ఏడు దశాబ్దాల ప్రస్థానం

సెక్స్‌సింబల్‌గా ఆమె గుర్తింపు పొందింది. యువతను విపరీతంగా ఆకర్షించింది. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, స్క్రీన్‌ రైటర్‌గా, కమేడియన్‌గా 70 ఏళ్ల పాటు వినోద ప్రపంచాన్ని ఏలింది. ఆమే మేరో జాన్‌ మే వెస్ట్‌. నాటక రంగం, రేడియో, టీవీ, సినిమా రంగాల్లో పేరు తెచ్చుకుంది. క్లాసిక్‌ అమెరికా చిత్రాల కాలంలో గ్రేటెస్ట్‌ ఫిమేల్‌ స్టార్‌ గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లో 1893 ఆగస్టు 17న పుట్టిన ఈమె, ఐదేళ్ల వయసులోనే చర్చి కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చి బహుమతి అందుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేసరికల్లా అనేక వినోద ప్రదర్శనల్లో పాల్గొని ‘బేబీ మే’గా ప్రాచుర్యం పొందింది. ‘నైట్‌ ఆఫ్టర్‌ నైట్‌’, ‘షి డన్‌ హిమ్‌ రాంగ్‌’, ‘ఐయామ్‌ నో ఏంజెల్‌’, ‘బెల్లే ఆఫ్‌ ద నైంటీస్‌’, ‘గోయింగ్‌ టు టౌన్‌’లాంటి సినిమాలతో అందాల తారగా ఆకర్షించింది. సినిమాల నుంచి విరామం తీసుకున్నాక, రచయిత్రిగా, టీవీ, రేడియో కార్యక్రమాల రూపకర్తగా పేరు తెచ్చుకున్న ఈమె, కాలిఫోర్నియాలో 1980 నవంబర్‌ 22న తన 87వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.