
మీడియా ఆమెను ‘గాడెస్ ఆఫ్ పాప్’గా అభివర్ణిస్తుంది. మగవాళ్ల ఆధిపత్యం అధికంగా ఉండే పాప్ సంగీత ప్రపంచంలో ఒక మహిళగా విజయ కేతనాలు ఎగరేయడమే కాకుండా, మంచి హాలీవుడ్ నటిగా కూడా ముద్ర వేసింది. ఆమే ఛెర్. పూర్తి పేరు ఛెర్లిన్ సర్కిసియన్. ఆరు దశాబ్దాలు సుదీర్ఘమైన ప్రస్థానంలో ఆమె గాయనిగా ఉర్రూతలూగించింది, నటిగా నాటకాలు, టీవీలు వెండితెరలపై మెప్పించింది. ఆమె ఆల్బమ్‌లు, పాటలు 10 కోట్లు అమ్ముడుపోయి, పాప్ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనాన్నే మిగిల్చాయి. ‘సిల్క్‌వుడ్’, ‘మాస్క్’, ‘ద విచెస్ ఆఫ్ ఈస్ట్విక్’, ‘మూన్‌స్ట్రక్’లాంటి ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డుతో పాటు, ఆమె తన కెరీర్లో గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, కేన్స్, కెన్నడీ సెంటర్ లాంటి అవార్డులు, పురస్కారాలు గెలుచుకుంది. కాలిఫోర్నియాలో 1946 మే 20న పుట్టిన ఆమె ఇప్పుడు తన 74వ పుట్టిన రోజును జరుపుకుంటోంది.