బాక్సాఫీస్‌ పాయిజన్‌!

మూడో సినిమాకే ఆస్కార్‌ అందకున్న ఓ అందాల నటి, ఆపై అన్ని సినిమాలూ విఫలం కావడంతో ‘బాక్సాఫీస్‌ పాయిజన్‌’ అనే పేరు తెచ్చుకుంది. అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తిరిగి తన అదృష్టాన్ని తానే తిరగరాసుకుని మళ్లీ వెండితెరపై వెలిగింది. ఆ నటే కేథరీన్‌ హెప్‌బర్న్‌. అరవై ఏళ్ల నటనా ప్రస్థానంలో ఉత్తమ నటిగా 4 ఆస్కార్‌ అవార్డులు అందుకున్న రికార్డు ఈమెదే. హాలీవుడ్‌లో మేటి నటిగా ప్రాచర్యం పొందింది. కాలేజీ రోజుల్లోనే నటి కావాలని కోరుకుని నాటక రంగంలో తర్ఫీదు పొంది నాలుగేళ్లలో మంచి నటిగా పేరు తెచ్చుకుని వెండితెర నుంచి ఆహ్వానాలు అందుకుంది. మూడో సినిమా ‘మార్నింగ్‌ గ్లోరీ’ (1933)తోనే ఆస్కార్‌ అవార్డు అందుకుంది. కానీ ఆపై అయిదేళ్ల పాటు విజయం ఆమెకు మొహం చాటేసింది. ఆ దశలో ఆమె తన విజయాలకు తానే బాట వేసుకోవడం విశేషం. ఫిలిప్‌ బ్యారీ అనే రచయిత చేత తన కోసమే ఓ మంచి నాటకం ‘ద ఫిలడెల్ఫియా స్టోరీ’ రాయించుకుని కాపీ రైట్లు దక్కించుకుంది. అందులో తనే ప్రధాన పాత్ర పోషిస్తూ నాటకాన్ని విరివిగా ప్రదర్శించింది. ఆ నాటకానికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడడంతో హాలీవుడ్‌ దాన్ని సినిమాగా మలచడానికి సిద్ధపడింది. అయితే తనను హీరోయిన్‌గా బుక్‌ చేసుకుంటేనే రైట్స్‌ అమ్ముతానని షరతు పెట్టింది. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆమె తిరిగి బిజీ స్టార్‌ అయిపోయింది. ‘ద ఆఫ్రికన్‌ క్వీన్‌’, ‘గెస్‌ హూస్‌ కమింగ్‌ టు డిన్నర్‌’, ‘ద లయన్‌ వింటర్‌’, ‘ఆన్‌ గోల్డెన్‌ పాండ్‌’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపుతో పాటు మూడు ఆస్కార్లు అందుకుంది. నాటకాలు, టీవీ సినిమాలతో నటనను కొనసాగిస్తూ 87 ఏళ్ల వయసులో కూడా నటించి మెప్పించింది. అమెరికాలో 1907 మే 12న పుట్టిన ఈమె, తన 96వ ఏట 2003 జూన్‌ 29న మరణించింది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.