ప్రపంచ మేటి నటుడు

ప్రపంచ వ్యాప్తంగా మేటి నటులుగా అలరించిన వారి జాబితా తయారు చేస్తే అందులో మార్లన్‌బ్రాండో పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అంతగా ప్రాచుర్యం సంపాదించిన ఇతడి నటన ఎలాంటిదో తెలియాలంటే ‘గాడ్‌ఫాదర్‌’ (1972) సినిమా చూస్తే చాలు. ఆ సినిమాతో అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఇతడు ఆరు దశాబ్దాల పాటు వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అభిమానులను అలరించాడు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో ‘ఆన్‌ ద వాటర్‌ ఫ్రంట్‌’ (1954), ‘స్ట్రీట్‌ కార్‌ నేమ్‌డ్‌ డిజైర్‌’, ‘ద వైల్డ్‌ వన్‌’, ‘వివా జపాటా’, ‘సయొనారా’, ‘వన్‌ ఐడ్‌ జాక్స్‌’, ‘లాస్ట్‌ ట్యాంగో ఇన్‌ ప్యారిస్‌’, ‘ద మిస్సోరీ బ్రేక్స్‌’, ‘ద ఫార్ములా’, ‘సూపర్‌ మ్యాన్‌’, ‘అపొకలిప్స్‌ నౌ’ లాంటి సినిమాలు అతడి అభినయానికి దర్పణంగా నిలుస్తాయి. ప్రపంచంలోని ‘టాప్‌టెన్‌ మనీ మేకింగ్‌ యాక్టర్స్‌’ జాబితాలో ఒకడుగా స్థానం సంపాదించుకున్నాడు. ఆస్కార్‌లాంటి ఎన్నో అవార్డులను అందుకున్న ఇతడు ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావశీలురలో ఒకడుగా నిలిచాడు. అమెరికాలో 1924 ఏప్రిల్‌ 3న పుట్టిన మార్లన్‌ బ్రాండో, స్కూలు రోజుల్లోనే నాటకాలలో పాత్రలు ధరించాడు. సినీ చరిత్రను తన అభినయ కౌశలంతో సుసంపన్నం చేసిన ఇతడు, కాలిఫోర్నియాలో 2004 జులై 1న తన 80వ ఏట మరణించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.