మూడు పాత్రల గొప్ప నటుడు!
ఆ నటుడు... హాలీవుడ్‌లో ‘100 ఏళ్లు... 100 మంది గొప్ప నటులు’ జాబితాలో స్థానం పొందాడు!
... అమెరికా కల్చరల్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందాడు!
... మూడు సినిమాల్లో మూడు పాత్రల్లో నటనకు గొప్ప నటుడిగా ప్రపంచఖ్యాతి పొందాడు!
కానీ... కేవలం 24 సంవత్సరాలకే చనిపోయాడు!!


పట్టుమని పాతికేళ్లు బతకని ఓ నటుడు, కేవలం మూడే సినిమాల్లో నటించినందుకు ఓ జీవితకాలంలో సంపాదించినంత పేరు ప్రఖ్యాతులు పొందడం చాలా అరుదు. చనిపోయిన అనంతరం ‘ఉత్తమ నటుడు’ విభాగంలో రెండు సార్లు ఆస్కార్‌ నామినేషన్లు పొందిన అరుదైన సంఘటన కూడా ఇతడి విషయంలోనే సాధ్యమైంది. అలాంటి అరుదైన నటుడే జేమ్స్‌ బైరన్‌ డీన్‌. 1931 ఫిబ్రవరి 8న పుట్టిన ఇతగాడు, 1955 సెప్టెంబర్‌ 30న చనిపోయాడు. ‘రెబల్‌ వితౌట్‌ ఎ కాజ్‌’ (1955), ‘ఈస్ట్‌ ఆఫ్‌ ఈడెన్‌’ (1955), ‘జెయింట్‌’ (1956) సినిమాల్లో నటనకు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. తొమ్మిదేళ్లకే తల్లిని కోల్పోయి, మావయ్య పంచన చేరాల్సివచ్చిన డీన్, చిన్నప్పుడే నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. మరో పక్క కార్‌ రేసింగ్‌ పట్ల కూడా ఆకర్షితుడయ్యాడు. టీవీల్లో నటిస్తూనే సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. ‘ఈస్ట్‌ ఆఫ్‌ ఈడెన్‌’లో పాత్రతో డీన్‌ అందరి కళ్లలోనూ పడ్డాడు. ఓ నవల ఆధారంగా మూడు తరాల కథగా తీసిన ఈ చిత్రంలో డీన్‌ నటనకు డీన్, మరణానంతరం ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్‌ పొందాడు. టీనేజీ పిల్లల్లో కనిపించే తీవ్రమైన ఒత్తిడి, భయాలు ఎలా ఉంటాయో అద్దం పట్టేలా డీన్‌ నటించిన ‘రెబల్‌ వితౌట్‌ కాజ్‌’ సినిమా అమెరికా యువతకు విపరీతంగా నచ్చేసింది. ‘జెయింట్‌’ సినిమా డీన్‌ మరణించిన తరువాత విడుదలైంది. ఇందులో నటనకు కూడా డీన్, మరణానంతరం ఉత్తమ నటుడి నామినేషన్‌ పొందాడు. మూడే మూడు కీలక పాత్రల్లో నటించి ప్రపంచ ఖ్యాతిని పొందిన డీన్, దురదృష్టవశాత్తూ తనకెంతో ఇష్టమైన కార్‌ రేసింగ్‌లో పాల్గొంటూ ప్రమాదానికి గురై మరణించడం విధి విచిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.