అభినయం విలక్షణం


ఆస్కార్‌ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న రాడ్‌ స్టీగర్‌ విలక్షణ నటన గురించి ఆయన అభిమానులు ఎప్పటికీ చెప్పుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మేటి సినిమాలుగా పేరొందిన ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు ధరించిన ఇతడి అభినయం శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. అతడి నటనకు తగినట్టుగానే అతడి పాత్రలు కూడా విభిన్నంగా, వెరైటీగా ఉండేవి. ‘ఇన్‌ ద హీట్‌ ఆఫ్‌ ద నైట్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్న ఇతడు, ఇంకా ‘ఆన్‌ ద వాటర్‌ఫ్రంట్‌’, ‘ద పాన్‌బ్రోకర్‌’, ‘టెరిసా’, ‘ద బిగ్‌ నైఫ్‌’, ‘ఓక్లహోమా’, ‘ఎక్రాస్‌ ద బ్రిడ్జి’, ‘అల్‌ కపోన్‌’, ‘డాక్టర్‌ జివాగో’, ‘నో వే టు ట్రీట్‌ ఎ లేడీ’, ‘వాటర్లూ’, ‘లాస్ట్‌ డేస్‌ ఆఫ్‌ ముస్సోలిని’, ‘ద హరీకేన్‌’లాంటి సినిమాలు అతడి కెరీర్‌లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గవి. అమెరికాలో 1925 ఏప్రిల్‌ 14న పుట్టిన ఇతడు బాల్యంలో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తాగుడుకు బానిసైన తల్లి నుంచి పదహారో ఏట పారిపోయిన ఇతడు సైన్యంలో చేరిపోయి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. తిరిగొచ్చాక అనుకోకుండా టీవీల్లో అవకాశం అందుకున్నాడు. మరో పక్క నాటకాలు కూడా వేస్తుండేవాడు. వచ్చిన అవకాశాన్నల్లా అందుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన ఇతడు, 2002 జులై 9న తన 77వ ఏట మరణించాడు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.