క్యారెక్టర్‌ నటుడిగా మెప్పించి...

ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్న క్యారెక్టర్‌ నటుడతడు. పేరు విక్టర్‌ మెక్‌లాగ్లెన్‌. ప్రేక్షకాదరణ పొందిన ఎన్నో సినిమాల్లో ఇతడు కనిపించి మెప్పిస్తాడు. ‘ద ఇన్ఫార్మర్‌’ చిత్రంలో నటనకు ఆస్కార్‌ అందుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1886 డిసెంబర్‌ 10న పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టిన ఇతడి నలుగురు సోదరులు కూడా నటులు కావడం విశేషం. పద్నాలుగేళ్లకే ఇల్లు వదిలి బ్రిటిష్‌ ఆర్మీలో చేరడానికి వెళ్లిన ఇతడిని వయసు సరిపోదని పంపేశారు. ఆ తర్వాత నాలుగేళ్లు బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోలీస్‌ కానిస్టేబుల్‌గా కూడా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో కెప్టెన్‌గా సేవలందిస్తూనే బాక్సింగ్‌ను కొనసాగించాడు. ఆ బాక్సింగే అతడికి ‘ద కాల్‌ ఆఫ్‌ ద రోడ్‌’ సినిమాలో బాక్సర్‌ పాత్రకు అవకాశం ఇచ్చింది. ఆపై అతడు నటుడిగా స్థిర పడ్డాడు. ‘కొరింథన్‌ జాక్‌’, ‘ద ప్రే ఆఫ్‌ ద డ్రాగన్‌’, ‘ద స్పోర్ట్‌ ఆఫ్‌ కింగ్స్‌’, ‘ద గ్లోరియస్‌ అడ్వంచర్‌’, ‘ఎ రొమాన్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌ బాగ్దాద్‌లాంటి బ్రిటన్‌ సినిమాల్లో నటించాక, హాలీవుడ్‌ అవకాశాలు పొందాడు. ‘ద ఐల్‌ ఆఫ్‌ రెట్రిబ్యూషన్‌’, ‘మెన్‌ ఆఫ్‌ స్టీల్‌’, ‘ద లవ్స్‌ ఆఫ్‌ కార్‌మెన్‌’, ‘ద కాక్‌ ఐడ్‌ వరల్డ్‌’, ‘హ్యాపీడేస్‌’, ‘ద మ్యాగ్నిఫిషెంట్‌ సెవెన్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న ఇతడు 1959 నవంబర్‌ 7న తన 72వ ఏట మరణించాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.