ఆస్కార్‌ ఇస్తే తీసుకోను!


ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డు కోసం అర్రులు చాచే నటులు ఎందరో ఉంటే, ‘నాకు ఆస్కార్‌ ఇవ్వకండి. ఇచ్చినా తీసుకోను’ అని ముందే హెచ్చరించిన నటుడు జార్జి క్యాంప్‌బెల్‌ స్కాట్‌. అమెరికాలో నాటక, సినీ రంగాల నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరు పొందిన జార్జి సి. స్కాట్‌ ఈ మాటను అహంకారంతో అనలేదు. ‘ఎవరి నటనా మరొకరి నటనకు సాటిరాదు. ప్రతి వారి అభినయం ప్రత్యేకమైనదే’ అనే అభిప్రాయంతోనే. అతడికి ‘ప్యాటన్‌’ అనే సినిమాలో యూఎస్‌ జనరల్‌ జార్జి ఎస్‌. ప్యాటన్‌ అనే పాత్రలో అభినయానికి ఆస్కార్‌ ప్రకటించారు. కానీ చెప్పినట్టుగానే అతడు తీసుకోలేదు. ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌లవ్‌’, ‘ఎ క్రిస్ట్‌మస్‌ కేరోల్‌’, ‘ద ఎక్జార్సిస్ట్‌3’ సినిమాల్లో అతడి నటన ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించింది.

                             

వర్జీనియాలో 1927 అక్టోబర్‌ 18న పుట్టిన స్కాట్, చిన్నప్పుడు పెద్ద రచయితను కావాలనుకునేవాడు. అనుకున్నట్టుగానే కొన్ని కథలు రాశాడు కానీ ఎక్కడా ప్రచురితం
కాలేదు. పెద్దయ్యాక నవల రాయాలనుకున్నాడు కానీ తనకే సంతృప్తిగా అనిపించిక పూర్తి చేయలేకపోయాడు. తర్వాత పాత్రికేయం, అభినయంపై మక్కువ పెంచుకున్నాడు. నాటకాల్లో, టీవీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెండితెరపై ‘ద హేంగింగ్‌ ట్రీ’, ‘అనాటమీ ఆఫ్‌ ఎ మర్డర్‌’, ‘ద హస్టియర్‌’, ‘ద లిస్ట్‌ ఆఫ్‌ ఆడ్రియన్‌ మెస్సెంజర్‌’లాంటి ఎన్నో సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నో అవార్డులు అందుకున్న స్కాట్‌ 1999 సెప్టెంబర్‌ 22న తన 71 ఏళ్ల వయసులో మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.