ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు

తడి సినిమాల పేర్లు చెబితే చాలు అతడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడని ఇట్టే పోల్చుకోవచ్చు. రెండు సార్లు ఆస్కార్లు గెల్చుకున్నాడు. వంద మేటి బ్రిటిష్‌ చిత్రాల జాబితాలో అతడివి ఏడు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే మేటి దర్శకుల్లో అతడు తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అమెరికా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం పొందాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పొందాడు. ఇంత ప్రాచుర్యం పొందిన ఆ దర్శకుడే డేవిడ్‌ లీన్‌. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ‘ద బ్రిడ్జ్‌ ఆన్‌ ద రివర్‌ క్వాయ్‌’, ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’, ‘డాక్టర్‌ జివాగో’, ‘ఎ పాసేజ్‌ టు ఇండియా’, ‘గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’, ‘ఆలివర్‌ ట్విస్ట్‌’, ‘బ్రీఫ్‌ ఎన్‌కౌంటర్‌’లాంటి సినిమాలను అందించాడు. ఇంగ్లండ్‌లో 1908 మార్చి 25న పుట్టిన ఇతడు, చిన్నప్పుడు మామయ్య బహుమతిగా ఇచ్చిన కెమేరా వల్ల ఫొటోగ్రఫీ, సినిమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో ఓ సినీ స్టూడియోలో టీబాయ్‌గా చేరి, క్లాప్‌ బాయ్‌గా మారాడు. ఆ తర్వాత అన్ని పనులూ ఉత్సాహంగా చేస్తూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎడిగాడు. ‘ఇన్‌ ఉచ్‌ వియ్‌ సెర్వ్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. మరపురాని సినిమాలెన్నో అందించి, ఎన్నో పురస్కారాలు అందుకున్న ఇతడు 1991 ఏప్రిల్‌ 16న తన 83వ ఏట లండన్‌లో మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.