శ్రీశ్రీ కవితా సుందరి

మహాకవి శ్రీశ్రీ ఓ కవితలో ‘అటు చూస్తే నార్మా షేరర్‌... ఇటు చూస్తే కాంచన మాల...’ అంటూ ఏ సినిమా చూడాలో తేల్చుకోలేని మధ్యతరగతి వ్యక్తి గురించి రాశారు. అలా ఆయన కవితలో చోటు చేసుకున్న అందాల నటి నార్మాషేరర్‌. హాలీవుడ్‌లో 1925 నుంచి 1942 వరకు మరపురాని చిత్రాల్లో తళుక్కుమన్న అందం, అభినయం ఉన్న నటిగా పేరొందింది. 1930లో ‘ద డైవోర్సీ’ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘రోమియో జూలియట్‌’ (1936), ‘మేరీ ఆంటోనెట్‌’ (1938) చిత్రాల్లో నటన ద్వారా ప్రపంచ సినీ అభిమానులకు ఆకర్షించింది. కెనడాలో 1902 ఆగస్టు 11న పుట్టిన నార్మాషేరర్, తొమ్మిదేళ్ల వయసులోనే ‘నేను సినిమాల్లో నటిస్తాను’ అని ప్రకటించడం విశేషం. అమ్మ సరేనని ప్రోత్సహించినా సందేహించింది. ఎందుకంటే అప్పటికి నార్మా రూపం ఏమంత ఆకర్ణణీయంగా లేదు. సన్నగా పీలగా ఊచకాళ్లతో ఎగుభుజాలతో ఉండేది. పైగా కొద్దిగా మెల్లకన్ను. తర్వాత తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో విలాసవంతమైన జీవితంలోంచి మధ్యతరగతిలోకి వచ్చి పడి డిప్రెషన్‌కి గురైంది. అయినా సినిమా కల వెంటాడింది. ఎక్స్‌ట్రా వేషాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లింది. నటిగా బాగా కనిపించడానికి గంటల తరబడి అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేసేది. శరీరాకృతిలో లోపాలు దిద్దుకోడానికి వ్యాయామాలు చేసింది. అలాంటి నేపథ్యంలోంచి అనుకున్నది సాధించడమే కాకుండా తారాపథానికి ఎదగడం ఆమెకే సాధ్యమైంది. నిర్మాతలు వెంటపడే అందాల తారగా పేరు తెచ్చుకున్న ఆమె 1983 జూన్‌ 12న తన 80 ఏళ్ల వయసులో మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.