హాలీవుడ్‌ నటి బిబి ఆండర్సన్‌ కన్నుమూత

హాలీవుడ్‌ సైలాజికల్‌ డ్రామా చిత్రం ‘పెర్సొనా’ అంటే తెలియని వారుండరు. అందులో నర్సు అల్మా పాత్రలో బీబీ ఆండర్సన్‌ నటించగా, పేషెంట్‌గా లివ్‌ ఉల్మాన్‌ నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఎనభైమూడు సంవత్సరాల అలనాటి నటి ఆండర్సన్‌ స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఏప్రిల్‌ 14, 2019న కన్నుమూశారు. తొలుత ఇంగ్‌మార్‌ బెర్గ్‌మాన్‌ దర్శకత్వంలో ఓ సబ్బుల కంపెనీలో వాణిజ్య ప్రకటనకు పనిచేశారు. ఆ తరువాత స్టాక్‌హోమ్‌లోని ‘రాయల్‌ డ్రామాటిక్‌ థియేటర్‌ స్కూల్‌’లో యాక్టింగ్‌ కోర్సులో చేరింది. బెర్గ్‌మాన్‌ దర్శకత్వంలో సుమారు పన్నెండు చిత్రాల్లో పనిచేసింది బీబీ. వాటిలోని ఒక చిత్రమే ‘పెర్సొనా’. ఈ సినిమా ఆండర్సన్‌కు ఎక్కడ లేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘ది గాళ్స్‌’, ‘బ్లో హాట్‌ - బ్లో కోల్డ్‌’, ‘ది టచ్‌’ ఆ తరువాత పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. బీబీ మొదట కెజిల్‌ గ్రేడ్‌ అనే దర్శకుడిని పెళ్లాడింది. ఆ తరువాత స్వీడన్‌కే చెందిన పెర్‌ హాల్‌మార్క్‌తో 1971 నుంచి 1981 వరకు కలిసున్నారు. చివరగా 2004 గాబ్రియేల్‌ మెరాను పెళ్లిచేసుకొంది. నవంబర్‌ 11, 1935లో స్వీడన్‌ దేశంలో పుట్టిన ఆండర్సన్‌కి ఒక కుమార్తె కూడా ఉంది. పేరు జెన్నీ గ్రేడ్‌. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.