హాలీవుడ్‌ దర్శకురాలు

మహిళ దర్శకత్వం వహించిన సినిమా 100 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడం ఆమె సినిమాతోనే మొదలు. ఆ ఘనతను సాధించిన దర్శకురాలు పెన్నీ మార్షల్‌. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ప్రాచుర్యం పొందిన ఆమె ‘బిగ్‌’ అనే సినిమాతో ఈ ఘనత సాధించింది. అంతకు ముందు ఆమె ‘జంపిన్‌ జాక్‌ ఫ్లాష్‌’ సినిమాతో దర్శకురాలైంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘అవేకెనింగ్స్‌’, ‘ఎ లీగ్‌ ఆఫ్‌ దెయిర్‌ ఓన్‌’, ‘రినైసెన్స్‌ మ్యాన్‌’, ‘ద ప్రీచర్స్‌ వైఫ్‌’, ‘రైడింగ్‌ ఇన్‌ కార్స్‌ విత్‌ బాయ్స్‌’లాంటి సినిమాలు అంతర్జాతీయంగా సినీ అభిమానులను అలరించాయి. నిర్మాతగా ఆమె ‘సిండ్రెల్లా మ్యాన్‌’, ‘బెవిచ్డ్‌’ సినిమాలతో పాటు కొన్ని టీవీ కార్యక్రమాలను కూడా రూపొందించింది. న్యూయార్క్‌లో 1943 అక్టోబర్‌ 15న పుట్టిన మార్షల్‌ చిన్నప్పటి నుంచే చురుకే. ఆమె తల్లి ఓ డ్యాన్స్‌ స్కూలు నిర్వాహకురాలు కావడంతో రెండున్నర ఏళ్ల నుంచే ఆమె ట్యాప్‌ డ్యాన్స్‌ నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించింది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత టీవీ ప్రకటనలకు మోడల్‌గా పనిచేసింది. ఆపై బుల్లితెర అవకాశాలు అందుకుంది. ‘లావర్నే అండ్‌ షిర్లే’ అనే టీవీ సిరీస్‌ ద్వారా ఉత్తమ నటిగా మూడు గోల్డెన్‌గ్లోబ్‌ నామినేషన్లు పొందడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆపై వెండితెర అవకాశాలు వరసకట్టాయి. బుల్లితెర, వెండితెరలపై మంచి నటిగా గుర్తింపు పొందిన మార్షల్, కాలిఫోర్నియాలో 2018 డిసెంబర్‌ 17న తన 75వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.