‘గుండు’ వేషం... గొప్ప అభినయం


ప్ర
పంచవ్యాప్తంగా గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ‘యుల్‌ బ్రైనర్‌’ తెలుసా? - అని అడిగితే... ఎవరూ చెప్పలేరు! అదే... ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటైన ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’లో ఈజిప్టు చక్రవర్తి పరోవా రామెసెస్‌2 పాత్రధారుడు... అని చెబితే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆస్కార్, టోనీ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న ఇతడి ‘గుండు వేషం’ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఇతడి అభిమానులు చాలా మంది ఇతడిలాగే గుండు కొట్టించుకోవడం విశేషం. ఈ ఫ్యాషన్‌ ‘యుల్‌ బ్రైనర్‌ లుక్‌’గా పేరొందడం చిత్రం. రష్యాలో ఓ మారుమూల ప్రాంతంలో 1920లో ఇదే రోజు పుట్టిన బ్రైనర్‌ను విధి చైనాకి, ప్యారిస్‌కి, న్యూయార్క్‌కి తిప్పి హాలీవుడ్‌లో మేటి నటుడిగా మార్చింది. నాన్న మరొకరిని పెళ్లిచేసుకుని కుటుంబాన్ని వదిలేస్తే, అమ్మతోపాటు చైనా వచ్చేసి, రెండో ప్రపంచ యుద్ధ భయంవల్ల ప్యారిస్‌కి మారిన బాల్యం ఇతడిది. ప్యారిస్‌ క్లబ్బుల్లో గిటార్‌ వాయించినా, ఫ్రెంచి సర్కస్‌లో ఐదేళ్లు పనిచేసినా అదంతా పొట్టకూటి కోసమే. ఆ సమయంలోనే లుకేమియా బారిన పడిన ఇతడిని తీసుకుని అమ్మ న్యూయార్క్‌ వలస వచ్చింది. విలక్షణ కంఠస్వరం ఉన్న బ్రైనర్‌ రేడియో ఎనౌన్సర్‌గా, నాటకాల్లో వేషధారుడిగా పనిచేశాడు. టీవీ కార్యక్రమాలకు దర్శకుడిగా కూడా మారాడు. అప్పుడే అతడికి ‘ద కింగ్‌ అండ్‌ ఐ’ అనే నాటకంలో కింగ్‌ మోంగ్‌కట్‌ వేషం వచ్చింది. ఆ పాత్ర కోసమే అతడు తొలిసారి ‘గుండు’ కొట్టించుకున్నాడు. ఆ నాటకం విజయవంతం కావడంతో అదే పాత్రను వేదికలపై ఏకంగా 4,625 సార్లు ప్రదర్శించడం విశేషం. ‘గుండు’ నచ్చడంతో నిజ జీవితంలో కూడా అలాగే ఉండిపోయిన బ్రైనర్, అదే కింగ్‌ పాత్రతో 1956లో వెండితెర నటుడిగా మారాడు. ఆ సినిమాకి ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. వెంటనే ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’ సినిమాలో ఈజిప్టు చక్రవర్తి పాత్ర లభించింది. దీంతో అతడి ఖ్యాతి ప్రపంచమంతా పాకింది. ఆపై ఇతడు ‘ద మ్యాగ్నిఫియంట్‌ సెవెన్‌’, ‘రిటర్న్‌ ఆఫ్‌ ద సెవెన్‌’, ‘వెస్ట్‌ వరల్డ్‌’, ‘అనస్టాషియా’, ‘ద జర్నీ’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగానే కాక ఫొటోగ్రఫీలో కూడా కృషి చేసి రెండు పుస్తకాలు కూడా రచించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.