బుల్లితెరను దున్నేశాడు...వెండితెరపై వెలిగాడు!

విలియం షాట్నర్‌ అంటే అమెరికా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ ఉండదు. అతడి సృజనాత్మకత ఏంటో వాళ్లు దశాబ్దాల తరబడి బుల్లితెరపైన, వెండితెరపైన చూసిన వాళ్లే. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ రైటర్‌గా, గాయకుడిగా అతడి ప్రతిభ ఏడు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. ‘స్టార్‌ట్రెక్‌’ కథల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కెప్టెన్‌ జేమ్స్‌ టి. కిర్క్‌ పాత్రలో అతడు మెప్పించాడు. ఈ పాత్ర గురించి, స్టార్‌ట్రెక్‌ ప్రస్థానం గురించి, ఆ కథల్లో కనిపించే విశ్వం గురించి అతడు సైన్స్‌ఫిక్షన్‌ పుస్తకాలు రాస్తే అవి కూడా విపరీతంగా అమ్ముడుపోయాయి. అతడు రూపొందించిన ఎన్నో టీవీ సీరియల్స్‌ ఇంటింటి వీక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక గాయకుడిగా ఎనిమిది ఆల్బమ్స్‌ విడుదల చేస్తే అవి కుర్రకారును ఓ ఊపు ఊపేశాయి. ఏ పని చేసినా అందులో ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులను అందుకున్నాడు. కెనడాలో 1931 మార్చి 22న పుట్టిన ఇతడు, యువకుడిగా ఉన్నప్పటి నుంచీ నాటకాల్లో పాత్రలు ధరించి తొలి అడుగులు వేశాడు. ఆపై టీవీ రంగంలో దశాబ్దాల తరబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇరవై ఏళ్ల వయసులో వెండితెరపై ‘బట్లర్స్‌ నైట్‌ ఆఫ్‌’ సినిమాతో మొదలై, ‘ద బ్రదర్స్‌ కరమాజోవ్‌’, ‘ద ఎక్స్‌ప్లోజివ్‌ జనరేషన్‌’, ‘ద ఇంట్రూడర్‌’, ‘జడ్జిమెంట్‌ ఎట్‌ న్యూరంబెర్గ్‌’, ‘బిగ్‌ బ్యాడ్‌ మామా’లాంటి ఎన్నో సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.