నవ్వులు రువ్విన లారెల్‌

ఒకడు సన్నగా రివటలాగా ఉంటాడు. మరొకడు లావుగా బండగా ఉంటాడు. వీరిద్దరూ కలిసి గొప్ప హాస్య జంటగా సినీ అభిమానులను కొన్ని దశాబ్దాల పాటు అలరించారు. వారిలో సన్నగా ఉండేవాడు లారెల్‌. బండగాడు హార్డీ. ‘లారెల్‌ అండ్‌ హార్డీ’ సినిమా అంటే ప్రపంచంలోని సినీ అభిమానులందరూ ఉత్సాహంగా చూసేవారు ఒకప్పుడు. ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో ఆ చిత్రాలు నేటి తరం వారిని సైతం అలరిస్తూనే ఉన్నాయి. వీరిలో స్టాన్‌ లారెల్‌ పుట్టింది 1890లో ఈరోజే. ఎప్పుడో 128 ఏళ్ల క్రితం పుట్టిన లారెల్‌ గురించి చెప్పుకుంటున్నామంటే అది అతడి గొప్పతనమే. నటుడిగా, నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా లారెల్‌ రాణించాడు. ఆలివర్‌ హార్డీ అనే నటుడితో కలిసి ఇతడు 107 చిత్రాల్లో నటించాడు. మరో ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్, లారెల్‌ కలిసి ఒకే ఓడలో బ్రిటన్‌ నుంచి న్యూయార్క్‌ రావడం విశేషం. ఇద్దరూ కలిసి అప్పట్లో స్టేజి మీద వినోద ప్రదర్శనలు ఇచ్చే బృందంలో కలిసి పనిచేశారు కూడా. దాదాపు 190 సినిమాలకు పనిచేసిన లారెల్‌ హాస్యనటుడిగా జీవిత కాల పురస్కారం అందుకున్నాడు. లారెల్, హార్డీల కాంస్య విగ్రహాలను లారెల్‌ సొంత ఊరిలో ఆవిష్కరించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.