శృంగార నయాగరా మార్లిన్ మన్రో
ఆమె పేరే వైబ్రేషన్...
రూపే సెన్సేషన్.
నిజానికి ఆమె ఓ సెలెబ్రేషన్.
ఆమె అందం అపురూపం. అనుపమానం. అనిర్వచనీయం. అత్యద్భుతం.... ఇలాంటి పదబంధాలకు అతీతమైన శృంగార ప్రబంధం తను. ఆమె కవ్విస్తుంది. నవ్విస్తుంది. కలల తేరులో ఊరేగిస్తుంది. కమనీయ రమణీయ కాంతి తారకలా తళుక్కుమంటూనే ఉంటుంది. వత్సరాలెన్ని గడిచినా ఇప్పటికీ గుండె గుండెల్లో బొమ్మ కట్టిన సొగసు సోయగాలాల్తో జగదేక సుందరిగా తన గుర్తింపుని చరిత్రపుటల్లో శాశ్వతపరచుకుంది.


నిజానికి, ఆమె సౌందర్యాగ్నికీల. కరుణ లేకుండా కాల్చేస్తుంది.
మది మదిని కొల్లగోట్టే మధు హేల. కాలిన గాయాలకు చల్ల చల్లని మందు కూడా రాస్తుంది.
అందంతో పిచ్చెక్కించడం... చంపేయడం...అంతలోనే బతికించడం... ఆమెకి తెలిసిన విద్య. ఔను...ఆమె మహా మంత్రగత్తె.
అందం అమ్మాయి అయితే ఎలా ఉంటుందో... అప్పట్లోనే తాను చెప్పేసింది. మగాళ్ల మనసు దోచుకోవడమెలాగో . ..ఏకంగా థీసిస్ ని సబ్మిట్ చేసేసింది. అందుకే...సౌందర్యారాధకులంతా ఆమెపై మనీపర్సులా మనసు పారేసుకున్నారు. ఇంకా ఇంకా పారేసుకుంటూనే ఉన్నారు.

తను ఓ కనుసైగతో హాలీవుడ్ ని కట్టిపడేసింది. చిన్న చిరునవ్వుతో యావత్ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది. మోడల్ గా, సింగర్ గా సత్తా చాటుకుంది. తెరంతా పరచుకున్న సౌందర్యంతో వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఒక్కసారి తనని చూస్తే చాలు ... కళ్ళలో శాశ్వతంగా కొలువుండే చక్కనైన రూపం. మది గదిలో అగరు పొగల అత్తరు ధూపం. ఆమె వెండితెర మెచ్చిన సౌందర్యాధిదేవత. అసలు పేరు నోర్మా జిన్ మోర్టన్ సన్. మార్లిన్ మన్రో గా సుప్రసిద్ధురాలు.


సరస శృంగార నాయిక మార్లిన్ మన్రో
మార్లిన్ మన్రో పేరు తలవగానే...కుండపోతగా గుండెల్లో సరస శృంగారం వెల్లువెత్తుతుంది. 1950 దశకం నాటికే హాలీవుడ్ లో సెక్స్ సింబల్ గా విశేషాదరణ పొందిన శృంగార తారక మార్లిన్ మన్రో. రంగుల ప్రపంచం లోకి అడుగిడిన తర్వాత తెరపై తనని ఆవిష్కరించుకోవడంలో ఎలాంటి మోమాటలకు తావు లేకుండా చూసుకోవడం ఆమె విజయ రహస్యం. అదే మాట బోల్డ్ గా చెప్పడంలో కూడా ఎప్పుడూ ఆమె వెనుకాడలేదు. ఎలాంటి సందేహాలు లేకుండా దేహాన్ని చూపించడంలో తప్పే లేదని ఆమె నిశ్చితాభిప్రాయం. వినోద ప్రపంచంలో ఉన్నప్పుడు అనివార్యంగా దేహ ప్రదర్శన అవసరమని ఆమె నమ్మింది. ఆ నమ్మిందారిలోనే నడుచుకుంటూ వెళ్ళింది. విజయాలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది రసజ్ఞులైన అభిమానుల్ని సంపాదించుకుంది.

బాల్యం కష్టాలమయం
బాల్యం అమూల్యమంటారు. కానీ, కొంతమంది బాల్యం కష్టాల కొలిమిలో కాలి కడగండ్లు, కన్నీళ్ల బాటలో సాగి బతుకు దుర్భరమనిపించేలా ఉంటుంది. హాలీవుడ్ నటిగా సుప్రసిద్ధురాలైన మార్లిన్ మన్రో జీవితం ఇందుకు మినహాయింపు కాదు. 1926 జూన్ 1న లాస్ ఏంజిల్స్ లో జన్మించిన మార్లిన్ మన్రో కి నాన్నెవరో తెలీదు. ఒంటరి తల్లి నీడలోని బాల్యంలో ఇక్కట్లే అధికం. ఓ పక్క దారిద్య్రం కాటేస్తుంటే... అనాధ శరణాలయాల్లో తలదాచుకున్న బాల్యం మార్లిన్ మన్రోది. చిన్న రొట్టె ముక్క కోసం ఆశగా ఎదురు చూసిన కాలం అది. అలాంటి కష్టాల్ని ఎదురీదుతూనే ఆమె బతుకు తెరువు కోసం పడరాని పాట్లు పడింది. మార్లిన్ మన్రో జీవితకాలంలో మూడు వివాహాలు చేసుకుంది. 1942లో జేమ్స్ దాగేర్టీని వివాహం చేసుకుని 1946లో విడాకులు తీసుకుంది. 1954లో జోయీ డిమాగ్గీయో ని పెళ్ళి చేసుకుని 1955లో విడాకులు తీసుకుంది. 1956లో ఆర్థర్ మిల్లర్ ని పెళ్లి చేసుకుని 1961లో విడాకులు తీసుకుంది. వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల మధ్యనే గడిచింది.


మోడలింగ్ నుంచి హాలీవుడ్ ప్రస్తానం వరకూ
వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన్రో కి 1944లో రేడియో ప్లేన్ కంపెనీలో ఉపాధి లభించింది. అక్కడ ఆమెకి ఫోటోగ్రాఫర్ డేవిడ్ కోనోవర్ పరిచయమయ్యాడు. మహిళా కార్మికులకు నైతిక ప్రవర్తన గురించి తెలియచెప్పే సందేశాత్మక చిన్న చిత్రాల్ని రూపొందించే పనిలో డేవిడ్ కోనోవర్ ఉన్నారు. ఆ సమయంలో పరిచితమైన మన్రో అందచందాలకు ముగ్ధుడయినా ఆయన మోడల్ గా ఆమెకి అవకాశం ఇచ్చారు. దాంతో, మన్రో రేడియో ప్లేన్ కంపెనీ నుంచి బయటకు వచ్చి మోడల్ గా రాణించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 1945లో బ్లూ బుక్ మోడల్ ఏజెన్సీ లో మోడల్ గా పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో ఫ్యాషన్ మోడల్ గా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి పురుషులకు సంబంధించిన పత్రికల్లో ఆమె ఫోటోలు అధికంగా ప్రచురణకు నోచుకున్నాయి. 1946 ప్రారంభం వరకూ మన్రో 33 పత్రికల కవర్ పేజీల్లో కనిపించి పాఠకులను అలరించింది. మన్రో ముఖచిత్రాలతో పగెంట్, యూఎస్ కెమెరా, లాఫ్, పీక్ లాంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. తర్వాత యాక్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవడం...సినిమాల్లో రాణించాలని తాపత్రయపడడమే ఆమె దరికి చేరలేదు. ఆ కాలంలో ఆమె యాక్టింగ్, డాన్సింగ్ తరగతులకు హాజరై వృత్తిపర మెళకువలను నేర్చుకుంది. 1947లో ఆమెకు సినీ అవకాశం లభించింది. డెంజరస్ ఇయర్స్ లో ఆమె నటించింది. 1948లో స్కోడా హూ...స్కోడా హే అనే సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత ఆమెకి అరకొర వేషాలు వచ్చేవి. అయితే, నటన మీద ఉన్న ఆసక్తి తో మన్రో నటనలో శిక్షణ పొందుతూనే ఉంది.

మన్రో చిత్రాలు
1948లో లేడీస్ ఆఫ్ ది చోరస్, లవ్ హ్యాపీ చిత్రాల్లో నటించింది. 1950 నుంచి మన్రో శకం ప్రారంభమైనది. 1950లో ఎ టికెట్ తో టోమా హాక్, ది అస్ఫల్ట్ జంగల్, అల్ అబౌట్ ఈవ్, ది ఫైర్ బాల్ చిత్రాల్లో నటించింది. 1951లో రైట్ క్రాస్, హోమ్ టౌన్ స్టోరీ, యాజ్ యాంగ్ యాజ్ యు ఫీల్, లవ్ నెస్ట్, లెట్స్ మాక్ ఇట్ లీగల్ చిత్రాల్లో నటించింది. 1952లో క్లాష్ బై నైట్, వియ్ అర్ నాట్ మ్యారీడ్, డోంట్ బాదర్ తో నాక్, మంకీ బిజినెస్, ఓ హెన్రీస్ ఫుల్ హౌస్ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చాయి.


శృంగార నయాగరా
1953లో నయాగరా చిత్రం ఆమెకి శృంగార తారగా మరో గుర్తింపు తెచ్చింది. నయాగరా చిత్రంతో మార్లిన్ మన్రో సినీ జీవితమే మారిపోయింది. ఈ చిత్రంలో మార్లిన్ మన్రో నవ వధువుగా నటించింది. పెళ్ళికి ముందే ప్రేమించిన ప్రియుడి సహాయంతో భర్త ని చంపే పాత్రలో మన్రో విశ్వరూపం ప్రదర్శించింది. కాస్త స్పైసీ స్పైసీ గా రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస విజయాలు అందుకుంది. అదే సమయంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆమె అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా...ఒకానొక దశలో హాలీవుడ్ ని శాసించే స్థాయికి ఆమె వైభవ ప్రాభవం వేయిరేకులై విరిసింది. అంతే కాదు... భారీ పారితోషికాన్ని తీసుకున్న నటిగా కూడా ఓ చరిత్ర లిఖించింది. ఆమె ఒక్కో సినిమా అప్పట్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టడంతో మన్రో కీర్తి పతాక దిగంతాల్లో రెపరెపలాడింది. ఆమె ఒక్కో సినిమా 200 మిలియన్ డాలర్లను వసూలు చేసిందంటూ రికార్డులు చెప్తున్నాయి. అదే సంవత్సరం జెంటిల్ మాన్ ప్రిఫర్ బ్లోన్దేస్, హౌ టూ మ్యారి యూ మిలియనీర్ చిత్రాల్లో నటించింది. 1954లో రివర్ అఫ్ నో రిటర్న్, దేర్ ఈజ్ నో బిజినెస్ లైక్ షో బిజినెస్ చిత్రాలు ఆమెకి పేరు తెచ్చాయి. 1955లో ది సెవెన్ ఇయర్ ఇచ్ రొమాంటిక్ కామెడీ లో మన్రో నటించింది. 1956లో బస్టాప్, 1957లో ది ప్రిన్స్ అండ్ షో గర్ల్, 1959లో సమ్ లైక్ ఇట్ హాట్, 1960లో లెట్స్ మేక్ లవ్, 1961లో ది మిస్ఫిట్స్ చిత్రాల్లో మన్రో నటించింది.

అసంపూర్ణ చిత్రం
మార్లిన్ మన్రో 1962లో సమ్ థింగ్స్ గాట్ టి జివి చిత్రం పూర్తి కాలేదు. 1962 ఆగస్టు 4న ఆమె ఎప్పటికీ తిరిగిరాలేని లోకాలకు తరలి వెళ్ళిపోయింది. ఆమె మనమధ్య లేకున్నా ఆమె నటించిన చిత్రాలు జనబాహుళ్యాన్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.

మరణం చుట్టూ వంద అనుమానాలు
మన్రో మరణం చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముట్టాయి. ఇప్పటికీ ఆ అనుమానాల మిస్టరీ వీడని లేదు. కాకుంటే, మత్తు పదార్థాలు అధికంగా సేవించడం వల్లనే మన్రో మృత్యువాత పడిందన్న ముగింపుతో కేసుకు స్వస్తి పలికారు.

గుండె ఆగి 24 మంది మృతి
మార్లిన్ మన్రో ని పిచ్చిపిచ్చిగా అభిమానించి ఆరాధించినవారిలో ఆమె మరణవార్త విని తట్టుకోలేక గుండెపోటుతో ప్రపంచవ్యాప్తంగా 24 మంది చనిపోయారని తెలుస్తోంది.


అందాల తారల హఠాత్ మరణాలు ఎప్పటికీ మిస్టరీయే
సైలెన్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్...అనే సాంకేతిక పదబంధాల్లో చిక్కుకుని నలిగిపోయిన వెండితెర తారకల కొన్ని జీవితాలు విషాదాంతాలు అవ్వడం సినిమా సాక్షిగా తరచూ జరుగుతున్న ఘటనలే. అలనాటి జగదేక సుందరి మార్లిన్ మన్రో నుంచి నిన్న మొన్నటి అతిలోక సుందరి శ్రీదేవి మరణం వరకూ ఒకే చరిత్ర పదే పదే పునరావృత్తమవుతోంది. మన్రోని తలచుకుంటే మన సావిత్రి కళ్ళ ముందు కదలాడుతుంది. అంబరమంటిన వైభవ ప్రాభావాలు చూసిన ఈ వెండి తెర అందాల తారలు ఆ వైభవం కళ్ళ ముందు కరిగిపోతుంటే భరించలేని స్థితి వారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఆ చేదు వాస్తవాలను మరిచిపోయేందుకు మత్తు బారిన పది ఉపశమనం పొందుదామనుకుని అందులోనే మునిగి తేలుతూ చివరికి విషాదాంతంగా జీవితాలు చాలిస్తున్నవారెందరో? మహా నటి సావిత్రి, దివ్య భారతి, సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, తమిళ నటి శోభ...ఇలా ఎంతో మంది మత్తు వ్యసనానికి లొంగిపోవడం కఠోర వాస్తవం. దివ్య భారతి కూడా హఠాత్ గా బహుళ అంతస్థు భవనం నుంచి పది చనిపోయింది. అది హత్యో, ఆత్మహత్యో, పొరపాటున జారిపడిన దుస్సంఘటనో...ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అలాగే.... సిల్క్ స్మిత జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే..అనుమానాలు అలాగే ఉన్నాయి.

కోట్లాది అభిమానులున్నా...
ఎక్కడ కాళ్ళు కందిపోతాయేమోనని అభిమానించే నటి నడిచే దారి పొడవునా కోట్లాది హృదయాలు పరచుకున్న వైనం... ఎక్కడికి వెళ్లినా రెడ్ కార్పెట్ పరిచే అభిమానగణం... ఆమె చూపులు తమపై ప్రసరిస్తే చాలు జన్మ ధన్యమైపోతుందనుకునే వీరాభిమానులెందరో ఉన్నా ... ఎవరూ లేని ఏకాకిలా హఠాత్ గా తనువు చాలిస్తున్న తారల జీవితాలు ఎప్పటికీ కన్నీటి సంద్రాలే. రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో... ఎవరిని పాతాళానికి తొక్కేస్తుందో...ఎవ్వరూ చెప్పలేరు. వైభవాన్ని అనుభవించిన సంతోషాల్ని తలచుకుంటూనే ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించాలని ఎవ్వరెంత చెప్పినా... ఏకాకితనం మృత్యువై కబళిస్తుంటే ... అభిమానులు నివాళి ఘటించి కన్నీటి చుక్కలు లెక్కలేనన్ని.
ఇంటలెక్చవల్ స్టయిల్ ఐకాన్ గా ఎప్పటికీ అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుని...ఎవ్వరికీ అందనంత అనంత లోకాల్లో శాశ్వత నిద్ర పోతున్న మార్లిన్ మన్రోకి నివాళి.


-పి.వి.డి.ఎస్. ప్రకాష్Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.