అద్భుత పాత్రల సృష్టికర్త

టామ్‌ అండ్‌ జెర్రీ, స్కూబీడూ, స్మర్ఫ్స్, యోగి బేర్‌... ఈ పాత్రల గురించి తెలియని వారు ప్రపంచవ్యాప్తంగా ఉండరనడంతో అతిశయోక్తి లేదు. ఇలాంటి పాత్రలకు తన కుంచెతో ప్రాణం పోసిన చిత్రకారుడు విలియం హన్నా. యానిమేటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, వాయిస్‌ యాక్టర్‌గా, కార్టూన్‌ ఆర్టిస్ట్‌గా, సంగీత కారుడిగా తనదైన ముద్ర వేసిన సృజనశీలి. తన స్నేహితుడు జోసెఫ్‌ బర్బెరాతో కలిసి ‘హన్నా బార్బెరా’ స్టూడియోను నెలకొల్పి అద్భుతమైన పాత్రలతో కార్టూన్‌ స్ట్రిప్స్‌ నుంచి పుస్తకాలు, బొమ్మలు, టీవీ సీరియల్స్, వెండితెర సినిమాలతో వినోద ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. వీళ్లు సృష్టించిన పాత్రలు అమెరికా సంస్కృతిలో ఓ భాగమైపోవడం విశేషం. వీరి పాత్రలను అప్పటి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మంది చూశారనేది ఓ అంచనా. ఈ పాత్రల కథలు దాదాపు 28 భాషల్లోకి తర్జుమా అయ్యాయి. మెక్సికోలో 1910 జులై 14న తల్లిదండ్రుల ఏడుగురి సంతానంలో ఏకైక మగపిల్లవాడిగా పుట్టిన విలియం హన్నా, పన్నెండేళ్ల వయసులో శాక్సాఫోన్‌ వాయించేవాడు. సంగీతంపై అప్పట్లో పెంచుకున్న మక్కువ భవిష్యత్తులో అతడి సినిమాలకు ఎంతగానో ఉపయోగపడింది. బొమ్మలు గీయడంలో ప్రావీణ్యం సాధించాడు. అదే అతడిని యానిమేటర్‌గా మార్చింది. వినోద రంగంలో తన పాత్రలతో చెరగని ముద్ర వేసిన ఈయన 2001 మార్చి 22న తన 90వ ఏట కాలిఫోర్నియాలో మరణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.