వెండితెర రాణి...మొనాకో యువరాణి!

తండ్రికి ఇష్టం లేకపోయినా నటిగా మారాలని కోరుకుంది... అనుకున్నది సాధించి ఆస్కార్‌ అవార్డుతో పాటు ప్రశంసలు అందుకుంది... కానీ ఐదేళ్లకే నటనా ప్రస్థానానికి స్వస్తి పలికి మొనాకో యువరాజును పెళ్లాడి యువరాణిగా మారింది... కానీ 52 ఏళ్ల వయసులోనే వాహన ప్రమాదంలో మరణించింది. చీకటి వెలుగుల ఈ జీవన ప్రస్థానం గ్రేస్‌ ప్యాట్రిషియా కెల్లీది. ఇరవై ఏళ్ల వయసులో టీవీ నటిగా గుర్తింపు పొంది వెండితెరపైకి వచ్చింది. ‘మొగాంబో’ (1953) సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని, స్టార్‌డమ్‌ను అందుకుంది. గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు పొందింది. ‘కంట్రీగర్ల్‌’ (1954) సినిమాతో ఆస్కార్‌ సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ దర్శకత్వంలో ‘ఎమ్‌ ఫర్‌ మర్డర్‌’ (1954), ‘రేర్‌ విండో’ (1954), ‘టు క్యాచ్‌ ఎ థీఫ్‌’ (1955) సినిమాల్లో నటించి మెప్పించింది. ‘హైనూన్‌’, ‘హై సొసైటీ’లాంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈమె 26 ఏళ్ల వయసులోనే మొనాకో దేశపు యువరాజు రైనియర్‌ను పెళ్లాడి ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ మొనాకో’గా మారి రాచకుటుంబంలోకి అడుగుపెట్టింది. ఆమె సినిమాలను మొనాకో దేశంలో నిషేధించడం ఓ విశేషం. రాజభోగాలు అనుభవిస్తూనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి అనుకోని ప్రమాదంలో 1982 సెప్టెంబర్‌ 14న కన్నుమూసింది. 1929 నవంబర్‌ 12న పుట్టిన గ్రేస్‌కెల్లీ హాలీవుడ్‌ చరిత్రలో ఓ సంచలన తారగా మిగిలిపోయింది. ఆమె గౌరవార్థం 1993లో అమెరికా, మొనాకో దేశాలు ఆమె పేరిట స్టాంపులను విడుదల చేశాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.