టాప్‌ టెన్‌ నటుడు

‘టాప్‌ 10 స్టార్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గుర్తింపు పొందడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ అదే గుర్తింపును ఆరు సార్లు పొందాడంటే, ఆ నటుడిలో ఏదో విశేషం ఉన్నట్టే. అలాంటి విశేషం ఉన్నవాడే విలియం హోల్డెన్‌. హాలీవుడ్‌లో 1950, 60 దశకాల్లో అత్యధిక బాక్సాఫీసు వసూళ్లు సాధించిన నటుడితడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘ద బ్రిడ్జ్‌ ఆన్‌ ద రివర్‌ క్వాయ్‌’, ‘ద వైల్డ్‌ బంచ్‌’, ‘ప్యానిక్‌’, ‘నెట్‌వర్క్‌’, ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’, ‘సబ్రీనా’లాంటి సినిమాల్లో మంచి నటనతో మెప్పించాడు. ‘స్టలాగ్‌ 17’ (1953) సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. బుల్లితెరపై కూడా నటించి ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డు గెల్చుకున్నాడు. హాలీవుడ్‌ క్లాస్‌కి సినిమాల కాలంలో మేటి నటుడిగా ప్రాచుర్యం పొందాడు. ఇల్లినాయిస్‌లో 1918 ఏప్రిల్‌ 17న పుట్టిన ఇతడు రేడియో కార్యక్రమాలు, నాటకాలు, టీవీల ద్వారా పేరు తెచ్చుకుని వెండితెరకి పరిచయం అయ్యాడు. ఈ విలక్షణ నటుడు 1981 నవంబర్‌ 12న కాలిఫోర్నియాలో తన 63వ ఏట మరణించాడు.

                                   


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.