అమెరికా అధ్యక్షుడైన నటుడు!

పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు... రకరకాల పనులు చేస్తూ ఎదిగి... నటుడిగా పేరు తెచ్చుకుని... చివరికి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. అతడే అమెరికా 40వ అధ్యక్షుడు రోనాల్డ్‌ విల్సన్‌ రీగన్‌. ఇల్లినాయిస్‌లో 1911 ఫిబ్రవరి 6న పుట్టిన రోనాల్డ్‌ విల్సన్‌ రీగన్‌ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉంటూ ‘జాక్‌ ఆఫ్‌ ఆల్‌ ట్రేడ్స్‌’ అనిపించుకున్నాడు. తండ్రి జాక్‌ ఓ సేల్స్‌మన్‌. తల్లి నెల్లీ క్లైడ్‌ మత సంబంధ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేది. రోనాల్డ్‌ రీగన్‌ హైస్కూలు రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నటనతో పాటు, ఆటలు, స్టోరీటెల్లింగ్‌ కళలలో పాలు పంచుకున్నాడు. ఈత నేర్చుకునే వారికి, జల క్రీడల్లో పాల్గొనేవారికి ప్రమాదాలు జరిగితే వెంటనే వారిని రక్షించే ‘లైఫ్‌గార్డ్‌’ పని అతడి మొదటి ఉద్యోగం. ఆరేళ్ల ఉద్యోగంలో అతడు 77 మందిని కాపాడాడు. కాలేజి రోజుల్లో క్యాంపస్‌ రాజకీయాలు, క్రీడలు, నాటకాల్లో బహుముఖంగా ప్రతిభ చూసిస్తూ పాల్గొనేవాడు. డిగ్రీ చేతికొచ్చాక రేడియో ఎనౌన్సర్‌గా పనిచేశాడు. క్రీడా పోటీలపై వ్యాఖ్యానాలు చేసేవాడు. ఆ తర్వాత ‘వార్నర్‌ బ్రదర్స్‌’ స్టూడియోస్‌ స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొని నటుడయ్యాడు. తొలిసారిగా ‘లవ ఈజ్‌ ఆన్‌ ద ఎయిర్‌’ (1937)లో నటించాడు. ఆపై రెండేళ్లలోనే 19 సినిమాల్లో రకరకాల పాత్రల్లో మెరిశాడు. ‘డార్క్‌ విక్టరీ’, ‘శాంటా ఫెట్రైల్‌’, ‘క్నుటే రాక్నే ఆల్‌ అమెరికన్‌’, ‘కింగ్స్‌ రో’, ‘ద వాయిస్‌ ఆప్‌ ద టర్టిల్‌’, ‘జాన్‌ లవ్స్‌ మేరీ’, ‘ద హ్యాస్టీ హార్ట్‌’, ‘క్యాటిల్‌ క్వీన్‌ ఆఫ్‌ మోంటానా’, ‘ద కిల్లర్స్‌’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీల్లో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆపై ఆయన అడుగులు నెమ్మదిగా రాజకీయ రంగం వైపు పడ్డాయి. కాలిఫోర్నియా గవర్నర్‌గా రెండుసార్లు ఎన్నికై మంచి కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. ఆపై అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించి మంచి కార్యదక్షుడిగా పేరొందారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.