‘హ్యారీపాటర్' సినిమాల్లో ఆల్బస్ డంబుల్డోర్ గుర్తున్నాడా?పోనీ... ‘గ్లాడియేటర్’ సినిమాలో ఎంపరర్ మార్కస్ ఆరెలియస్ గుర్తున్నాడా?

ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్ సాధించిన ఈ సినిమాల్లో ఆ పాత్రలను ధరించిన నటుడు అతడే. పేరు రిచర్డ్ హ్యారిస్. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఇతడు తొలినాళ్లలో నటుడిగా నిలదొక్కుకోడానికి నానా పాట్లూ పడ్డాడు. అసలు సినిమాలనేవి అతడి ఆలోచనల్లోనే ఉండేవి కావు. ఎందుకంటే అతడొక మంచి క్రీడాకారుడు. గాయకుడు కూడా. ఐర్లాండ్‌లో 1930 అక్టోబర్ 1న పుట్టిన హ్యారిస్ యువకుడిగా ఉన్నప్పుడు రగ్బీ, అథ్లెటిక్స్ లాంటి క్రీడల్లో బాగా రాణించేవాడు. టీనేజిలో ఉండగా అనూహ్యంగా క్షయ వ్యాధి సోకడంతో క్రీడలకు దూరమయ్యాడు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నాక సినీ రంగం అతడిని ఆకర్షించింది. దర్శకత్వ రంగంలో ప్రవేశిద్దామన్నా, నటుడిగా ప్రయత్నిద్దామన్నా ఆడిషన్ దశలోనే ఫెయిల్ అయ్యాడు. ఆ దశలో నాటకాలే అతడికి దారి చూపించాయి. అయితే అక్కడా ఓ నాటకానికి స్వయంగా నిర్వహణ, దర్శకత్వం చేసినా అది జనాదరణ పొందక పోవడంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అయినా నాటకరంగాన్నే నమ్ముకుని ఎలాంటి చిన్న పనులైనా చేస్తూ పదేళ్లు గడిపాడు. మధ్యలో గాయకుడిగా కొన్ని ఆల్బమ్స్ విడుదల చేశాడు. అలా పదేళ్లు గడిపాక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. ఆపై అంచెలంచెలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడిగా ఎదిగాడు. గోల్డెన్‌గ్లోబ్, కేన్స్, గ్రామీ లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు. ‘గన్స్ ఆఫ్ నవరోన్’, ‘ద ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్’, ‘ఎ టెరిబుల్ బ్యూటీ’, ‘దిస్ స్పోర్టింగ్ లైఫ్’, ‘ద హవాయి’, ‘కేమ్‌లట్’, ‘ఏ మ్యాన్ కాల్డ్ హార్స్’, ‘క్రామ్వెల్’లాంటి సినిమాలతో మంచి నటుడనిపించుకున్నాడు.