మంగళ్‌యాన్‌ ప్రాజెక్టు కంటే ‘గ్రావిటీ’ బడ్జెట్‌ ఎక్కువ

అంతరిక్ష పరిశోధనల కథా నేపథ్యంతో హాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలొచ్చాయి. ఆ పరిశోధనలకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను ‘గ్రావిటీ’ (2013) చిత్రంలో చూపించినంత గొప్పగా మరే సినిమాలోనూ చూపించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రతి ప్రేక్షకుడూ అంతరిక్షంలో ఉన్నట్లుగానే అనుభూతి చెందుతారు. మరి ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా, వాస్తవికతకు అత్యంత దగ్గరగా చిత్రీకరించిన ఆ గొప్ప దర్శకుడు అల్ఫాన్సో క్యురాన్‌. ఈ చిత్రం 2013లో విడుదలై.. ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించింది. దాదాపు వంద మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 723 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. మరి ఇంతటి ఆదరణ దక్కించుకున్న ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని తెరకెక్కించడానికి చిత్ర బృందం ఎన్నో కష్టనష్టాలకోర్చిందో తెలుసా?అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ‘హబుల్‌’ టెలిస్కోప్‌ పాడవుతుంది. దానికి మరమ్మతులు చేయడం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘నాసా’, ‘ఎక్స్‌ప్లోరర్‌’ అనే స్పేస్‌ షటిల్‌ను అక్కడికి పంపుతుంది. ఇందుకోసం పంపిన బృందంలో ఓ మహిళ సహా మరో ముగ్గురు వ్యోమ గాములు ఉంటారు. వీళ్లంతా అంతరిక్షంలో హబుల్‌ టెలిస్కోప్‌కు రిపేర్లు చేస్తుండగా.. వాళ్లకు భూమిపైనున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఓ హెచ్చరిక వస్తుంది. అంతరిక్షంలో మరో కక్ష్యలో తిరుగుతున్న రష్యా స్పేస్‌ షటిల్‌లో విస్పోటనం జరిగిందని, దానికి సంబంధించిన శకలాలు ప్రస్తుతం వారు ఉన్న స్పేస్‌ షటిల్, హబుల్‌ టెలిస్కోప్‌ను తాకనున్నాయని, దాని వల్ల అక్కడున్న అందరి ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతాయి. అంతలోనే ఆ శకలాలు వాళ్లున్న ప్రాంతం వైపు దూసుకురావడం, వాళ్ల స్పేస్‌ షటిల్‌ పాడవడం క్షణాల్లో జరిగిపోతాయి. మిగిలిన ముగ్గురు వ్యోమగాముల్లో ఒక్క మహిళ తప్ప అందరూ చనిపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె భూమికి ఎలా తిరిగి వచ్చింది? అన్నది చిత్ర కథాంశం. ఇందులో డా.రియాన్‌ స్టోన్‌గా ప్రధాన పాత్రల్లో శాండ్రాబుల్లక్‌ నటించింది. మరో కీలక పాత్రలో జార్జి కూన్లీ నటించారు.


నిజానికి ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నప్పుడు దర్శకుడు అల్ఫాన్సో ఈ చిత్రాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేయాలని అనుకున్నారట. సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగున్నరేళ్ల సమయం పట్టింది. దీనంతటికీ కారణం అల్ఫాన్సో తాను అనుకున్న కథను వాస్తవికంగా చిత్రీకరించాలనుకోవడమే. దానికి తగ్గ టెక్నాలజీ కోసం ఆయన చాలా రోజులు ఎదురుచూశారు. సినిమా దాదాపు 90నిమిషాల నిడివి ఉంటే అందులో 80శాతం గ్రాఫిక్స్‌ వర్క్‌ కనిపిస్తుంది. ఇది ‘అవతార్‌’ చిత్ర గ్రాఫిక్స్‌ కన్నా ఎక్కువ. కానీ, అదెక్కడా ప్రేక్షకులు కనిపెట్టే విధంగా ఉండదు. అంత వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది.


ఈ చిత్రంలోని ప్రారంభ సన్నివేశంలో వ్యోమగాములు స్పేస్‌ వాక్‌ చేస్తూ హబుల్‌ టెలిస్కోప్‌కు రిపేర్లు చేస్తుంటారు. తర్వాత మరో స్పేస్‌ సెటిల్‌ శకలాలు తగిలి అదంతా నాశనమైపోతుంది కదా. ఈ ఎపిసోడ్‌ మొత్తం 12 నిమిషాలకు పైగా ఉంటుంది. దీన్ని సింగిల్‌ షాట్‌లోనే చిత్రీకరించారు. ఇందుకు కెమెరాను 180డిగ్రీల కోణంలోనూ ఉపయోగించారు.
సినిమాలో తొలి ప్రమాదం జరిగాక రియాన్‌ స్టోన్‌ పాత్ర అంతరిక్షంలో వేగంగా చక్కర్లు కొట్టడం చూపిస్తారు. ఆ భ్రమణం భ్రమను సృష్టించడానికి చిత్ర బృందం చాలా కష్టపడిందట. శాండ్రాను సైకిల్‌ సీటుతో చేసిన ఒక రిగ్‌పై కూర్చోబెట్టి, ఆమె కుడి కాలును కదలకుండా ఓ దానికి కట్టేశారట. తర్వాత ఆ రిగ్‌తో పాటు కెమెరాను తిప్పుతూ అంతరిక్షంలో తిరుగుతున్న భ్రమను కల్పించారట. అంతేకాదు ఈ సీన్‌లో సూర్యుడు మెరుస్తూ కనిపిస్తున్నట్లు చేయడానికి చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేక కాంతి మంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. తర్వాత గ్రాఫిక్స్‌తో ఆమె అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నట్లు చూపించారు. ప్రారంభ ఎపిసోడ్‌లో 3:50 నిమిషాల దగ్గర జార్జి కూన్లీ స్పేస్‌లో తిరుగుతూ కెమెరా దగ్గరలో నుంచి వెళ్లిన ఒక క్లోజప్‌ షాట్‌ ఉంటుంది. ఆ సమయంలో అతని తలకి పెట్టుకున్న హెల్మెట్‌ గ్లాస్‌లో సీన్‌ చిత్రీకరిస్తున్న కెమెరా ప్రతిబింబం కనిపిస్తుంది.కెస్లర్‌ సిండ్రోమ్‌ ఓ స్పేస్‌ షటిల్‌లో ఏర్పడిన విస్పోటనం వల్ల ఆ శకలాలతో మరో అంతరిక్ష కేంద్రానికి, ఇతర శాటిలైట్లకు ప్రమాదం జరిగే గొలుసు విపత్తును కెస్లర్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తారట. ప్రముఖ నాసా శాస్త్రవేత్త డొనాల్డ్‌ జె.కెస్లెర్‌ 1978లో ఈ సిద్ధాంతాన్ని తొలిసారి ప్రతిపాదించారు.  అంతరిక్షంలో నిజంగా ఇలాంటి శిథిలాల గొలుసు విపత్తు ఎప్పుడోకప్పుడు ఏర్పడే ప్రమాదముందట. ఒకవేళ ఇలా జరిగితే కొన్ని దశాబ్దాల పాటు నింగిలోకి మనం శాటిలైట్లు, మరే ఇతర ఉపగ్రహాలను పంపించడం సాధ్యం కాదట.
అంతరిక్ష కేంద్రం భూమిని చుట్టే సమయమెంత?

ఈ చిత్రం మొత్తం నిడివి దాదాపు 90 నిమిషాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలో భూమిని ఒకసారి చుట్టి వచ్చేందుకు పట్టే సమయమిది. ఆ కేంద్రం దాదాపు గంటకు సుమారు 17,500 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ.. ప్రతి తొంభై నిమిషాలకు ఓసారి భూమిని చుట్టి వస్తుంటుంది. అలాగే శిథిలాల క్షేత్రం 90 నిమిషాల్లోనే భూమిని చుట్టిపారేస్తుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దాదాపు రూ.644కోట్లు (100మిలియన్‌ డాలర్లు) ఖర్చయితే.. ఇంతకంటే తక్కువ ఖర్చు (రూ.470 కోట్లు)తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళ్‌యాన్‌ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.