బురదలో విరిసిన కమలం!
దుర్భరమైన పేదరికం... మురికి వాడల్లో నివాసం... సవతి తండ్రి దౌర్జన్యం... భయం... బెంగ... దిగులు... ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన ఓ అమ్మాయి... గాయనిగా, నాటక టీవీ రంగాల్లో నటిగా, రచయితగా ఎదిగి వెండితెరను ఏలి ఆస్కార్‌ సహా అనేక అవార్డులు అందుకుని తారగా తళుకులీనింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారాన్ని అందుకుంది. ఆ నటే జులీ ఆండ్రూస్‌. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న డిస్నీవారి ‘మేరీ పాపిన్స్‌’ (1964) సినిమాలో నటనకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘ద సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ (1965) సినిమాతో గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు సాధించింది. గ్రామీ, ఎమ్మీ, కెన్నెడీ సెంటర్‌ హానర్స్, డిస్నీ లెజెండ్స్‌ లాంటి ఎన్నో అవార్డులు పొందింది.


‘ద అమెరికనైజేషన్‌ ఆఫ్‌ ఎమిలీ’, ‘హవాయి’, ‘టోర్న్‌ కర్టెన్‌’, ‘థరౌలీ మోడర్న్‌ మిల్లీ’, ‘స్టార్‌’ ‘డ్యూ ఫర్‌ వన్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. పిల్లల కోసం ఎన్నో కథలు రాసింది. ‘హోమ్‌: ఎ మెమోయిర్‌ ఆఫ్‌ మై ఎర్లీ ఇయర్స్‌’ పేరుతో ఆత్మకథ రాసింది. ఇంగ్లండ్‌లో 1935 అక్టోబర్‌ 1న పుట్టిన ఈమెకిప్పుడు 83 ఏళ్లు. ఇన్ని విజయాల వెలుగుల వెనుక ఆమె బాల్యం మాత్రం చీకటి మయంగా సాగింది. అమ్మా నాన్నా తన చిన్నతనంలోనే విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. తండ్రి కొన్నాళ్లు చూసినా, చిన్నతనంలోనే తల్లి దగ్గరకు పంపేశాడు. అక్కడ సవతి తండ్రి, ఎదుగుతున్న చిన్నారి ఆండ్రూస్‌పై దౌర్జన్యం చేసేవాడు. అత్యాచార భయంతో ఆమె తన గదిలో తాళం వేసుకుని భయం భయంగా గడిపేది. స్కూల్లో ఆమె గొంతు విన్న ఒక టీచర్‌ ఆమెను పాటలు పాడేలా ప్రోత్సహించింది. ఇంటి వద్ద దిగులు, బెంగలతో గడుపుతూనే స్కూల్లో పాటలు పాడడం నేర్చుకుంది. పదమూడేళ్ల కల్లా సొంతంగా రికార్డు విడుదల చేసేంత స్థాయికి ఎదిగింది.


కింగ్‌ జార్జి, క్వీన్‌ ఎలిజెబెత్‌ సమక్షంలో ప్రదర్శన ఇచ్చింది. ఆపై రేడియో, టీవీ, నాటక రంగాలు ఆమె ప్రతిభకు స్వాగతం పలికాయి. ఆపై వెండితెర ఎర్రతివాచీ పరిచింది. డిస్నీ వారి సినిమా ‘మేరీ పాపిన్స్‌’ సినిమా ఘన విజయంతో ఆమె పేరు మార్మోగిపోయింది. తొలి సినిమాతోనే ఆస్కార్‌ అందుకుంది. ఆర్ట్‌ డిజైనర్‌ టోని వాల్టన్‌ను 1959లో పెళ్లి చేసుకుంది. ఎనిమిది సంవత్సరాల సజావుగా సాగిన వీరి జీవితం 1967తో తెగిపోయింది. తరువాత ప్రముఖ నిర్మాత బ్లేక్‌ ఎడ్వర్డ్స్‌ 1969లో పెళ్లిచేసుకొంది. ఎడ్వర్డ్‌ 2010లో చనిపోయారు. ఈమెకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సినిమాలంటే పిచ్చిప్రేమ ఉన్న జులి, జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆక్వామేన్‌’ సినిమాలో కేథరిన్‌ పాత్ర డబ్బింగ్‌ చెప్పింది. ఈ రోజు జులి ఆండ్రూస్‌ పుట్టినరోజు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.