నటనలో అతడి స్టైలే వేరు

అభినయంలో అతడు అలవర్చుకున్న ప్రత్యేకమైన శైలి అతడికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ గొప్ప నటుడిగా ప్రాచుర్యాన్ని కల్పించింది. అందుకు ఆనవాళ్లుగా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్, మూడు బాఫ్టా, రెండు క్రిటిక్స్‌ ఛాయిస్, ఓ గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన యాక్టర్స్‌ గిల్డ్‌... ఇలా ఎన్నో పురస్కారాలు అతడి కాతాలో పడ్డాయి. అతడే గ్యారీ ఓల్డ్‌మన్‌. నాటకం, బుల్లితెర, వెండితెరపై అతడి ప్రస్థానం విలక్షణంగా సాగింది. ‘రిమెంబరెన్స్‌’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అతడు, ‘సిద్‌ అండ్‌ నాన్సీ’, ‘ప్రికప్ యువర్ ఇయర్స్‌’, ‘స్టేట్‌ ఆఫ్‌ గ్రేస్‌’, ‘జెఎఫ్‌కే’, ‘డ్రాక్యులా’, ‘ట్రూ రొమాన్స్‌’, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’, ‘ఎయిర్‌ ఫోర్స్ వన్‌’, ‘ద కాంటెండర్‌’, ‘హ్యారీపాటర్‌ సీక్వెల్స్‌’, ‘ద డార్క్‌ నైట్‌ ట్రిలాజీ’, ‘డాన్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌’, ‘డార్కెస్ట్‌ అవర్‌’లాంటి ఎన్నో సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడి సినిమాలు ఏకంగా 11 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేయడం విశేషం. ఇంగ్లండ్‌లో 1958 మార్చి 21న పుట్టిన ఇతడు, చిన్నతనంలోనే సంగీత వాయిద్యాలు నేర్చుకుని తర్వాత నటన పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. ఓ పక్క జీవనం కోసం పోర్టర్, బూట్లు అమ్మడం, పందులు కాయడంలాంటి పనులు చేస్తూనే నటనను అభ్యసించి నాటకాల్లో వేషాలు వేసేవాడు. నటుడిగా పేరు సంపాదించి బుల్లితెర, వెండితెరలపై అవకాశాలు అందుకుని మంచి నటుడిగా నిరూపించుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.