ఏడేళ్లకే ఆస్కార్‌!

అందమైన పాప...మూడేళ్లకే వెండితెరకు పరిచయం...ఆమె కోసమే పాత్రలు సృష్టించి సినిమాలు తీసిన వైనం... ఏడేళ్లకు ఆస్కార్‌ పురస్కారం...ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం...మోడల్‌గా ఎన్నో సంస్థలతో ఒప్పందం...కానీ... 22 ఏళ్లకే సినిమాలకు గుడ్‌బై!-ఇవన్నీ షిర్లీ టెంపుల్‌ సంగతులు. నటిగా, గాయనిగా, డ్యాన్సర్‌గా, వ్యాపారవేత్తగానే కాదు రాజకీయ నేతగా కూడా తనదైన ముద్ర వేసింది. బాలనటిగానే ఆమె సినిమాలు హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి. పెద్దయ్యాక ఆమె ఘనా, జెకోస్లోవేకియాలకు యునైటెడ్‌ స్టేట్స్‌ రాయబారిగా వ్యవహరించింది. ఛీఫ్‌ ఆఫ్‌ ప్రొటోకాల్‌ బాధ్యతలు కూడా నిర్వహించింది.కాలిఫోర్నియాలో 1928 ఏప్రిల్‌ 23న పుట్టిన షెర్లీ టెంపుల్, అమ్మ ప్రోత్సాహంతో చిన్నప్పుడే గానం, నాట్యం, నటన నేర్చుకుంది. మూడేళ్ల వయసులోనే వెండితెరు పరిచయమైంది. ఉంగరాల జుట్టుతో, పెద్ద పెద్ద కళ్లతో అందంగా కనిపించే షీర్లీకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. కేవలం ఆమె కోసమే తీసిన ‘బ్రైట్‌ ఐస్‌’ సినిమా సంచలనం సృష్టించింది. ఏడేళ్లకల్లా ఆమెకు ‘జువెనైల్‌ అకాడమీ అవార్డు’ వచ్చింది. ఆమె నటించిన ‘కర్లీ టాప్‌’, ‘హైదీ’, ‘స్టాండప్‌ అండ్‌ ఛీర్‌’, ‘బేబీ టేక్‌ ఎ బౌ’, ‘లిటిల్‌ మిస్‌ మార్కర్‌’, ‘ద లిటిల్‌ కనోనెల్‌’, ‘అవర్‌ లిటిల్‌ గర్ల్‌’, ‘ద లిట్టెస్ట్‌ రెబెల్‌’, ‘కెప్టెన్‌ జనవరి’, ‘పూర్‌ లిటిల్‌ రిచ్‌ గర్ల్‌’, ‘డింపుల్స్‌’, ‘స్టో అవే’, ‘వీ విల్లీ వింకీ’ లాంటి సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఆ పాపతో ఒప్పందం కోసం పెద్ద పెద్ద వాణిజ్య కంపెనీలు క్యూకట్టాయి. బొమ్మలు, దుస్తులు, సరుకు కంపెనీల వారికి చిన్న పిల్లగానే సంతకాలు చేసింది షిర్లీ. పద్నాలుగేళ్లు, 21 ఏళ్ల మధ్య ఆమె 14 సినిమాల్లో నటించింది. అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. అయితే షెర్లీ 22 ఏళ్ల కల్లా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. ఆపై ఆమె టీవీల్లో చిన్నపిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించింది. వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించింది. టీవీ షోల్లో అతిథిగా కనిపించేది. చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను, అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన షిర్లీ, 2014 ఫిబ్రవరి 10న తన 85వ ఏట మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.