యాక్టర్... సింగర్... డ్యాన్సర్... కొరియోగ్రాఫర్... టీవీ ప్రెజెంటేటర్... ఇలా బహుముఖమైన నైపుణ్యాలు ఉండడం వేరు. ఆ కళలలో మేటిగా ఏకంగా 76 ఏళ్ల పాటు ఉత్తముడిగా పేరు పొందడం వేరు. అలా చెప్పుకోగలిగిన హాలీవుడ్ నటుడే ‘ఫ్రెడ్ యాస్టైర్’. హాలీవుడ్లో ‘100 ఏళ్లలో 100 స్టార్స్’ పేరిట అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే చేసి జావితా రూపొందిస్తే, అందులో ఐదవవాడిగా నిలిచాడు ఇతడు. సినిమాల్లో నృత్యాల చరిత్ర అనేది అతడితోనే మొదలైందని చెబుతారు. ప్రపంచాన్ని తమ నృత్యాలతో ఆకట్టుకున్న మైకేల్ జాక్సన్, మాధురీ దీక్షిత్, గ్రెగరీ హైన్స్ లాంటి ఎందరో కళాకారులు తమకు స్ఫూరినిచ్చింది యాస్టైర్ అని చెప్పడం విశేషం.