అభినయ గురువు

ర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా ప్రపంచ ప్రాచర్యం పొందడమే కాదు, నటనలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌గా రాణించాడు స్పైక్‌లీ. ‘40 ఏకర్స్‌ అండ్‌ ఎ మ్యూల్‌ ఫిల్మ్‌వర్క్స్‌’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా మరిచిపోలేని సినిమాలను అందించాడు. విద్యార్థి దశలో ఉండగానే చిత్ర నిర్మాణ పోటీల్లో పాల్గొన్ని ‘స్టూడెంట్‌ ఆస్కార్‌’ అందుకున్న ఇతడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఆస్కార్, బాఫ్టా, రెండు ఎమ్మీ, రెండు పీబొడీ, కేన్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డులు అందుకున్నాడు. ఇవి కాక గౌరవ ప్రదంగా అందించే హానరరీ అకాడమీ, బాఫ్టా, సీజర్, డొరోతీ అండ్‌ లిలియన్‌ గిష్‌ లాంటి పురస్కారాలు పొందాడు. ‘షి హేజ్‌ గాట్‌టు హ్యావిట్‌’ ద్వారా తొలి సారి మెగా ఫోన్‌ పట్టుకున్న ఇతగాడు, ‘డు ద రైట్‌ థింగ్‌’, ‘జంగిల్‌ ఫీవర్‌’, ‘మాల్కమ్‌ ఎక్స్‌’, ‘హి గాట్‌ గేమ్‌’, ‘ ద ఒరిజినల్‌ కింగ్స్‌ ఆఫ్‌ కామెడీ’, ‘25త్‌ అవర్‌’ ‘ఇన్‌సైడ్‌ మేన్‌’, ‘బ్లాక్లాన్స్‌ మేన్‌’లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. అమెరికాలో 1957 మార్చి 20న పుట్టిన ఇతడి అసలు పేరు షెల్టన్‌ జాక్సన్‌ లీ. అమ్మ అతడిని ముద్దుగా స్పైక్‌ అని పిలిచేది. అలా స్పైక్‌లీగా మారాడు. విద్యార్థి దశ నుంచే సినిమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. నటన, చిత్ర నిర్మాణాలను అభ్యసించాడు. హార్వర్డ్, న్యూయార్క్‌ల్లో ఫిలిం మేకింగ్‌ గురించి ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పాడు. టీవీ ప్రకటనల ద్వారా కెరీర్‌ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.