‘కింగ్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ నటుడు జెర్రీ స్టిల్లర్‌ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్‌ హాస్యనటుడు బుల్లితెరపై నవ్వులు పూయించిన జెర్రీ స్టిల్లర్‌ కన్నుమూశారు. తన భార్య అయిన అన్నే మీరాతో కలిసి కెరీర్‌ని ప్రారంభించిన జెర్రీ నాలుగు దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించాడు. అలాంటి ఆయన సోమవారం తన 92వ ఏట మరణించినట్టు జెర్రీ కుమారుడు బెన్‌ స్టిల్లర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. కామెడీ నేపథ్యంలో వచ్చిన ప్రముఖ బుల్లితెర సీరియళ్‌ ‘ది కింగ్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ సీరీస్‌లో అర్థర్‌ స్ఫూనర్‌గా నటించి మెప్పించాడు. ఈ సీరియల్‌ ఆయనకెంతో పేరు తెచ్చిపెట్టింది. తన కొడుకు నటుడైనటువంటి బెన్‌ స్టిల్లర్‌తో కలిసి ‘జులాండర్‌’, ‘హెవీవెయిట్స్‌’, ‘హాట్‌ పర్సూట్‌’, ‘ది హెర్ట్‌బ్రేక్‌ కిడ్‌’, ‘జులాండర్‌ 2’లలో కలిసి నటించాడు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జూన్‌ 8, 1927న జన్మించారు. తల్లి తండ్రులు బెల్లా, విలియం స్టిల్లర్స్‌. నలుగురు సంతానంలో జెర్రీ స్టెల్లర్‌ పెద్దవాడు. రెండవ ప్రపంచయుద్ధంలో యుస్‌ఎస్‌ ఆర్మీలో పనిచేశాడు. ఆ తరువాత కాలేజీలో చేరి స్పీచ్‌ అండ్‌ డ్రామాలో బ్యాచ్‌లర్‌ డిగ్రీ పొందాడు. తరువాత అన్నే మీరాను 1954లో వివాహం చేసుకొన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి 1961లో న్యూయార్కు నగరంలో నైట్‌క్లబ్‌లలో ప్రదర్శన ఇచ్చేవారు. వీరికి అమీ స్టిల్లర్, బెన్‌ స్టిల్లర్‌లు సంతానం. న్యూయార్క్‌లోని అప్పర్‌ వెస్ట్‌ సైడ్‌లో వయసు పైబడంతోనే సహజంగానే మే 11, 2020 చనిపోయారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.