సంచలన నటి...

అద్భుత గాయని... 45 ఏళ్లకి పైగా కొనసాగిన కళా ప్రస్థానం... అంతర్జాతీయ గుర్తింపు... ఇదీ జుడీ గార్లాండ్‌ అంటే. ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్, స్పెషల్‌ టోనీ, గ్రామీలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్న ఆమె ‘ద విజార్డ్‌ ఆఫ్‌ ఓజెడ్‌’ (1939) ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ‘మీట్‌ మీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’, ‘ద హార్వే గర్ల్స్‌’, ‘ఈస్టర్‌ పేరేడ్‌’, ‘సమ్మర్‌ స్టాక్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘జడ్జిమెంట్‌ ఎట్‌ న్యూరెంబర్గ్‌’ లాంటి సినిమాల ద్వారా అభిమానులను అందంతో, నటనతో మెప్పించింది. ప్రతిష్ఠాత్మకమైన సెసిల్‌ బి. డెమిల్లీ జీవన సాఫల్య పురస్కారాన్ని 39 ఏళ్ల చిన్న వయసులో అందుకున్న నటిగా రికార్డు సృష్టించింది. క్లాసిక్‌ అమెరికన్‌ సినిమాల కాలంలో మేటి గొప్ప నటీమణుల్లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. మిన్నిసోటాలో 1922 జూన్‌ 10న పుట్టిన జుడీ గార్లాండ్, రెండున్నరేళ్లకే వేదికపైన ఇద్దరు అక్కలతో కలిసి డ్యాన్స్‌ ప్రదర్శన ఇవ్వడం విశేషం. గానంతో నాట్యంతో ఈ ముగ్గురూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అవన్నీ జుడీకి వేదికలు, రేడియో, సినిమాల్లో అవకాశాలను సుగమం చేశాయి. అలా చిన్నతనంలోనే స్టార్‌డమ్‌ వచ్చిన ఈమె వ్యక్తిగతంగా మానసిక ఆందోళనలకు గురై డ్రగ్స్‌కి అలవాటు పడి 47 ఏళ్ల వయసులోనే చనిపోయింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.