జనమెరిగిన జపాన్‌ నటుడు

అవడానికి జపాన్‌ నటుడే. ఆ దేశం నుంచి వచ్చే సినిమాలు కూడా తక్కువే. కానీ ఆ నటుడు మాత్రం ప్రపంచ ప్రాచుర్యాన్ని సంపాదించాడు. కారణం... అతడి అభినయం, అతడు నటించిన సినిమాలే. అతడి పేరు తొషిరో మిఫ్యూన్‌. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు అకిరా కురొసావా తీసిన పదహారు సినిమాల్లో ప్రధాన నటుడితడే. ఆ సినిమాలన్నీ దేశదేశాల్లో మేటి సినిమాలుగా పేరొందినవే. ‘రషోమన్‌’, ‘సెవెన్‌ సమురాయ్‌’, ‘ద హిడెన్‌ ఫోర్టెస్‌’, ‘థ్రోన్‌ ఆఫ్‌ బ్లడ్‌’, ‘యోజింబో’లాంటి సినిమాల్లో ఇతడి అభినయాన్ని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. వీటితో పాటు మరో 150 సినిమాల్లో కూడా ఇతడు నటించాడు. జపాన్‌ ఆక్రమిత చైనాలో 1920 ఏప్రిల్‌ 1న పుట్టిన ఇతడు, తన తండ్రి ఫొటోస్టూడియోలో పనిచేస్తూ ఆ కళ పట్ల ఆకర్షితుడయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా సేవలందించిన తర్వాత ఫొటోగ్రాఫర్‌గాను, కెమేరామేన్‌గానూ రాణించాడు. సినీ ఔత్సాహికులకు ఫొటోలు తీసేవాడు. వాళ్లలో ఓ స్నేహితుడు అతడికి తెలియకుండానే అతడి ఫొటోను ఓ సినీ స్టూడియోవారికి పంపించాడు. అలా అనుకోకుండా అతడికి తొలి సినీ అవకాశం లభించింది. అలా మేటి నటుడిగా ఎదిగిన ఇతడు ఆ తర్వాత యాక్టింగ్‌ స్కూలు పెట్టి ఎంతో మంది నటులకు మార్గదర్శకుడయ్యాడు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఇతడు, 1997 డిసెంబర్‌ 24న తన 77వ ఏట టోక్యోలో కన్నుమూశాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.