మై నేమ్‌ ఈజ్‌ సెకండ్‌ జేమ్స్‌బాండ్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో సీన్‌కానరీ తరువాత ఆ పాత్ర పోషించిన ఇంగ్లిష్‌ నటుడు రోజర్‌మోర్‌. జేమ్స్‌బాండ్‌ పాత్రను సృష్టించిన ఇయాన్‌ఫ్లెమింగ్‌ నవలల ఆధారంగా 1973 నుంచి 1985 వరకు తీసిన ఏడు సినిమాల్లో బాండ్‌గా నటించాడు. బాండ్‌గా తొలి చిత్రం ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’. మోర్, బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున ఎలిజబెత్‌ రాణి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారమైన ‘నైట్‌హుడ్‌’ అందుకున్నాడు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. బాండ్‌ సినిమాల కంటే ముందుగానే టీవీ, సినిమా రంగాల్లో చిర పరిచితుడు. లండన్‌లో 1927 అక్టోబర్‌ 14న పుట్టిన ఈ తెర గూఢచారి తండ్రి జార్జి ఆల్‌ఫ్రెడ్‌ మోర్‌ ఓ పోలీసు. తల్లి కలకత్తాలో పుట్టిన ఇంగ్లిషు వనిత. చదువు అయిన తరువాత ఓ యానిమేషన్‌ స్కూల్లో చేరితే అక్కడ పొరపాటు చేయడంతో తొలగించారు. ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనం కేసును తండ్రి జార్జి పరిష్కరిస్తే ఆ పరిచయంతో రోజర్‌మోర్‌కు ఆ దర్శకుడు ‘సీజర్‌ అండ్‌ క్లియోపాత్రా’ (1945) సినిమాలో ఓ ఎక్స్‌ట్రా వేషం ఇచ్చాడు. అదే అతడి మొదటి సినిమా అయినా, అమ్మాయిలను ఆకర్షించడాన్ని గమనించిన ఆ దర్శకుడు రోజర్‌మోర్‌ను ఓ యాక్టింగ్‌ స్కూల్లో చేర్పించాడు. పద్దెనిమిదేళ్ల వయసులో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రోజర్‌మోర్‌ను సైన్యంలోకి తీసుకున్నారు. యుద్ధం తరువాత తిరిగి సినిమా రంగానికి వచ్చి ‘పెర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌’ (1945), ‘గైటీ జార్జి’, ‘ట్రోటీ ట్రూ’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. తరువాత అమెరికా వచ్చి కొన్ని టీవీ సీరియల్స్‌లో పాల్గొన్నాడు. ఎంజీఎం నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరి ‘ద లాస్ట్‌ టైమ్‌ ఐ సా ప్యారిస్‌’ (1954) సినిమాలో ఎలిజబెత్‌ టేలర్‌ సరసన నటించాడు. ఆపై ‘ఇంటరెప్టెడ్‌ మెలోడీ’, ‘ద కింగ్స్‌ థీఫ్‌’, ‘డయానే’, ‘ద మిరాకిల్‌’ లాంటి సినిమాల్లో నటిస్తూనే ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాడు. తర్వాత జేమ్స్‌బాండ్‌ పాత్రలో మెరిశాడు. బాండ్‌ సినిమాలతో పాటు ఇతర సినిమాల్లో కూడా నటించాడు. బాండ్‌ సినిమాలకు ఓ సరికొత్త స్టైల్‌ను, ఓ హాస్య చతురతను, చిలిపితనాన్ని జోడించిన రోజర్‌మోర్‌ 2017 మే 23న తన 89 ఏళ్ల వయసులో మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.