కవితాత్మక నటుడు...

సహజ నటన, అద్భుత నటన, అద్వితీయ నటన, విలక్షణ నటన... ఇలా రకరకాలుగా పేర్లు చెబుతుంటారు. కానీ కవితాత్మకంగా నటిస్తాడనే పేరు పొందిన వాడు రాల్ఫ్‌ రిచర్డ్‌సన్‌. ఇతడిని ‘మ్యాజికల్‌ యాక్టర్‌’ అని కూడా అంటారు. నాటకాల్లో అదరగొట్టి, వెండితెరపైకి వచ్చి భిన్నమైన రీతిలో అభినయాన్ని చూపించిన వాడుగా ఇతడు హాలీవుడ్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో 1902 డిసెంబర్‌ 19న పుట్టిన రిచర్డ్‌సన్‌ను తల్లి క్రైస్తవ మత గురువుగా మారుద్దామనుకుంటే అతడు ఆ శిక్షణ నుంచి పారిపోయాడు. ఆపై చిత్రలేఖనం స్కూల్లో చేర్పిస్తే అక్కడా ఇమడలేకపోయాడు. ఏవేవో ఉద్యోగాలు చేస్తూ చివరికి నాటక రంగంవైపు దృష్టి మరల్చాడు. అలా ఇరవయ్యో శతాబ్దంలో నాటక రంగంలో మంచి నటుడిగా దశాబ్దాల పాటు ప్రాచర్యం పొందాడు. సినిమాల్లో మొదట ఎక్స్‌ట్రా వేషాలు వేసినా క్రమేణా మంచి పాత్రల్లో రాణించాడు. ‘థింగ్స్‌ టు కమ్‌’, ‘ద ఫాలెన్‌ ఐడల్‌’, ‘లాంగ్‌ డేస్‌ జర్నీ ఇంటూ నైట్‌’, ‘డాక్టర్‌ జివాగో’, ‘ద హైరెస్‌’, ‘గ్రేస్టోక్‌: ద లెజెండ్‌ ఆఫ్‌ టార్జాన్‌’, ‘లార్డ్‌ ఆఫ్‌ ద ఏప్స్‌’, ‘ద సౌండ్‌ బారియర్‌’లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. కొన్ని పాత్రలకు ఇతడు మాత్రమే సరిపోతాడనేంత పేరు తెచ్చుకున్న రిచర్డ్‌సన్‌ 1983 అక్టోబర్‌ 10న మరణించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.