జైలుకెళ్లిన నేరస్థుడు... జేజేలు పొందిన నటుడు!
పుట్టకుండానే అమ్మానాన్నా విడిపోయారు...

పుట్టగానే తల్లి వదిలేసింది...

అమ్మమ్మ తాతయ్య పంచన చేరాడు...

అక్షరాలను గుర్తించలేని డిస్లెక్సియా వ్యాధి...

దానికి తోడు చెముడు...

ఎనిమిదేళ్ల వయసులో అమ్మ దగ్గరకి వెళితే, సవతి తండ్రి చేతిలో హింస ఎదురైంది...

ఇంట్లోంచి పారిపోయి వీధి పిల్లలతో చేరి నేరాలకు అలవాటు పడ్డాడు...

తల్లి అతడిని పట్టుకుని పుట్టింటికి పంపేసింది...

పన్నెండేళ్ల వయసులో మళ్లీ అమ్మ దగ్గరకి వెళితే మరో సవతి తండ్రితో కొట్లాట మొదలు...

ఈసారి వీధి సావాసాలు దొంగగా మర్చాయి...

సవతి తండ్రి ఫిర్యాదుతో బాల నేరస్థుల జైలులోకి చేరాడు...

-ఇలాంటి నేపథ్యం ఉన్న కుర్రాడు...

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఎదగగలడా?

అత్యంత ప్రేక్షకాదరణ పొందగలడా?

ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయని అనుకోనక్కర్లేదు...

ఆ కుర్రాడి జీవితంలోనే జరిగింది!

ఈ నేపథ్యమంతా హాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడిగా పేరు తెచ్చుకున్న స్టీవ్‌ మెక్‌క్వీన్‌ది!

వెండితెరపై ఇతడు వేసినవి కూడా ప్రతి నాయకుడి వేషాలే!

హాలీవుడ్‌లో 1960లు, 1970ల్లో ఇతడు నటించిన సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయి!

ఇతడి ప్రాచుర్యం ఏ స్థాయికి చేరిందంటే... దర్శక నిర్మాతలు ఇతడు ఎంత అడిగితే అంత ఇచ్చేవారు! అడుగులకు మడుగులొత్తే వారు!


అంతర్జాతీయంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ‘ద మ్యాగ్నిఫియెంట్‌ సెవెన్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’, ‘ద టవరింగ్‌ ఇన్‌ఫెర్నో’, ‘ద శాండ్‌ పెబుల్స్‌’, ‘ద సిన్‌సిన్నాటి కిడ్‌’, ‘లవ్‌ విత్‌ ద ప్రోపర్‌ స్ట్రేంజర్‌’, ‘ద థామస్‌ క్రౌన్‌ ఎఫైర్‌’, ‘బుల్లిట్‌’, ‘ద గేట్‌వే’, ‘పాపిల్లన్‌’ సినిమాల్లో అతడు నటించి మెప్పించాడు!

నేరస్థుడిగా ముద్ర పడిన ఇతడు ఇంతగా ఎదగడానికి వెనుక ఏం జరిగింది... అనే సందేహం వస్తే తిరిగి మెక్‌క్వీన్‌ బాల్యంలోకి ఓసారి తొంగి చూడాలి.


అమ్మ వైవాహిక జీవితంలోని వైఫల్యాలన్నీ మెక్‌క్వీన్‌ బాల్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి. సవతి తండ్రులు అసహ్యించుకుంటూ తీవ్రంగా కొట్టడంతో ఎదురుతిరిగే తత్వం పెరిగింది. అలా నేరాల బాట పట్టిన మెక్‌క్వీన్‌ రెండు సార్లు జైలు జీవితం గడపడం విశేషం. బాల నేరస్థుల జైలు జీవితం అతడిలో కొద్దిగా మార్పు తెచ్చింది. పదహారేళ్లకు బయటకు వచ్చిన అతడితో జీవితం మళ్లీ ఆడుకుంది. సంపాదన కోసం రకరకాల పనులు చేశాడు. ఓ ఓడలో పనివాడిగా చేరాడు. బరువులెత్తాడు. కూలివాడిగా మారాడు. అమెరికా మెరైన్‌ సంస్థలో సభ్యుడైనా క్రమశిక్షణ రహితంగా ఉండడంతో ఏడుసార్లు డిమోషన్‌కి గురయ్యాడు. వీకెండ్‌ విరామం పూర్తయినా తిరిగి రానందుకు అతడిని అధికారులు అరెస్ట్‌ చేసి మిలిటరీ జైలులో పెట్టారు. ఆ జైలులో ఉన్నప్పుడే మెక్‌క్వీన్‌లో అసలైన మార్పు మొదలైంది. క్రమశిక్షణని ప్రేమించాడు. అయిదుసార్లు సహోదరుల ప్రాణాలు కాపాడ్డంతో గుర్తింపు, గౌరవం పొందాడు. ‘మంచి’ విలువేంటో తెలిసింది. ఇదంతా జరిగేసరికి అతడికి 22 ఏళ్లంతే. మారిన ఈ నవయువకుడు థియేటర్‌ సంస్థలో చేరి నటనను నేర్చుకున్నాడు. ఓ పక్క నాటకాలు, మరోపక్క మోటార్‌సైకిల్‌ రేస్‌లతో సంపాదనలో పడ్డాడు. క్రమంగా బుల్లితెరకి ఎక్కాడు. కొన్ని సీరియల్స్‌ అతడికి ఇంటింటి గుర్తింపును తెచ్చాయి. ఆపై వెండితెర అవకాశాలు తలుపుతట్టాయి. కొన్ని చిన్న చిన్న వేషాల తర్వాత ‘ద మ్యాగ్నిఫిసియెంట్‌ సెవెన్‌’ అతడి జాతకాన్ని మార్చేసింది. ఆపై ఒకో సినిమా అతడిని ఒకో శిఖరాన్ని ఎక్కించింది. ప్రపంచంలోనే విలాసవంతమైన జీవనం గడిపాడు. అత్యంత ఖరీదైన బైకులు, కార్లు మార్కెట్లోకి రాగానే మొదటి సారిగా కొనేసేవాడు. అతడి సినిమాలతో పాటు, వ్యక్తిగతంగా తోటి తెర నటిమణులతో అతడి ప్రేమలు, పెళ్లిళ్లు అంతే ప్రాచుర్యం పొందేవి. ఇండియానాలో 1930 మార్చి 24న పుట్టిన మెక్‌క్వీన్, సినిమా కథను తలపించే జీవితాన్ని గడిపి, 1980 నవంబర్‌ 7న తన 50 ఏళ్ల వయసులో మెక్సికోలో చనిపోయాడు. ఇతడి జీవితంపై ఎన్నో పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.