అక్క స్ఫూర్తితో... పట్టుదలతో...

నిమిదేళ్ల వయసులో అక్క నాటకం వేస్తుంటే చూసి నటుడవ్వాలనుకున్నాడు. అక్క టీచర్‌ దగ్గరకు వెళ్లి నేనూ నటిస్తానన్నాడు. ఆ టీచర్‌ నీకు 13 ఏళ్లు వచ్చాక కనబడు అంటే, సరిగ్గా పదమూడో పుట్టిన రోజునాడు వెళ్లి ఆ మాట గుర్తు చేశాడు. అతడి పట్టుదలకు ఆశ్చర్యపోయిన ఆ టీచర్‌ ప్రోత్సాహంతో నటుడయ్యాడు. అమ్మ అతడిని మిలటరీ స్కూల్లో చేర్పిస్తే అక్కడ యూదుడైన కారణగా రౌడీయజానికి, లైంగిక వేధింపులకు గురై పారిపోయి వచ్చేశాడు. ఆ తర్వాత నటనపైనే దృష్టి పెట్టి పదిహేనేళ్లకి నటనాప్రస్థానం మొదలు పెట్టాడు. నాటకాలు, టీవీలు, సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడే నటుడిగా, స్క్రీన్‌రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, గీత రచయితగా, రచయితగా బహుముఖంగా ఎదిగిన జెనె విల్డర్‌. అసలు పేరు జరోమ్‌ సిల్బర్‌మన్‌. ‘ద ఉమన్‌ ఇన్‌ రెడ్‌’, ‘విల్లీ వోన్కా అండ్‌ ద చాకొలెట్‌ ఫ్యాక్టరీ’, ‘సిల్వర్‌ స్ట్రీక్‌’, ‘స్టర్‌ క్రేజీ’, ‘సీ నో ఈవిల్, హియర్‌ నో ఈవిల్‌’, ‘ఎనదర్‌ యు’, ‘బోనీ అండ్‌ క్లైడ్‌’, ‘ద ప్రొడ్యూసర్స్‌’, ‘బ్లేజింగ్‌ శాడిల్స్‌’, ‘యంగ్‌ ఫ్రాంకెన్‌స్టీన్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆ వ్యాధి నివారణకు స్వచ్చందంగా కృషి చేశాడు. ఎన్నో అవార్డులు అందుకున్న ఇతడు అమెరికాలో 2016 ఆగస్టు 29న తన 83వ ఏట మరణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.