మూకీల నుంచి టాకీల దాకా...

మూకీ సినిమాల్లో అతడు ఆకట్టుకున్నాడు... టాకీలు వచ్చాక కూడా అలాగే అలరించాడు... మొత్తానికి గొప్ప నటుడనిపించుకున్నాడు... ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు అందుకున్నాడు... అతడే వార్నర్‌ బాక్స్‌టర్‌. ఒకప్పుడు కామిక్‌ పుస్తకాలు, రేడియోలు రాజ్యమేలుతున్న రోజుల్లో ‘కిస్కో కిడ్‌’ అనే పాత్ర విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాత్రలో ‘ఇన్‌ ఓల్డ్‌ అరిజోనా’ సినిమాలో నటించిన వార్నర్, ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. మూకీల నుంచి టాకీల వరకు చూస్తే ‘ద గ్రేట్‌ గాట్స్‌బై’, ‘ద ఆఫుల్‌ ట్రూత్‌’, ‘42 స్ట్రీట్‌’, ‘స్లేవ్‌ షిప్‌’, ‘కిడ్నాప్డ్‌’, ‘ద స్టోలెన్‌ జూల్స్‌’, ‘క్రైమ్‌ డాక్టర్‌’లాంటి ఎన్నో సినిమాల ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించాడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా ఆకట్టుకున్న అతడు ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’ గౌరవాన్ని పొందాడు. అమెరికాలో 1889 మార్చి 29న పుట్టిన వార్నర్, అయిదు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. చదువుకునే రోజుల్లోనే స్కూలు నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు. పట్టభద్రుడయ్యాక సినిమాల్లో ఎక్స్‌ట్రా నటుడిగా వేషాలు వేసేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కీలక పాత్రల్లో మంచి నటుడిగా అలరించిన ఇతడు, 1951 మే 7న కాలిఫోర్నియాలో తన 62వ ఏట మరణించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.