మొట్టమొదటి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా...‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’
‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ - (టాడ్‌ ఆవో టెక్నాలజీలో) 70 ఎమ్‌ఎమ్‌ సినిమా
దర్శకుడు : మైకేల్‌ యాండర్‌సన్‌
నిర్మాత : మైకేల్‌ టాడ్‌
విడుదల : 17 అక్టోబర్‌ 1956
నిడివి : 170 నిమిషాలు
నిర్మాణం : మైకేల్‌ టాడ్‌
తారాగణం : డేవిడ్‌ నివెన్‌ (ఫిలియాస్‌ ఫాగ్‌), క్యాంటిన్‌ఫ్లాస్‌ (పాస్పార్తూ), షిర్లీ మెక్‌లిన్‌ (అయూదా), రాబర్ట్‌ న్యూటన్‌ (ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌), తదితరులుముళ్లపూడి వెంకటరమణ అంటే మన కళ్లముందో అద్భుతమైన రచయిత కనిపిస్తారు. బుడుగు, సీగానపెసూనాంబ, రాధాగోపాళం, రెండుజెళ్లసీత, (అప్పుల) అప్పారావు వగైరావగైరా పాత్రలెన్నో కంటిముందు కదలాడతాయి. అవన్నీ సరే, ఆయన రచయితగా ఎన్నో మారువేషాలు (అవేనండీ, కలంపేర్లు) వేసుకుని, అనేక నవలల్నీ తెలుగులోకి తర్జుమా చేశారన్న విషయం కొందరికి మాత్రమే గుర్తొస్తుంది. అలా ఆయన వేసుకున్న ఓ మారువేషం పేరు ‘ఎస్‌. పార్థసారథి’. ఆ పేరుతో ఆయన తర్జుమా చేసిన నవల ‘80 రోజుల్లో భూప్రదక్షిణం’. 1956, 57 ప్రాంతాలనాటి ‘ఆంధ్రసచిత్రవారపత్రిక’లో సీరియల్‌గా వచ్చిన నవల అది. వాస్తవానికి అది ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఎయిటీ డేస్‌’ అనే ఆంగ్ల నవలకు అనువాదం. ఆ ఆంగ్ల నవలను జ్యూల్స్‌ వెర్న్‌ అనే ఫ్రెంచ్‌ రచయిత రాశారు. ఈయన కూడా గొప్ప రచయితే! అంతాఇంతా కాదు, ఇప్పటికీ ఎడ్వెంచర్‌ ఫిక్షన్‌ నవలలంటే, ప్రపంచం మొత్తంమీద ఆయన పేరునే మనం మొదట తల్చుకోవాల్సి ఉంటుంది. ఆయన ఆ నవలను 1872లో రాశారు. అయినా, 1956, 57ల్లోనే అది తెలుగు సీరియల్‌గా ఎందుకొచ్చిందీ అంటే, మరి, అప్పుడే కదా.. ఇంగ్లిష్‌లో ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఎయిటీ డేస్‌’ అనే సినిమా వచ్చింది! ఆ సినిమా అద్భుతమని భావించిన ముళ్లపూడివారు, పనికట్టుకుని మరీ, ఆ ఇంగ్లిష్‌ నవలను తెలుగులోకి అనువదించారు. మధ్యలో బాక్స్‌ ఐటమ్స్‌ పెట్టి, ఆ సినిమా విశేషాలనూ చెప్పుకుంటూ వచ్చారు... ఇంతకీ ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ ఎయిటీ డేస్‌’ సినిమా, 1965 అక్టోబర్‌ 17న న్యూయార్క్‌ నగరంలో విడుదల కావటం విశేషం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని... ఆ సినిమా విషయాలూ విశేషాలూ... ఇవిగో.. మీకోసం!!

సస్పెన్స్‌ నిండిన కథ
‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఎయిటీ డేస్‌’ (దీన్నే ‘ఎరౌండ్‌ ది వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ అనడమూ కద్దు) సినిమాలో మాంచి కథ ఉంటుంది. చాలా సస్పెన్స్, కొంత రొమాన్సూ కలగలిపిన కథ అది. ముందుగా ఆ కథను తెలుసుకుందాం: కథంతా 19వ శతాబ్దం చివరి రోజుల్లో, అంటే, 1872లో జరుగుతుంటుంది. ఇప్పటిలాగ, అప్పట్లో ఇన్ని ప్రయాణ సదుపాయాలు, ఇన్ని సమాచార సదుపాయాలూ ఉండేవి కావు. అది మనం గుర్తు పెట్టుకుని మరీ, కథలోకి వెళ్దాం. లండన్‌లో అదో పెద్ద పేరున్న క్లబ్‌. పేరుకు అది ‘రిఫార్మ్‌ క్లబ్‌’ కానీ, ఆ క్లబ్‌ ఏమంత రిఫార్మ్‌ (సంస్కరణ) అయినది కాదు. అందులోకి మహిళలను అస్సలు రానియ్యరు. ఆ క్లబ్‌లో ఓ సభ్యుడు ఫిలియాస్‌ ఫాగ్‌. ఆవేళే ఆయన తనకోసం ఓ కొత్త పనివాడిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అతని పేరు - పాస్పార్తూ. ఆ సాయంత్రం ఫిలియాస్‌ ఫాగ్, ఆ క్లబ్‌లోకి వస్తాడు. అప్పటికే అక్కడ అతని స్నేహితులు మరోముగ్గురు చేరి ఉంటారు. థామస్‌ ఫ్లానగన్, శామ్యూల్‌ ఫాలెంటిన్, జాన్‌ సల్లివన్‌లు, ఫాగ్‌తో పిచ్చాపాటీలో పడతారు. ఆరోజే లండన్‌లో ఒక బ్యాంక్‌లో ఓ దోపిడీ జరిగి ఉంటుంది. కబుర్లన్నీ అటువైపు మళ్లుతాయి. ఆ దోపిడీదొంగ ఎవరో ఆ డబ్బుతో ప్రపంచంలో ఎక్కడికో చెక్కేసి ఉంటాడని అనుకుంటారు. మాటలు క్రమంగా, ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఎంత కాలం పడుతుందనే విషయం మీదకు వచ్చిచేరతాయి. తానైతే, 80 రోజులలో భూద్రక్షిణం చేయగలనని ఫాగ్‌ అంటాడు. దాన్ని సల్లివన్‌ అంగీకరించడు. మొత్తానికి పందెం అంటే పందెం అనుకున్నారు. తన యావదాస్తికీ సమానమైన 20 వేల పౌండ్‌లతో ఫాగ్‌ పందెం వేస్తాడు. ఆరోజే బయలుదేరి, సరిగ్గా 80 రోజులనాటికి అదే సమయానికి తిరిగి చేరాలనేది పందెం. అన్నమాట ప్రకారమే ఫిలియాస్‌ ఫాగ్, తన కొత్త సర్వెంట్‌ పాస్పార్తూతో కలిసి బయలుదేరతాడు. లండన్‌లోని షేరింగ్‌ క్రాస్‌ స్టేషన్‌ దగ్గర రైలు ఎక్కుతారు. పందెం కట్టి మరీ ప్రపంచయాత్రకు బయలుదేరటం ప్రపంచవార్త అవుతుంది. అన్ని పత్రికలూ ఈ వార్తను ప్రచురిస్తుంటాయి. ఫాగ్, పాస్పార్తూలు మొదట సూయజ్‌ హార్బర్‌ దగ్గర దిగుతారు. లండన్‌లో జరిగిన బ్యాంక్‌ దోపిడీగురించి స్కాట్లండ్‌ యార్డ్‌కు చెందిన డిటెక్టివ్‌ ఇనస్పెక్టర్‌ ఫిక్స్‌ పరిశోధన ఆరంభిస్తాడు. అతనికి ఈ దోపిడీ చేసినవాడు ఫిలియాస్‌ ఫాగ్‌ అనే అనుమానం ఉంటుంది. కానీ, ఫిలియాస్‌ ఫాగ్, పాస్పార్తూలను అరెస్ట్‌ చేయడానికి తగిన వారెంట్‌ లేకపోవటంతో వారిని ఏమీ చెయ్యలేకపోతాడు. ఫలితంగా వారికి తెలియకుండా తానూ వారిని వెంబడిస్తుంటాడు. ఫిలియాస్‌ ఫాగ్, పాస్పార్తూలు ఇద్దరూ బొంబాయికి చేరుకుంటారు. బొంబాయి నుంచి కలకత్తాకు వెళ్లే రైలుదారిలో పట్టాలు పాడవటంతో, వీళ్లు దాదాపు 12 గంటలపాటు అలహాబాద్‌లో ఉండిపోవాల్సివస్తుంది. అదే సమయంలో ‘సతి’కి (సతీసహగమనం) గురవుతున్న అయూదా అనే రాకుమారిని రక్షిస్తారు. ఇదే సమయంలో పాస్పార్తూ, వేరే నేరం ఏదో చేసి, కలకత్తాలో పోలీసులకు దొరికిపోతాడు. తగిన జుర్మానా కట్టి, పాస్పార్తూను ఫాగ్‌ విడిపించుకుంటాడు. హాంకాంగ్‌ వెళ్లాలని నౌక ఎక్కితే, అది తుఫాను కారణంగా 24 గంటల ఆలస్యంగా హాంకాంగ్‌ చేరుతుంది. హాంకాంగ్‌లో మత్తుమందులు తీసుకున్న నేరానికి పాస్పార్తూను హాంకాంగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, ఒక స్టీమర్‌లో పడేస్తారు. ఈ సంగతి తెలియని ఫాగ్‌ ఒడ్డుమీద ఉండగానే, స్టీమర్‌ కదిలివెళ్లిపోతుంది. అయితే, ఫాగ్‌ను ఓక్లహామా మీదుగా శాన్‌ ఫ్రాన్సిస్కో చేరుస్తానని చెప్పి, దారిలోనే ఆ స్టీమర్‌ను ఎక్కిస్తాడు మరో వ్యక్తి. శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్‌కు వెళ్లే రైలుమీద రెడ్‌ ఇండియన్‌లు దాడి చేస్తారు. ఆ విపత్తు నుంచి బయటపడి, చివరికి న్యూయార్క్‌ నుంచి లివర్‌పూల్‌కు చేరతారు. ఈ సమయానికి ఇనస్పెక్టర్‌ ఫిక్స్‌ చేతికి వారంట్‌ అందటంతో, ఫాగ్‌ను ఫిక్స్‌ అరెస్ట్‌ చేయిస్తాడు. ఆ గండాన్నీ దాటుకుని, ఒక హాట్‌ఎయిర్‌ బెలూన్‌లో లండన్‌కు చేరతాడు ఫాగ్‌. కానీ, అప్పటికే అనుకున్న 80 రోజుల గడువు దాటిపోయిందని చాలా నిరాశ చెందుతాడు. నిజానికి ఆయన లండన్‌నుంచి తన ప్రయాణం ఆరంభించి, తూర్పువైపునుంచి పశ్చిమ దిశవైపు ప్రయాణించడంతో, ఆయనకు ఒక రోజు కలిసివస్తుంది. ఆ విషయాన్ని ఫాగ్‌ గమనించడు. చివరికి, ఫాగ్‌ వచ్చాడన్న విషయం తెలిసిన స్నేహితులు అతన్ని అభినందించడానికి వస్తారు. దాంతో, తను, గడువుకు ఒకరోజు ముందే లండన్‌ చేరుకున్నాడని గుర్తించడంతో, ఫాగ్‌ సంబరపడిపోతాడు. రిఫార్మ్‌క్లబ్‌లో వేసుకున్న పందెం గెలవటంతోబాటు, ‘సతి’ ప్రమాదం నుంచి తను రక్షించిన రాకుమారి అయూదాను కూడా సొంతం చేసుకుంటాడు. ‘రిఫార్మ్‌ క్లబ్‌’లోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా అయూదా కూడా చరిత్ర సృష్టిస్తుంది.
                                                                                         పేరున్న తారాగణం!
అసలు, ఫ్రెంచ్‌ రచయిత అయిన జ్యూల్స్‌ వెర్న్‌ రాసిన ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ నవలమీద మైకేల్‌ టాడ్‌కు ఎప్పటినుంచో దృష్టి ఉండేది. ఈ ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ను ఆయన 1946లోనే ప్రముఖ బ్రాడ్‌కాస్టర్‌ అయిన ఆర్సన్‌ వెల్లిస్‌ (ఈయనే తర్వాత కాలంలో ‘సిటిజెన్‌ కేన్‌’ చిత్రాన్ని తీశారు) చేత రేడియో నాటకంగా తీయించారు. ఆ తర్వాత, అప్పటివరకూ ఉన్న 35ఎమ్‌ఎమ్‌ ఫిల్మ్‌ వెడల్పును రెట్టింపు చేస్తూ, 70 మిల్లీమీటర్‌ల వెడల్పుతో ఇదే నవలను సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. దీనికీ ఓ కారణం ఉంది... నవలలోని ఇతివృత్తం ప్రపంచం అంత విస్తృతమయింది. అంత విస్తృతి ఉన్న కథను 35 ఎమ్‌ఎమ్‌లో తీస్తే కొత్తదనం ఏముంటుందీ అన్నది మైకేల్‌ టాడ్‌ ఆలోచన. ఇలా 70ఎమ్‌ఎమ్‌లో సినిమా తీయడమంటే చాలా డబ్బుఖర్చుతో కూడుకున్న పని. సాంకేతికంగా కూడా ఇది కష్టమే.. అయినా, మైకేల్‌ టాడ్, ముందడుగే వేశారు. ఇంత ఖర్చుతో కూడుకున్న పని కావటంతో, ఎన్ని ఆకర్షణలను పెట్టి అయినా, ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మైకేల్‌ టాడ్‌. దాంతో తనకున్న పలుకుబడి అంతా ఉపయోగించి, చిత్రంలో చిన్నాపెద్దా అన్ని పాత్రలకూ పెద్ద నటీనటులనే ఎంచుకున్నారు. డేవిడ్‌ నివెన్‌ను ఫిలియాస్‌ ఫాగ్‌ పాత్రకు తీసుకోగా, పాస్పార్తూ పాత్రకు కమేడియన్‌గా ఎంతో పేరున్న కాంటిన్‌ఫ్లాస్‌ను ఎంచుకున్నారు. ఆ తరువాత, నోయెల్‌ కొవార్డ్‌ను తీసుకుని, ఆయన పేరు చెప్తూ, ఫ్రాంక్‌ సినట్రా, బీట్రిస్‌ విల్, బస్టర్‌ కీటన్, ట్రెవోర్‌ హోవార్డ్‌ వంటి మొత్తం 44 మంది సీనియర్‌ నటీనటులచేత ఏవేవో పాత్రలలో నటింపజేసి, సినిమా విలువను పెంచే ప్రయత్నం చేశారు. ఇక, భారతీయ రాకుమారి అయూదా పాత్రకోసం అప్పటి ‘మిస్‌ సిలోన్‌’ అయిన జొహాలిన్‌ పార్క్‌తో ఆరంభించి, సుసాన్‌ అలెగ్జాండర్, మార్లీ ఇంగ్లిష్‌వంటి ఎందర్నో చూసి, చివరికి షెర్లీ మెక్‌లీన్‌ను ఎంచుకున్నారు. అప్పటికి ఆమె, కేవలం రెండు సినిమాలలోనే నటించారు. ఈ నటీనటులందరికీ ఈ సినిమా కోసం జరిపిన మేకప్‌ టెస్ట్‌ల ఫిల్మ్‌లన్నీ నేటికీ జ్యూల్స్‌ వెర్న్‌ లైబ్రరీ కలెక్షన్‌లలో భద్రంగా ఉన్నాయి.దర్శకుడి ఎంపికా కష్టమే!
‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి దర్శకుడుగా ఎవర్ని ఎంచుకోవాలనేదీ నిర్మాత మైకేల్‌ టాడ్‌కు పెద్ద గడ్డు సమస్య అయింది. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ సమకూర్చినవారైన ఎస్‌.జె.పెరల్‌మన్, జేమ్స్‌ పో, జాన్‌ ఫారోలలో జాన్‌ ఫారోను దర్శకత్వం స్వీకరించమని టాడ్‌ కోరారు. కానీ, ఆయన తనవల్ల కాదని చేతులు ఎత్తేయటంతో, మైకేల్‌ యాండర్‌సన్‌ను ఎంచుకున్నారు.13 దేశాల్లో చిత్రీకరణ...
1955లో షూటింగ్‌ ఆరంభం అయింది. మొత్తం 13 దేశాల్లో, 112 లొకేషన్‌లలో, 140 సెట్‌లమీద షూటింగ్‌ను జరిపారు. ఈ షూటింగ్‌లలో చిన్నాపెద్దా అందరూ కలిపి, మొత్తం 68వేల 894మంది పాల్గొన్నారు. వీరికి 74వేల 685 కాస్ట్యూమ్స్‌ సిద్ధం చేసి వాడారు. షూటింగ్‌కోసం మొత్తం 7వేల 959 జంతువులను వాడారు. 1955 డిసెంబర్‌ నాటికి షూటింగ్‌ పూర్తయింది. 426 రీళ్ల పిక్చర్‌ అండ్‌ సౌండ్‌ మెటీరియల్‌ రెడీ అయింది. తర్వాత, నాలుగు నెలలు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసి, విడుదలకు సిద్ధం చేశారు.
దొంగతనంగా షూటింగ్‌

‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచం మొత్తంమీద 70ఎమ్‌ఎమ్‌లో రూపొందిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం! ఈ చిత్ర నిర్మాత అయిన మైకేల్‌ టాడ్, తను సొంతంగా చేయించిన పరిశోధనల కారణంగా తయారయిన ‘టాడ్‌ ఆవో’ టెక్నాలజీనీ ఈ చిత్రానికి వాడారు. పైగా, అనేక చోట్ల చాలా కష్టనష్టాలకు సిద్ధపడి, ఆయన చిత్రీకరణలను జరిపించారు. పారిస్‌లో పోలీసుల బెడద ఎక్కువ కావటంతో, అక్కడ దొంగతనంగా షూటింగ్‌ చేయించారు. లండన్‌లో అయితే, ఒక కూరగాయల బుట్టలో కెమెరా పెట్టి, అక్కడివారికి తెలియకుండా షూటింగ్‌ చేయించారు. మొత్తంమీద అనుకున్న బడ్జెట్‌ 30 లక్షల డాలర్‌లకు మించి రెట్టింపు ఖర్చయింది. అయితేనేం, టాడ్‌ చాలా గొప్ప సినిమా తీశారనే పేరు మిగిలిపోయింది. చిత్రానికి మొదటి రెండేళ్లలోనే దాదాపు పదింతల ఆదాయం, అంటే ఆరున్నరకోట్ల డాలర్‌ల రాబడి వచ్చింది.

విరాళంగా సినిమా మెటీరియల్‌
‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రం 1956 అక్టోబర్‌ 17న విడుదల అయింది. చిత్రం బాగుందని ఆ వెంటనే అంతర్జాతీయపరమైన టాక్‌ వచ్చేసింది. పేరు వస్తే చాలు, డబ్బు దానంతట అదే వస్తుందికదా! అలాగే వచ్చింది కూడానూ! ఈ సినిమా విజయవంతం అవటంతో నిర్మాత మైకేల్‌ టాడ్‌ సతీమణి, మంచి నటీమణి అయిన ఎలిజబెత్‌ టేలర్‌ కూడా చాలా సంతోషపడ్డారు. కానీ, ఈ సంతోషం చాలా కొద్దికాలమే నిలిచింది. సినిమా విడుదలైన కొన్నాళ్లకే, ఒక విమానప్రమాదంలో మైకేల్‌ టాడ్‌ కన్నుమూశారు. ఎలిజబెత్‌ టేలర్, ఆ తర్వాత, ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి రెండు పాటలు పాడిన ఎడ్డీ ఫిషర్‌ను పెళ్లాడారు. అయితే, ఒక్క విషయం- ఆమె ఈ ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి సంబంధించిన ప్రిప్రొడక్షన్‌ రీళ్లు, రఫ్‌కట్‌ వర్క్‌ ప్రింట్స్, టెస్ట్‌ షాట్స్, కలర్‌ సెపరేషన్స్, బిహైండ్‌ ది సీన్‌ షాట్స్‌ వంటి విలువైన సంపదను జ్యూల్స్‌ వెర్న్‌ మ్యూజియమ్‌కు మైకేల్‌ టాడ్‌ జ్ఞాపకార్థం విరాళంగా అందజేశారు.

ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌
‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి ఆస్కార్‌ పోటీల్లో 8 నామినేషన్‌లు దక్కాయి. కానీ, చివరికి దక్కినవి మాత్రం ఉత్తమ చిత్రంతో సహా మొత్తం 5 ఆస్కార్‌లే! ఈ చిత్రంలో సంగీతం (విక్టర్‌ యంగ్‌), ఛాయాగ్రహణం (లియోనిల్‌ లిండన్‌), కళాదర్శకత్వం (జేమ్స్‌ సల్లివన్‌)లు కూడా చాలా బాగుంటాయి. ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ కథకూ, 1956నాటి చిత్రానికీ ఉన్న పేరును ఉపయోగించుకోవాలనీ, లభిస్తున్న కొత్త టెక్నాలజీని చక్కగా వినియోగించుకోవాలనీ ఆశిస్తూ, మళ్లీ ఇదే చిత్రాన్ని 2008లో జాకీ ఛాన్, స్టీవ్‌ కూగన్, జిమ్‌ బ్రాడ్‌బెంట్, కేథీ బేట్స్, ఆర్నాల్డ్‌ ష్వారర్జెనెగ్గర్‌లతో అదే పేరుతో ఓ చిత్రాన్ని తీశారు. అయితే, ఈ కొత్త చిత్రం, 1956నాటి ‘ఎరౌండ్‌ ది వర్‌ల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’ చిత్రానికి ఎక్కడా సరిపోలలేదని ప్రేక్షకులు తీర్మానించేశారు!


- డా. పాలకోడేటి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.