పన్నెండేళ్లకే సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఆమె
మె నటించిన సినిమాలన్నీ 100 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేశాయి...
వరసగా 12 ఏళ్ల పాటు ఆమె టాప్‌టెన్‌ బాక్సాఫీస్‌ తారల్లో ఒకరిగా మెరిసింది...
అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా నిలిచింది...
ఆమె ఒకప్పుడు హాలీవుడ్‌ సినీ ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఉర్రూతలూగించిన బెట్టీ గ్రాబుల్‌. నటిగా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా, గాయనిగా హాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసింది.


పన్నెండేళ్లకే సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఆమె, ‘డౌన్‌ అర్జంటైన్‌ వే’, ‘మదర్‌ వోర్‌ టైట్స్‌’, ‘హౌ టు మ్యారీ ఏ మిలియనీర్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. సెక్స్‌ సింబల్‌గా యువతను వెర్రెత్తించింది. ఆమె స్నానపు దుస్తులు వేసుకుని వెనక్కి తిరిగి నవ్వుతూ చేసే ఓ పోస్టర్‌ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. దాంతో ఆమెను ‘పిన్‌ అప్‌ గర్ల్‌’గా పిలవడం మొదలుపెట్టారు. అంటే ఆమె ఫొటోలు, పోస్టర్లను అభిమానులు గోడకు మేకులు కొట్టి తగిలించుకుని ఆనందించేవారన్నమాట. ఈ ఫొటో లైఫ్‌ మ్యాగజైన్‌ తయారు చేసిన ‘ప్రపంచాన్ని మార్చేసిన 100 ఫొటోలు’ జాబితాలో ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయ పత్రికలన్నీ ఆమె ఫొటోలను ముఖచిత్రాలుగా వేసి కథనాలు రాసి మురిసిపోయాయి. ముఖ్యంగా ఆమె కాళ్ల అందాన్ని అందరూ పొగిడేవారు. దాంతో ఆమె తన కాళ్లకు మిలియన్‌ డాలర్ల బీమా తీసుకుంది. ‘‘నేను గొప్ప తారను కావడానికి రెండే కారణాలు... అవి నా కాళ్లే!’’ ఆమె వయ్యారాలు పోయేది!

మిస్సోరీలో 1916 డిసెంబర్‌ 18న పుట్టిన గ్రాబుల్, చిన్నప్పుడే ఆటా పాటా నేర్చుకోవడమే కాకుండా అనేక అందాల పోటీల్లో పాల్గొని అదరగొట్టింది. గాయనిగా, నృత్య కారిణిగా ప్రదర్శనలు ఇచ్చింది. వెండితెర ఆహ్వానం అందుకుని ‘ప్రొబేషన్‌’, ‘కావల్కేడ్‌’, ‘ద గే డివోర్సీ’, ‘ఫాల్లో ద ఫ్లీట్‌’, ‘కాలేజ్‌ స్వింగ్‌’, ‘మిలియన్‌ డాలర్‌ లెగ్స్‌’, ‘మూన్‌ ఓవర్‌ మియామి’, ‘సాంగ్‌ ఆఫ్‌ ద ఐలాండ్స్‌’లాంటి ఎన్నో సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంది. మూడు దశాబ్దాల పాటు అందాల అభినేత్రిగా పేరు తెచ్చుకున్న బెట్టీ గ్రాబుల్, తన 56 ఏట 1973 జులై 2న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కాలిఫోర్నియాలో మరణించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.