నట గంభీరుడు

గంభీరంగా, సీరియస్‌గా, కఠినంగా కనిపించే ఎన్నో పాత్రల్లో విలక్షణ అభినయంతో గుర్తుండిపోయే నటుడు జోసెఫ్‌ ఫ్రాంక్‌ పెషీ. కొన్ని చిత్రాల్లో హాస్యనటుడిగా కూడా మెప్పించడం విశేషం. నటుడిగా, మ్యుజీషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ దర్శకులు రాబర్ట్‌ డెనిరో, మార్టిన్‌ స్కోర్సెసే రూపొందించిన చిత్రాల్లో ఎక్కువగా కనిపించాడు. ‘రేజింగ్‌ బుల్‌’, ‘గుడ్‌ఫెల్లాస్‌’, ‘క్యాసినో’, ‘ద ఐరిష్‌మేన్‌’, ‘వన్‌స అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ అమెరికా’, ‘మూన్‌వాకర్‌’, ‘జెఎఫ్‌కె’, ‘ఎ బ్రాంక్స్‌ టూల్‌’, ‘ద గుడ్‌ షెఫర్డ్‌’లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. ‘హోమ్‌ ఎలోన్‌’, ‘మై కజిన్‌ విన్నీ’, ‘హోమ్‌ ఎలోన్‌2: లాస్ట్‌ ఇన్‌ న్యూయార్క్‌’, ‘లెథల్‌ వెపన్‌’లాంటి సినిమాల్లో గంభీరంగా నటిస్తూనే నవ్వులు పూయించి ఆకట్టుకున్నాడు. ‘గుడ్‌ఫెల్లాస్‌’లో సైకో గ్యాంగ్‌స్టర్‌గా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. మ్యుజీషియన్‌ఆ మూడు ఆల్బమ్‌లు కూడా విడుదల చేసి సంగీత ప్రియులను మెప్పించాడు. న్యూజెర్సీలో 1943 ఫిబ్రవరి 9న పుట్టిన ఇతడు, ఐదేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాత్రలు వేశాడు. పదేళ్లకల్లా టీవీల్లో కనిపించాడు. పదహారేళ్లకి స్నేహితులతో కలిసి సొంత మ్యూజిక్‌ బ్యాండ్‌ను ఏర్పరిచాడు. తర్వాత కొన్నాళ్లు బార్బర్‌గా పనిచేస్తూనే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ‘ద డెత్‌ కలెక్టర్‌’ (1976) సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసి ప్రత్యేకమైన నటనతో పేరు తెచ్చుకున్నాడు. బాఫ్టాలాంటి మరెన్నో అవార్డులు అందుకున్నాడు. ఈరోజు ఇతడి పుట్టిన రోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.