టైటానిక్‌... ఆమెకో జ్ఞాపకం..

నటి... 87 ఏళ్ల వయసులో నటించడమే అరుదు. పైగా ఆ నటనకి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా పొందడం మరీ అరుదు. అలాంటి అరుదైన నటే ‘గ్లోరియా స్టువార్ట్‌’. ఈ పేరు చెప్పడం కన్నా ‘టైటానిక్‌’ సినిమాలో వృద్ధురాలి పాత్రలో నటించిందంటే చటుక్కున గుర్తు పడతారు అందరూ. టైటానిక్‌ ఓడ ప్రమాదంలో బతికి బయట పడిన మహిళగా తన జ్ఞాపకాలను పంచుకునే 101 ఏళ్ల ముదుసలి రోజ్‌ డాసన్‌ కాల్వెర్ట్‌ పాత్రలో ఆమె నటన ప్రపంచ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్రలో నటనకి ఆమె ఓ ఆస్కార్‌ నామినేషన్‌తో పాటు స్క్రీన్‌ గిల్డ్‌ అవార్డు అందుకుంది. అంతేకాదు ఈమె తన 94 ఏళ్ల వయసులో కూడా ‘ల్యాండ్‌ ఆఫ్‌ ప్లెంటీ’ సినిమాలో నటించి ఆకట్టుకోవడం చెప్పుకోదగిన సంగతే. 1910లో ఇదే రోజు పుట్టిన గ్లోరియా నటిగా, విజువల్‌ ఆర్టిస్ట్‌గా, ఉద్యమకారిణిగా అమెరికాలో చిరపరిచితురాలే. చిన్నప్పుడే నాటకాలలో రాణించిన ఈమె, ‘ది ఓల్డ్‌ డార్క్‌ హౌస్‌’ (1932), ‘ది ఇన్విజిబుల్‌ మ్యాన్‌’ (1933), ‘ద త్రీ మస్కెటీర్స్‌’ (1939) లాంటి చిత్రాల ద్వారా ఆకట్టుకుంది. తర్వాత నటనకు స్వస్తి చెప్పి చిత్రకారిణిగా, సూక్ష్మ పుస్తకాల రూపకర్తగా, బోన్‌సాయ్‌ నిపుణురాలిగా మారింది. తిరిగి 1982లో నటప్రస్థానం ప్రారంభించింది. నటనతో పాటు పర్యావరణ ఉద్యమకారిణిగా కూడా పని చేసింది. ఈమె 2010లో తన వందవ ఏట మరణించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.