‌’, ‘తీస్రీ మంజిల్‌’, ‘జ్యూవెల్‌ తీఫ్‌’, ‘జానీ మేరా నామ్’, ‘తేరే మేరే సపనే’ వంటి సినిమాలతో పరుగిడి సిల్వర్‌ జూబిలీలు జరిపించుకున్నాయి. విజయానంద్‌ కేవలం దర్శకుడే కాదు... మంచి నటుడు కూడా. ‘కాలాబజార్‌’, ‘డబుల్‌ క్రాస్‌’, ‘హకీఖత్‌’, ‘బరూద్‌ రోడ్‌’, ‘మై తులసి తేరి అంగన్‌ కి’, ‘హమ్‌ రహే న హమ్’ వంటి సినిమాల్లో నటుడుగా ఎంత జీవించాడంటే, దర్శకుడుగా జీవించినంతగా అని చెప్పవచ్చు. ఇవాళ ఆయన (23-02-2004) వర్ధంతి. ఈ సందర్భంగా ఆ గోల్డన్‌ దర్శకుని గురించి విశేషాలు...


తొలిరోజుల్లో గోల్డీ...
విజయానంద్‌ పుట్టింది 23 జనవరి 1934న పంజాబ్‌ లోని గురుదాస్పూర్‌లో. తండ్రి పిశోరి లాల్‌ ఆనంద్‌ న్యాయవాది. ప్రముఖ దర్శక నిర్మాతలు, నటులు చేతన్‌ ఆనంద్, దేవానంద్‌ విజయానంద్‌కు అన్నలు. సోదరి శీలకాంత ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ తల్లి. విజయానంద్‌కు ఆరేళ్ల వయసున్నపుడే తల్లి మరణించింది. అప్పటినుంచి పెద్దన్నయ్య చేతన్‌ ఆనంద్, వదినమ్మ ఉమా ఆనంద్‌ సంరక్షణలోనే పెరిగాడు. వారినే తల్లిదండ్రులుగా భావించేవాడు. బొంబాయిలోని సెయింట్‌ జేవియర్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే ఎన్నో నాటికలు రాశాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడే చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వంలో నవకేతన్‌ బ్యానర్‌ మీద దేవానంద్‌ నిర్మించిన ‘టాక్సీ డ్రైవర్‌’ (1954) సినిమాకు తన వదిన ఉమా ఆనంద్‌తో కలిసి కథ, సంభాషణలు రాశాడు. అలాగే 1956లో చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన నవకేతన్‌ చిత్రం ‘ఫంతూష్‌’కి కూడా కథను అందించింది విజయానందే. అప్పుడే తరువాతి సినిమాకు మెగాఫోన్‌ పడతానని దేవానంద్‌ నుంచి మాట తీసుకున్న విజయానంద్‌ 1957లో నిర్మించిన ‘నౌ దో గ్యారా’ సినిమాకు కాలేజీలో చదువుతుండగానే తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. హెలెన్, శశికళ నటించిన ఒకే ఒక నవకేతన్‌ వారి చిత్రం ‘నౌ దో గ్యారా’. మజ్రూహ్‌ సుల్తాన్‌ పురి తొలిసారి పాటలు రాసిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ‘నౌ దో గ్యారా’ చిత్రాన్ని కేవలం 40 రోజుల్లో నిర్మించిన మంచి ప్లానర్‌ విజయానంద్‌. ఆ సినిమా సూపర్‌ హిట్టయింది. మెగాఫోన్‌ పట్టిన తొలిప్రయత్నంలోనే పాటల చిత్రీకరణలో విజయానంద్‌ అద్భుతమైన చతురతను ప్రదర్శించాడు. ఆరోజుల్లో పాటల చిత్రీకరణ విషయంలో గురుదత్, రాజ్‌ ఖోస్లా లను ప్రామాణికంగా తీసుకునేవారు. వారికి ధీటుగా చిత్రీకరణ జరిపి విజయానంద్‌ సినీ పండితుల మన్నన చూరగొన్నాడు. అదే ప్రతిభను తరువాతి సినిమాల్లో కొనసాగించాడు.


నవకేతన్‌కు మూలస్థంభంగా...
దేవానంద్‌ నెలకొల్పిన నవకేతన్‌ సంస్థకు విజయానంద్‌ మూలస్థంభం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తను దర్శకత్వం వహించిన సినిమాలకు స్వయంగా కథ రాసుకునేవాడు. స్కీన్ర్‌ ప్లే రాయడంలో విజయానంద్‌ నిష్ణాతుడు. అందుకే ఆయన సినిమాలు ఎక్కడా బోర్‌ కొట్టవు. దర్శకుడిగా తన తొలిచిత్రం ‘నౌ దో గ్యారా’ గొప్ప మ్యూజికల్‌ హిట్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరో దేవానంద్, కల్పనా కార్తిక్‌ మీద చిత్రీకరించిన ‘ఆంఖోం మే క్యా జిృ, ‘ఆజా పంచి అకేలా హై’, ‘ధల్తి జాయే చునరియా’ పాటలు సూపర్‌ హిట్లయ్యాయి. తరువాత 1960లో నవకేతన్‌ సంస్థ ‘కాలా బజార్‌’ సినిమా నిర్మించింది. అందులో దేవానంద్‌ సరసన వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గా నటించింది. అన్న చేతన్‌ ఆనంద్‌ తోబాటు విజయానంద్‌ కూడా ఇందులో నటించడం విశేషం. ఈ చిత్రంలో విజయానంద్‌ ఒక ప్రయోగం చేశాడు. మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘మదర్‌ ఇండియా’ ప్రీమియర్‌ షో సన్నివేశాన్ని చిత్రీకరించి ఈ కథలో దానిని ఇరికించాడు. ప్రీమియర్‌ షోకి హాజరైన దిలీప్‌ కుమార్, గురుదత్, రాజకుమార్, రాజేంద్రకుమార్, గీతాదత్, మహామ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌లను ఇందులో చూపించాడు. సినిమాతోబాటు ఇందులో పాటలు కూడా సూపర్‌ హిట్లయ్యాయి. వాటిలో ‘ఖోయా ఖోయా చాంద్‌’, ‘రిమ్‌ ఝిమ్‌ కె తరానే లేకే’, ‘తేరి ధూమ్‌ హర్‌ కహి’ పాటల్ని ముందుగా చెప్పుకోవాలి. 1961లో దేవానంద్‌ నవకేతన్‌ పతాకం మీద ‘హమ్‌ దోనో’ సినిమా నిర్మించారు. కథ, స్కీన్ర్‌ ప్లే విజయానంద్‌ సమకూర్చగా దర్శకత్వ సహకారాన్ని విజయానంద్‌కు అమర్జీత్‌ అందించాడు. దేవానంద్, నందా ఇందులో జంటగా నటించారు. దేవానంద్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా కూడా సూపర్‌ హిట్టే. ఈ సూపర్‌ హిట్‌ సినిమాని యాభై ఏళ్ల తరువాత ...అంటే 2011లో రంగుల్లోకి మార్చి విడుదల చేస్తే శతదినోత్సవం చేసుకుంది. ఇదే చిత్రాన్ని 1975లో ‘రాముని మించిన రాముడు’ పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. జయదేవ్‌ సంగీతం అందించిన ‘భి న జావో ఛోడ్‌ కర్‌’, ‘అల్లా తేరో నామ్‌ ఈశ్వర్‌ తేరో నామ్’, ‘మై జిందగీ కా సాథ్‌’ పాటలు నేటికీ వినిపిస్తూనే వున్నాయి. 1963లో విజయానంద్‌ కథ, స్కీన్ర్‌ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించిన ‘తేరే ఘర్‌ కే సామనే’ విడుదలై బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. అందులో దేవానంద్‌కు జోడిగా నూతన్‌ నటించింది. టైటిల్‌ సాంగ్‌ తోబాటు ‘దేఖో రూఠాన కరో’, ‘సన్‌ లే తు దిల్‌ కి సదా’ పాటలు హిట్లుగా నిలిచాయి. ‘తేరే ఘర్‌ కే సామనే’ (1963) చిత్రంలో కుతుబ్‌ మీనార్‌ వద్ద చిత్రీకరించిన ‘దిల్‌ క భవర్‌ కారే పుకార్‌’ విలక్షణంగా వుంటుంది. ఈ పాటపాడుతూ స్నేహితులుగా దేవానంద్, నూతన్‌ కుతుబ్‌ మీనార్‌ ఎక్కుతారు. వారు కిందకు రాగానే ప్రేమికులౌతారు. అలాగే ‘ఏక్‌ ఘర్‌ బనావూంగా’ పాటలో నూతన్‌ని విస్కీ గ్లాసులో చూపించి ఆశ్చర్యపరచాడు విజయానంద్‌. దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలనూ హిట్‌ చేసిన విజయానంద్‌ను బాలీవుడ్‌ అప్పటినుంచే ‘గోల్డీ’ పేరుతో సంభోదించ సాగింది.


సంచలన చిత్రంగా గైడ్‌ ...
దేవానంద్‌ 1965లో ఆర్‌.కె.నారాయణ్‌ ప్రసిద్ధ నవల ‘ది గైడ్‌’ను అదే పేరుతో (గైడ్‌) సినిమాగా మలిచారు. విజయానంద్‌ ‘గైడ్‌’కు దర్శకుడు. ఈ నవలను సినిమాగా నిర్మించనున్నానని దేవానంద్‌ ప్రకటించగానే శ్రేయోభిలాషులంతా అతణ్ణి హెచ్చరించారు. ఒక వివాహిత నాట్యకారిణి తన నాట్యకళను పరిరక్షించుకోవడం కోసం వేరొకరి పంచన చేరడం భారతీయ ప్రేక్షకులు హర్షించరని నిరుత్సాహపరచారు. కానీ మొక్కవోని దీక్షతో విజయానంద్‌ ఆ చిత్రకథకు మార్పులుచేసి స్కీన్ర్‌ ప్లే మార్చి రాశాడు. తనదైన శైలిలో అద్భుతంగా మలిచాడు. ప్రేక్షకులు ‘గైడ్‌’ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. నవల వేరు. సినిమా వేరు. సినిమాను ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని తీయాల్సి వుంటుంది. తదనుగుణంగా కథలో మార్పులు సహజం. గోల్డీ చేసింది అదే! ఈ చిత్రం స్క్రిప్టుకు పదును పెట్టేందుకు గోల్డీ ఖండ్లా హిల్‌ స్టేషన్‌లో 18 రోజులు మకాం పెట్టి మెరుగులు దిద్దాడు. విజయానంద్‌ ఆ మార్పులు చేయకుంటే సినిమా ఫ్లాప్‌ అయివుండేదనేది సినీపండితుల ఏకాభిప్రాయం. ఉదయపూర్‌ ప్రాంతంలో షూటింగు ప్రారంభించి 80 షిఫ్టుల్లో సినిమా పూర్తిచేసి విజయం సాధించాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలయ్యాక హాలీవుడ్‌ దృష్టి విజయానంద్‌ మీద పడింది. అందుకు కారణం ఇదే చిత్రాన్ని టెడ్‌ డేనియల్‌ స్కి ఇంగ్లీషులో నిర్మిస్తే అది ఫ్లాప్‌ అయింది. టెడ్‌ ఇంగ్లీషు వర్షన్‌ని నవలలో ఉన్నట్లే యధాతధంగా నిర్మిస్తే, విజయానంద్‌ మాత్రం ఆ కథకు అవసరమైన మార్పులు చేసి నిర్మించి విజయం సాధించాడు.

మురిపించిన జంట చిత్రాలు...
గైడ్‌ (1965) చిత్రం నిర్మాణంలో ఉండగానే నిర్మాత నాసిర్‌ హుసేన్‌ విజయానంద్‌ను తనకు ఒక మంచి కమర్షియల్‌ సినిమా తీసిపెట్టమని కోరాడు. ఇద్దరు కలిసి ఒక గొప్ప కామెడీ త్రిల్లర్‌ కథను అల్లారు. అదే షమ్మికపూర్, ఆశాపరేఖ్‌ నటించిన బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రం ‘తీస్రీమంజిల్‌’. అసలు నాసిర్‌ హుసేన్‌ విజయానంద్‌ని దర్శకుడుగా ఎంచుకోవడమే ఈ సినిమా విజయానికి తొలి అడుగు పడింది. ప్రేమ కథల చిత్రీకరణలో, పాటల చిత్రీకరణలో విజయానంద్‌ది విభిన్న శైలి అనే విషయం నాసిర్‌ హుసేన్‌కు తెలుసు. సంగీత భరితంగాను, సస్పెన్స్‌ త్రిల్లర్‌గాను ఈ చిత్రం మంచి హిట్‌గా పేరు తెచ్చుకుంది. టాప్‌ 25 హిందీ చిత్రాల్లో ఈ సినిమా పేరు నిలుపుకుంది. అసలు ఈ సినిమాలో దేవానంద్‌ హీరోగా నటించాల్సింది. నాసిర్‌తో చిన్న భేదాభిప్రాయం రావడంతో ఆ పాత్ర షమ్మి కపూర్‌ పరమైంది. ఈ సినిమా సంగీతానికి మజ్రూహ్‌ సుల్తాన్‌ పురి, రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ పేరు సూచించాడు. అద్భుతమైన పాటలతో సినిమా సూపర్‌ హిట్టయింది. ముఖ్యంగా ‘ఓ హసీనా జుల్ఫోం వాలే’, ‘ఆజాజా’ పాటల చిత్రీకరణ పరమాద్భుతంగా వుంటుంది. ‘గైడ్‌’ చిత్రం సాధించిన విజయం తరువాత విజయానంద్‌ ఒక మంచి వినోదభరితమైన సినిమాను నిర్మించాలని విభిన్నమైన కథాంశాన్ని ఎన్నుకున్నాడు. అదే ‘జ్యూవెల్‌ తీఫ్‌’ (1967) సినిమా. విజయానంద్‌ ఎంత దూరదృష్టి కలవాడంటే... ఈ కొత్త సినిమాలో మరలా వహీదా రెహమాన్‌ను తీసుకుంటే సినిమాను ప్రేక్షకులు ‘గైడ్‌’తో పోల్చే ప్రమాదముంటుందని పసిగట్టి వైజయంతిమాలను హీరోయిన్‌గా ఎన్నుకున్నాడు. టైటిల్‌ రోల్‌కి అశోక్‌ కుమార్‌ను తీసుకున్నాడు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ సంగీతం మిళితమైన ఈ చిత్రం విజయానంద్, దేవానంద్‌ ఇద్దరి కీర్తి ప్రతిష్టలను ఎవరెస్టు శిఖరానికి చేర్చింది. ఈ సినిమాలో సస్పెన్స్‌ ఒక్కటే కాదు. చిత్రంలోని పాటల చిత్రీకరణకు విజయానంద్‌కు జోహార్లు చెప్పాలి. దేవానంద్‌ మీద చిత్రీకరించిన ‘ఏ దిల్‌ న హోతా బేచారా’, వైజయంతిమాలమీద చిత్రీకరించిన ‘రులాకే గయా సపనా మేరా’, దేవానంద్, వైజయంతి మాల మీద చిత్రీకరించిన యుగళగీతం ‘ఆస్మాన్‌ కే నీచే హమ్‌ ఆజ్‌ అపనే పీఛే’ పాటలు ఒక ఎత్తైతే, క్లైమాక్స్‌ లో వచ్చే డ్రమ్‌ సాంగ్‌ ‘హోటోంమే ఐసి బాత్‌’ ఒక్కటి ఒక ఎత్తు. ఆ రోజుల్లోనే ఈ సినిమా మూడున్నర కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. ఆ సంవత్సరం విడుదలైన సినిమా వసూళ్లల్లోకెల్లా మొదటగా నిలిచింది.

లతాజీ తో మీరాభాజన్‌ పాడించిన విజయానంద్‌...
1970లో గుల్షన్‌ రాయ్‌ కోసం విజయానంద్‌ నిర్మించిన ‘జానీ మేరా నామ్’ సినిమా ఒక పెద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అందులో దేవానంద్, హేమామాలిని ముఖ్య తారాగణం. ఈ సినిమాలో లతామంగేష్కర్‌ చేత ఒక మీరా భజన్‌ పాడించాలనేది విజయానంద్‌ కోరిక. కానీ మీరాబాయి భజనలను తన తమ్ముడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ కోసం తప్ప ఇతరులకు పాడనని అంతకు ముందే లతాజీ ప్రకటించి వుంది. విజయానంద్‌ ఎలాగైనా మీరా భజన్‌ను లతాజీ ఆలపించేలా చూడమని కల్యాణ్‌ జీతో చెప్పాడు. లతాజీ దేవానంద్, విజయానంద్‌ల స్టార్డంను దృష్టిలో వుంచుకొని మీరా భజన్‌ పాడేందుకు ‘సరే’నంది. అలా ‘మోసే మౌరా శ్యామ్‌ రూఠా, కహే మౌరా భాగ్‌ ఫూతా’ భజన్‌కు ఈ సినిమాలో అవకాశం దక్కింది. ఆ రోజుల్లో రాజకపూర్‌ ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమా నిర్మిస్తున్నాడు. అలాంటి పేరే నిర్ధారించిన విజయానంద్‌ను కొందరు శ్రేయోభిలాషులు సినిమా పేరు మార్చమని సలహా ఇచ్చినా ‘జానీ మేరా నామ్’ పేరునే ఖాయం చేశాడు విజయానంద్‌. రాజకపూర్‌ సినిమా ఫ్లాప్‌ చిత్రంగా ముద్ర పడగా, గోల్డీ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అద్భుతమైన స్కీన్ర్‌ ప్లే, ఎడిటింగ్‌ శాఖలు నిర్వహించిన గోల్డీకి రెండు ఫిలింఫేర్‌ బహుమతులు లభించాయి. ఇందులో తొలి పాట ‘ఓ మేరే రాజా ఖఫా న హోనా, దేర్‌ సే ఆయీ, దూర్‌ సే ఆయీ మజబూరీ థీ ఫిర్‌ మైనే వాదా తొ నిభాయా’ను బీహార్‌లోని రాజగిరి వద్దగల రోప్‌ వే మీద చిత్రీకరిస్తుండగా, బీహార్‌ అభిమానులు దేవానంద్‌ మీద వాలిపోయారు. ఆ అభిమాన దాడిలో దేవానంద్‌ చొక్కా చిరిగింది. కానీ హేమామాలినికి మాత్రం ఏమీ కాలేదు.


ఇతర విశేషాలు...

‘జానీ మేరానామ్’ సినిమా నిర్మాణ సమయంలోనే విజయానంద్‌ తండ్రి కాలం చేశారు. తరువాత విజయానంద్‌ ‘ది సిటాడెల్‌’ నవల ఆధారంగా ‘తేరే మేరె సప్నే’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అందులో విజయానంద్‌ ఒక డాక్టరు పాత్రను కూడా పోషించాడు. ఈ చిత్రం పెద్ద సూపర్‌ హిట్‌ కాకపోయినా బాగానే ఆడింది.

* ఆ తరువాత 1973లో ‘బ్లాక్‌ మెయిల్‌’, ‘ఛుపా రుస్తుం’, 1976లో ‘బుల్లెట్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించినా అవి అంతగా విజయవంతం కాలేదు. తరవాత నవకేతన్‌ నిర్మించిన సినిమాలకు దేవానందే దర్శకత్వం వహించ సాగడంతో విజయానంద్‌ దర్శకత్వ భారాన్ని తగ్గించుకున్నాడు. విజయానంద్‌ ఆచార్య రజనీష్‌కు చేరువై అతని సూచన మేరకు లవ్లీన్‌ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆ అమ్మాయి రష్యన్‌ టైమ్స్‌ అనే పత్రికలో విజయానంద్‌ ఇంటర్వ్యూ కోసం వచ్చి రజనీష్‌ సలహాతో విజయానంద్‌ని వివాహమాడింది. ఈ వివాహ బంధం ఎన్నోఏళ్లు నిలవలేదు. తరువాత విజయానంద్‌ తన చెల్లెలి కూతురు సుష్మాకోహ్లిని వివాహమాడాడు. వారికి వైభవ అనే కుమారుడు కలిగాడు. 1994లో ప్రసారమైన టెలివిజన్‌ సీరియల్‌ ‘తెహ్కికాత్‌’లో విజయానంద్‌ డిటెక్టివ్‌ ‘శామ్’గా నటించాడు. కొంతకాలం కేంద్రీయ సెన్సార్‌ బోర్డుకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. సినిమాలకు రేటింగ్‌ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించడంతో విభేదించి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. 70వ పడిలో గుండెపోటు వచ్చి 23 ఫిబ్రవరి 2004లో చనిపోయాడు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.