రాలిపోయిన ధ్రువతార...

విజయశిఖరాలు అధిరోహించినప్పుడు జాగ్రత్తగా లేకపోతే, పాతాళానికి జారిపోవడం ఖాయమనే సూక్తి, ఆ యువకుడి జీవితంలో నిజమైంది. గాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల రికార్డులు అమ్ముడైన ప్రతిభ, నటుడిగా వెండితెరపై ప్రపంచ ప్రేక్షకులను అలరించిన అభినయం, ఎన్నో పురస్కారాలు అందుకున్న ప్రాచుర్యం అతడివి. కానీ స్టార్‌డమ్‌ అతడిని ఉన్నత శిఖరాలపై సింహాసనం వేసి కూర్చోబెడితే, వ్యక్తిగత బలహీనతలు అతడిని కిందికి లాగి విసిరేశాయి. ఆఖరికి అవమానాల పాలై, వ్యసనాలను అధిగమించలేక చిన్నతనంలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాదం అతడి జీవితం అందరికీ నేర్పే గుణపాఠం. అతడే మైకేల్‌ హచెన్స్‌. గాయకుడిగా, సంగీతకారుడిగా, గీత రచయితగా, నటుడిగా అతడి ప్రస్థానం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన తారాజువ్వను తలపిస్తుంది. ఓ వైపు రాక్‌ బాండ్‌ స్థాపించి సంగీత ప్రదర్శనలతో యువతను ఉర్రూతలూగిస్తూనే, మరో వైపు ‘డాగ్స్‌ ఇన్‌ స్పేస్‌’, ‘ఫ్రాంకెస్టీన్‌ అన్‌బౌండ్‌’, ‘లింప్‌’ లాంటి సినిమాల ద్వారా మంచి నటుడిగా కూడా పేరొందాడు. చిన్న వయసులోనే వచ్చి పడిన ప్రాచుర్యం అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అనేక మంది నటీమణులు, గాయనులు, మోడల్స్‌లో ప్రేమాయణాలు నడిపాడు. కాసుల గలగలల మధ్య మద్యం, డ్రగ్స్‌లాంటి మహమ్మారి అలవాట్లు అతడి జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఆస్ట్రేలియాలో 1960 జనవరి 22న పుట్టిన ఇతడు, చిన్నతనంలోనే కవితలు రాసేవాడు. యువకుడిగా ఉన్నప్పుడు స్నేహితులు నడిపే రాక్‌బ్యాండ్‌లో చేరి పాటలు పాడేవాడు. ఆపై సొంత బ్యాండ్‌ నెలకొల్పి విపరీతమైన ప్రాచుర్యం పొందాడు. అతడు విడుదల చేసిన ఆల్బమ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్లు అమ్ముడుపోయాయి. అనేక అవార్డులు అతడి సొంతమయ్యాయి. ఇంత కీర్తి సంపాదించి కూడా వ్యసనాల సాలెగూటిలో చిక్కుకున్న ఇతడు, 1997 నవంబర్‌ 22న తన 37 ఏళ్ల చిన్నవయసులో ఆత్మహత్యతో జీవితాన్ని అంతం చేసుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.