జేమ్స్‌ క్యామెరాన్‌ ఇంద్రజాలం : ‘అవతార్‌’
‘అవతార్‌’ - దర్శకుడు జేమ్స్‌ క్యామెరాన్‌ అద్భుత చిత్రం
రచన, సహ కూర్పు, దర్శత్వం: జేమ్స్‌ క్యామెరాన్‌
నిర్మాత : జేమ్స్‌ క్యామెరాన్, జోన్‌ లాండో
అంతర్జాతీయంగా విడుదల: 18 డిసెంబర్‌ 2009
నిడివి: 161 నిమిషాలు
తారాగణం: శామ్‌ వర్తింగ్‌టన్, జో సల్దానా, స్టీఫెన్‌ ల్యాంగ్, మిషెల్‌ రోడ్రిగ్వెజ్, సిగౌర్నీ వీవర్‌ తదితరులు


విష్యత్తును లీలామాత్రంగానైనా సందర్శించగలగటం విశేషమే! అందులోనూ ఒక ఊహావిశ్వంలో విహరించటం మరీనూ! అలాంటి భవిద్దార్శనికుడు జేమ్స్‌ క్యామెరాన్‌. హాలీవుడ్‌లో సుప్రసిద్ధుడైన ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవతార్‌’ 2009లో డిసెంబర్‌ 18న విడుదలై, బాక్సాఫీసు వద్ద అనూహ్య సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తమైన ప్రేక్షకుల ఆదరణను పొంది, నిర్మాణసంస్థకు కాసుల గలగలలను వినిపించింది. జేమ్స్‌ క్యామెరాన్‌ పేరును అంతర్జాతీయ చలన చిత్ర చరిత్రలో సుస్థిరం చేసింది. 23 కోట్ల 70 లక్షల డాలర్‌ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం, మొదటి విడుదల సమయంలో 278 కోట్ల 80 లక్షల డాలర్‌లనూ, రెండో విడుదల సమయంలో మరో 90 లక్షల డాలర్‌లనూ ఆర్జించిపెట్టింది. అంతక్రితం ఆయనే 1998లో తీసిన ‘టైటానిక్‌’ చిత్రం చేరుకున్న రికార్డులను బద్దలు కొట్టింది. మొట్టమొదటిసారిగా 200 కోట్ల డాలర్‌ల వసూళ్లను సాధించిన చిత్రంగా కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకుందంటే, చిత్రంలో ఏదో కొత్తదనం ఉండితీరాలి కదా అంటే, ‘అవతార్‌’ చిత్రంలో అంతా కొత్తగానే కనిపిస్తుంది.


‘అవతార్‌’ చిత్రం కథ కొత్తది. ఆ కథను తెరకెక్కించిన తీరు కొత్తది. కథలో కనిపించిన దృశ్యాలూ కొత్తవే! ఇవి కాకుండా, సాంకేతికంగా కూడా, ‘అవతార్‌’ చిత్రం చలన చిత్ర రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు తావు కల్పించింది. ఇప్పుడు విశ్వవ్యాప్తమైన ‘మోషన్‌ కాప్చర్‌’ ఫిల్మింగ్‌ టెక్నిక్‌ను విస్తృతంగా వినియోగించి కొత్త సాంకేతికకు శ్రీకారం చుట్టింది. ఒక చిత్రాన్ని వేర్వేరు ప్రదేశాలలో ఒకేసారి వేర్వేరు పద్ధతులలో వీక్షించే విధానాన్నీ తీసుకొచ్చింది. కొన్ని థియేటర్‌లలో సాధారణ సంప్రదాయ పద్ధతిలో కొందరు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తే, మరికొన్ని థియేటర్లలో 3డి ఫార్మాట్‌లో, మరికొన్నిచోట్ల రియల్‌ 3డిలో, ఇంకొన్ని చోట్ల డాల్బీ 3డిలో, లేదా ఎక్స్‌పాన్‌ 3డి, ఐమాక్స్‌ 3డిలాంటి వివిధ పద్ధతులలో, ఆయా థియేటర్‌లలో లభించే సదుపాయాలనుబట్టి, వీక్షించే అవకాశం ప్రేక్షకులకు కల్పించింది. కొన్ని దక్షిణ కొరియా దేశ నగరాలలో అయితే, 4డి టెక్నాలజీతోనూ ప్రేక్షకులు ‘అవతార్‌’ చిత్రాన్ని చూశారు. అపూర్వమైన వీక్షణానందాన్నీ, అనుభూతినీ మూటగట్టుకున్నారు. సినిమాటిక్‌ టెక్నాలజీలో స్టీరియోఫోనిక్‌ ఫిల్మ్‌మేకింగ్‌ను పరిశ్రమకు అందించిన సినిమాగా ‘అవతార్‌’ శాశ్వత కీర్తిని ఆర్జించుకుంది. 


కథ సంక్షిప్తంగా...
అది 2154వ సంవత్సరం. మనుషులు తమ విచ్చలవిడితనానికి గుర్తుగా అన్నట్లు, భూలోకంలోని సహజవనరులన్నింటినీ అతి వినియోగంతో ఖాళీ చేసేశారు. కొత్త ఖనిజాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి మానవాళికి తప్పనిసరి అవుతుంది. ఆ పరిస్థితులలో, ఆల్ఫాసెంటౌరీ నక్షత్రమండలానికి అనుబంధంగా ఉన్న ‘పండోరా’ అనే చంద్రుడిమీద ‘అన్‌-అబ్టేనియమ్‌’ అనే ఖనిజం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ చందమామ మీద అక్కడికే ప్రత్యేకమైన ‘నావి’ అనే ఒక రకమైన ‘హ్యూమనాయిడ్స్‌’ కూడా నివసిస్తున్నారనీ తెలుస్తుంది. ఈ ‘మానవుల్లాంటి’ వారు దాదాపు 10 అడుగుల ఎత్తుతో, నీలిరంగు చర్మంతో, రెండు కళ్లు, రెండు చేతులు, ఒక ముక్కు, ఒక నోరులతోబాటుగా మానవులు గుర్తించగల భావాలను కలిగి ఉంటారు. వీరికి నేరుగా మెదడుకు కనెక్ట్‌ అయి ఉండే ఒక పొడవైన తోక కూడా ఉంటుంది. వీరు ఆ చంద్రుడి మీది ప్రకృతితో అద్భుతమైన సహజీవనం చేస్తుంటారు. వారికి ‘ఐవా’ అనే ఒక దేవతా మాత కూడా ఉంటుంది. ఆ చంద్రుడి మీది జీవావరణాన్ని పరిశోధించి, ‘అన్‌-అబ్టేనియమ్‌’ ఖనిజాన్ని పొందాలని భూమి మీది (అంటే, అమెరికా దేశ) శాస్త్రజ్ఞులు ఆలోచిస్తారు. దాని కోసం, భూమి మీది మానవులచేత కొత్త ‘అవతారం’ ఎత్తించి, అక్కడికి పంపాలని నిర్ణయించుకుంటారు. చనిపోయిన తన కవలసోదరుడి ‘అవతారం’లో పండోరా చంద్రుడి మీదకు వెళ్లేందుకు జేక్‌ సల్లీ అనే అమెరికన్‌ సైనికుడు సిద్ధపడతాడు. ఇతనొక వికలాంగుడు. యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నాడు. అతనికి రక్షగా డాక్టర్‌ గ్రేస్‌ ఆగస్టిన్‌కూడా పండోరా మీదకు చేరుతుంది. ఈ సమయంలో జేక్‌ అవతార్‌ను ఒక ‘థానేటర్‌’ ఎదుర్కొని, దాడి చేస్తుంది. అప్పుడు జేక్‌ను, ‘నైటిరి’ అనే పండోరాకు చెందిన యువతి రక్షించి, పండోరామీద తమ ఆధ్యాత్మ గురువుగా ఉన్న తమ తల్లి మోట్‌ దగ్గరకు తీసుకెళ్తుంది. భూమి మీద శాస్త్రజ్ఞుల బృందానికి ప్రైవేట్‌ రక్షకుల కల్నల్‌ అయిన మైల్స్‌ క్వారిట్చ్, జేక్‌ గనుక నావి తెగవారి సమాచారాన్నీ, వారు అక్కడ కలుసుకునే రచ్చబండదగ్గర ఉన్న పెద్ద ‘హోమ్‌ట్రీ’ రహస్యాలను తేగలిగితే, జేక్‌కు పోయిన కాళ్లను తిరిగి తెప్పించగల విధంగా తమ సంస్థ ప్రయత్నిస్తుందని చెప్తాడు. ఈ ‘హోమ్‌ట్రీ’ దిగువనే ‘అన్‌-అబ్టేనియమ్‌’ ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని గ్రేస్‌ గుర్తిస్తుంది. నైటిరి కారణంగా జేక్‌కు పండోరామీది తెగలంటే ఇష్టం ఏర్పడుతుంది. ఫలితంగా వారు కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తూ, అతడిని, తమ తెగలోకి చేర్చుకుంటారు. నైటిరి, జేక్‌లు పరస్పరం ఒకరికి ఒకరు దగ్గర అవుతారు. నావి తెగవారి ఒక పవిత్ర స్థలాన్ని కూల్చేందుకు వచ్చిన ఒక బుల్‌డోజర్‌ను జేక్‌ అడ్డుకుంటాడు. దానితో, అతను మారిపోయాడని, అతను ఇప్పుడు నావి వారి మనిషిగా మారిపోయాడనీ గ్రేస్‌ గుర్తిస్తుంది. ఇలా జేక్, బుల్‌డోజర్‌ను అడ్డుకున్న వీడియోను చూసిన ఎడ్మినిస్ట్రేటర్‌ పార్కర్‌ సెల్ఫ్‌రిడ్జ్, ఏకంగా ‘హోమ్‌ట్రీ’ని కూల్చేయాలని ఆజ్ఞలు ఇస్తాడు. హోమ్‌ట్రీని కూల్చేముందు, నావి వారికి నచ్చచెప్పేందుకు గ్రేస్, జేక్‌లకు సెల్ఫ్‌రిడ్జ్‌ ఒక గంట సమయం ఇస్తాడు. నావి వారితో ఈ విషయం చర్చించే సమయంలో, జేక్, తానెవరో నావి వారికి చెన్తాడు. దానితో, నావి వారు, జేక్‌తోబాటుగా గ్రేస్‌ను కూడా తమ బందీలుగా చేసుకుంటారు. ఇది చూసిన క్వారిట్చ్, హోమ్‌ట్రీని నాశనం చేస్తాడు. ఈ ఘర్షణలో నైటిరి తండ్రితోబాటు చాలామంది చనిపోతారు. దాంతో, నైటిరి తల్లి మోట్, జేక్‌ను, గ్రేస్‌నూ విడిచి పెడుతుంది. కానీ, వారి అవతారాలను తొలగించి, క్వారిట్చ్‌ మనుషులు వారిని బందీలు చేస్తారు. క్వారిట్చ్‌ దురాగతాలు భరించలేని పైలట్‌ ట్రూడీ ఛకోన్, జేక్, గ్రేస్‌లను విడిపించి, వారిని అవుట్‌పోస్ట్‌ దగ్గర విడిచిపెడతాడు. తాను మళ్లీ నావి వారి విశ్వాసం పొందటానికి, జేక్, నావి వారు ఆరాధించే ‘తోరక్‌’ అనే పెద్ద జంతువుతో తన మనోశక్తితో అనుసంధానం అవుతాడు. ఎలాగైనా గ్రేస్‌ను రక్షించుకోవాలని జేక్‌ యత్నిస్తాడు కానీ, ఆమె మరణిస్తుంది. ‘ట్రీ ఆఫ్‌ సోల్స్‌’ వద్దకు నావి వారు అందర్నీ సమావేశం కావాలని కోరతాడు. అందరూ అక్కడ చేరుతున్నారని తెలిసిన క్వారిట్జ్, ఆ ‘ట్రీ ఆఫ్‌ సోల్స్‌’పై దాడి చేయిస్తాడు. తరుత జరిగిన యుద్ధంలో, నావి వారు చాలా నష్టపోతారు. ఈ సమయంలోనే పండోరాకు చెందిన అటవీ, జంతు సంపదలన్నీ ఏకమై, మానవ బలాల మీదకు విరుచుకుపడతాయి. ఇదంతా జేక్‌ ప్రార్థనల వల్ల కరిగిపోయిన తమ దేవత ‘ఐవా’ కరుణ అని నావి వారు భావిస్తారు. జేక్‌ను చంపాలని భావించిన క్వారిట్చ్, జేక్‌ అవతార్‌కు ఉన్న మెడను కొయ్యాలని ప్రయత్నిస్తాడు. కానీ, నైటిరి అడ్డుపడి, క్వారిట్చ్‌ను హతమార్చి, జేక్‌ను కాపాడుకుంటుంది. జేక్‌తో సహా కొందరిని మాత్రం పండోరామీద ఉండనిచ్చి, మిగతా మానవ అవతారాలను బహిష్కరిస్తారు. ‘ట్రీ ఆఫ్‌ సోల్స్‌’ సహాయంతో జేక్‌ పూర్తిగా తన అవతారంతో పండోరా మీదకు చేరిపోతాడు.

‘పూర్వావతార’ కథ!
అసలు, జేమ్స్‌ క్యామెరాన్, ఈ కథను 1994లోనే దాదాపు 80 పేజీల ‘సినిమా ట్రీట్‌మెంట్‌’గా రాసుకుని సిద్ధం చేసుకున్నారు. ‘టైటానిక్‌’ చిత్రం పూర్తి కాగానే, ఈ కథతో ఒక చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టాలని ఆయన అనుకున్నారు. కానీ, కథలోని పాత్రలు, సన్నివేశాలు చూడగానే, వాటి రూపకల్పనకు తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదన్న విషయం ఆయనకు బోధపడింది. ఫలితంగా, తగిన సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పన జరగటానికి వేచి చూస్తూ, కథకు మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. 2006లో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ, ‘ప్యండోరా’ చంద్రుడిమీద నివసించే తెగలకు సంబంధించిన సంస్కృతి వివరాలను తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో అక్కడ నావి తెగవారికి ఒక ప్రత్యేకమైన భాష ఉండాలని భావించి, ఆ భాషను రూపుదిద్దేపనిలో పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన భాషాశాస్రజ్ఞుడైన ప్రొఫెసర్‌ పాల్‌ ఫ్రోమర్, ఈ భాషకు రూపకల్పన చేశారు. ఈ కొత్త ‘భాష’కు దాదాపు వెయ్యి పదాలను సిద్ధం చేశారు. వీటికి మరో 30 పదాలను జేమ్స్‌ క్యామెరాన్‌ జతకలిపారు. ఈ కొత్త భాష, ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలోని అమ్హారిక్‌ భాషకు దరిదాపుల్లో ఉంటుంది. కొత్త భాషాపదాలలో మొదట వచ్చే ‘ంగ్‌’ అనే మాటను క్యామెరాన్, న్యూజిలాండ్‌లోని మవోరీ తెగల భాషనుంచి స్వీకరించారు. వీటితో బాటుగా, కాలిఫోర్నియా రాష్ట్రంలోని రివర్‌సైడ్‌ దగ్గర గల యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలోని బోటనీ (వృక్ష) శాస్త్రజ్ఞుల సహకారంతో, ‘పండోరా’ చంద్రుడిపైన జీవించ వీలుండే వృక్ష, జంతుజాలాల వివరాలను సిద్ధం చేసుకున్నారు. ఇలా ప్రాథమికంగా అన్నీ సిద్ధమైనాక, జేమ్స్‌ క్యామెరాన్, 2007లో తగిన విజ్యువల్‌ ఎఫెక్ట్‌ల రూపకల్పనకు ‘వెటా స్టూడియో’ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈలోగా, మొదటి నుంచీ చిత్రనిర్మాణం విషయంలో తటపటాయిస్తూ వచ్చిన ఫాక్స్‌ స్టూడియోవారు, నిర్మాణంనుంచి తప్పుకుంటూ చేతులు ఎత్తేస్తారని అనిపించగానే, జేమ్స్‌ క్యామెరాన్‌ వేరే ప్రయత్నాలు ఆరంభించారు. అప్పటికి జ్ఞానోదయం అయిన ఫాక్స్‌ స్టూడియోవారు, తిరిగి చిత్రనిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మొత్తం బడ్జెట్‌లో కొంత భాగాన్ని ఇన్‌జీనియస్‌ మీడియావారు పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. మొత్తానికి సినిమాకు బడ్జెట్‌ దాదాపు 28 కోట్ల నుంచి 31 కోట్ల డాలర్‌లు అవుతుందనీ, (అంటే, సుమారుగా 1960 కోట్ల రూపాయలు), అదనంగా మరో 15 కోట్ల డాలర్‌లు ప్రమోషన్‌కు ఖర్చుపెట్టాల్సి ఉంటుందనీ అంచనాలు సిద్ధం అయ్యాయి.


‘అవతార’ క్రమం ఇదీ!
‘అవతార్‌’ చిత్రం షూటింగ్‌ 2007 ఏప్రిల్‌లో ఆరంభం అయింది. ఫుల్‌ యాక్షన్‌ షూట్‌తోబాటు, కంప్యూటర్‌- జెనరేటెడ్‌ కారెక్టర్‌ల కాంబినేషన్‌గా చిత్రం ఉంటుందని జేమ్స్‌ క్యామెరాన్‌ అనేవారు. లైవ్‌యాక్షన్‌ అంతా డిజిటల్‌ 3డి ఫ్యూజన్‌ కెమెరా సిస్టమ్‌తో, సెకన్‌కు 24 ఫ్రేములతోనే తీస్తున్నామని ఫాక్స్‌వారు ప్రకటించారు. అయితే, దీన్ని మరింత అధికమైన ఫ్రేమ్‌రేట్‌తో తీయాలని జేమ్స్‌ క్యామెరాన్‌ భావించినా, దాన్ని ఫాక్స్‌వారు కాదనేశారు. అప్పట్లో క్యామెరాన్‌ చెప్పినదాన్నిబట్టి, ఈ చిత్రంలో 60 శాతం కంప్యూటర్‌-జెనరేటెడ్‌ ఎలిమెంట్స్, మిగిలిన 40 శాతం లైవ్‌యాక్షన్‌తోబాటు మీనియేచర్‌లూ ఉంటాయని స్పష్టం అయింది.

మీనియేచర్‌ కాప్చర్‌ ఫొటోగ్రఫీ అంతా, లాస్‌ ఏంజెల్స్‌లోని ప్లాయా విస్టా దగ్గర హ్యూస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టేజ్‌ వద్ద 31 రోజుల్లో పూర్తయింది. దీనికోసం, జేమ్స్‌ క్యామెరాన్‌ తన వర్చువల్‌ కెమెరా సిస్టమ్‌ను వాడారు. ఈ పద్ధతిలో ఎప్పటికప్పుడు, ఆయా యాక్టర్ల వర్చువల్‌ కౌంటర్‌పార్ట్‌లను వారు చూసుకునే వీలు కలిగించారు. దానివల్ల షూటింగ్‌ సమయాల్లో తగిన మార్పులను అప్పటికప్పుడు చేసుకునే వీలూ ఉంటుంది. ‘పండోరా’ చంద్రుడిమీది అడవిని చిత్రీకరించేందుకు పెద్ద లైటింగ్‌ సిస్టమ్‌ను వాడారు. నటీనటులు తమ మాటలు మాట్లాడేటప్పుడు, వారి ముఖకవళికలను చిత్రీకరించేందుకు అతిపెద్ద ‘పెర్‌ఫార్మెన్స్‌ కాప్చర్‌’ సిస్టమ్‌నూ వాడారు. దీనికి అదనంగా, నటీనటులు తమ ఫేస్‌ కాప్చరింగ్‌ కోసం వారి ముఖాలముందు చిన్న కెమెరాలను పెట్టిన స్కల్‌ క్యాప్స్‌ ధరించారు. దీనివల్ల, నటీనటుల ముఖకవళిలకలన్నింటినీ వారి డిజిటల్‌ కౌంటర్‌పార్ట్స్‌కు అందించటం తేలిక అయింది. అలాగే, ఈ పద్ధతులు అన్నింటి ద్వారానూ ఇటు న్యూజీలాండ్‌లో సేకరిస్తున్న మొత్తం డేటాను భూగ్రహంలో అటువైపున్న అమెరికాకు అందించేందుకు ప్రత్యేకంగా ‘గియా’ అనే ఒక కొత్త క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను కేవలం ‘అవతార్‌’ చిత్రంకోసమే, మైక్రోసాఫ్ట్‌ వారు రూపొందించారు. ‘అవతార్‌’ విజ్యువల్స్‌ను రెండర్‌ చేయటానికి 10వేల చదరపు అడుగుల ప్లాట్‌ఫార్మ్‌ను వెటా కంపెనీవారు సిద్ధం చేశారు. దీంట్లో, ఒక్కొక్కటీ 35వేల ప్రాసెసర్‌లతో ఉండే 104 టెరాబైట్‌ల ర్యామ్‌గల మొత్తం 4 వేల హ్యూలెట్‌-ప్యాకార్డ్‌ సెర్వర్లను పెట్టారు. చిత్రంలో ప్రతీ ఒక్క నిమిషం ఫుటేజ్‌ దాచటానికి 17.28 గీగాబైట్‌ల స్టోరేజ్‌ కావాల్సివచ్చింది. ఒక్క ఫ్రేమ్‌ను రెండర్‌ చెయ్యటానికి ఒక్కోసారి వారికి కొన్ని గంటల సమయం పట్టేది! ఇలా ‘అవతార్‌’ కోసం ఏది చేసినా, ఏది చూసినా, జెయింట్‌ సైజ్‌లోనే ఉందనేది విశేషం!!లైవ్‌ యాక్షన్‌ షూటింగ్‌ అంతా న్యూజీలాండ్‌ రాజధాని వెల్లింగ్‌టన్‌లోని స్టోన్‌ స్ట్రీట్‌ స్టూడియోస్‌లో జరిగింది. షూటింగ్‌ సమయాల్లోనే తన చిత్రీకరణ విధానాన్నీ, తను వాడుతున్న కొత్త టెక్నాలజీని జేమ్స్‌ క్యామెరాన్, హాలీవుడ్‌లో హేమాహేమీలయిన స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్, జార్జ్‌ లూకాస్‌ వంటి పెద్దపెద్ద దర్శకులకూ చూపించారు. సినిమాలో అవసరాన్నిబట్టి, తారలంతా, ఆర్చెరీ, హార్స్‌బ్యాక్‌ రైడింగ్, ఫైర్‌ఆర్మ్‌ యూజ్, హ్యాండ్‌-టు- హ్యాండ్‌ కాంబాట్‌వంటి కళలన్నీ నేర్చుకున్నారు. సినిమాకోసం తయారుచేసిన ‘నావి’ భాషను నేర్చుకున్నారు. షూటింగ్‌ సమయంలో, జేమ్స్‌ క్యామెరాన్‌ తనకున్న విశ్వాసాల ఆధారంగా తారలు, క్రూ మెంబర్‌లకూ కేవలం వృక్షసంబంధమైన ‘వీగన్‌’ ఆహారాలనే సరఫరా చేయించారు.

‘అవతార్‌’ మెత్తిన అనేక పాత్రలు
‘అవతార్‌’ చిత్రంలో పాత్రలు చిత్రంగా ఉంటాయి. అందులో కొన్ని భూమిమీద ఉండేవి. మరికొన్ని కాల్పనిక విశ్వంలోని ‘పండోరా’ చంద్రుడిమీద నివాసం ఉండేవి. భూమిమీద పాత్రల రూపురేఖావిలాసాలు వేరు, ‘పండోరా’ మీద నివసించిఉండే పాత్రలు వేరు. వాటి రూపురేఖలు వేరు. భూమిమీద పాత్రలైన ‘జేక్‌’గా శామ్‌ వర్తింగ్‌టన్, కల్నల్‌ మైల్స్‌ క్వారిట్చ్‌గా స్టీఫెన్‌ లాంగ్, డాక్టర్‌ గ్రేస్‌ ఆగస్టీన్‌గా సిగౌర్నీ వీవర్, ట్రూడీ ఛాకోన్‌గా మిషెల్‌ రోడ్రిగ్వెజ్, పార్కర్‌ సెల్ఫ్‌రిడ్జ్‌గా జియోవాన్నీ రిబిసీలు నటించారు. ఈ చిత్రంలో డాక్టర్‌ మాక్స్‌ పటేల్‌గా దిలీప్‌ రావ్‌ నటించారు. ఈయన అమెరికన్‌ భారతీయ సంతతికి చెందినవారు. ‘అవతార్‌’ విడుదలైన 2009లోనే ఆయన ‘డ్రాగ్‌ మీ టు హెల్‌’ అనే చిత్రంలోనూ నటించారు. ఇక, ‘పండోరా’ చంద్రుడిమీద పాత్రలు వేరు. వీటిలో ముఖ్యమైనది నైటిరి. ఈ పాత్రను జో సల్దానా పోషించారు. ఈ పాత్రను - ‘అవతార్‌’లోని ఇతర నావి పాత్రలకు మల్లే పెర్‌ఫార్మెన్స్‌ కాప్చర్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ఈ పాత్రకు సంబంధించిన విజ్యువల్‌ యాస్పెక్ట్ప్‌ అన్నీ కంప్యూటర్‌ జెనెరేటెడ్‌ అనేది విశేషం.


స్ఫూర్తినిచ్చిన మన పురాణాలు:
‘నేను చూసిన, చదివిన అనేక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు, పుస్తకాల స్ఫూర్తితోనే రూపొందించాను. వీటిలో ‘టార్జాన్‌’, ‘అట్‌ ఫీల్డ్‌ ఇన్‌ ది ఫీల్డ్స్‌ ఆఫ్‌ ది లార్డ్‌’, ‘ది ఎమరాల్డ్‌ ఫారెస్ట్‌’, ‘ప్రిన్సెస్‌ మోనోనోక్‌’, ‘డాన్సెస్‌ విత్‌ వుల్వ్స్‌’ వంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి’ అంటారు జేమ్స్‌ క్యామెరాన్‌. చిత్రంగా, ఈ కథలోని ఒక భాగం అచ్చం మన తెలుగు చిత్రం ‘ప్రాణమిత్రులు’ కథలోని భాగానికి సరిపోతుంది. తనను వ్యతిరేకిస్తున్న కార్మికుల సంఘాన్ని విడగొట్టేందుకు ఆ కార్మికులలోకి తన నౌకరును పంపుతాడు చినబాబు. ఆ కార్మికుల పరిస్థితులను చూసిన నౌకరు క్రమంగా వారివైపునకు మారిపోతాడు. ఈ ‘ప్రాణమిత్రులు’ చిత్రంలో చినబాబుగా జగ్గయ్య, నౌకరుగా అక్కినేని నటించారు. పద్మశ్రీవారు నిర్మించిన ఈ చిత్రానికి కథను ముళ్లపూడి వెంకటరమణ రాశారు. పి. పుల్లయ్య దర్శకుడు. అన్నట్లు హిందీలో హృషీకేశ్‌ ముఖర్జీ తీసిన ‘నమక్‌ హరామ్‌’ చిత్రకథా ఇదే!! ఈ ‘అవతార్‌’ హాలివుడ్‌ చిత్రంలోనూ అంతే! ‘పండోరా’ చంద్రుడి దగ్గరకు వెళ్లిన జేక్, అక్కడివారితో కలిసిపోవటం ఇదే కథ కదా! ఇదొకటే కాదు, ఈ చిత్రానికి పేరుకూడా తాను హిందువుల పురాణాలలోని అవతారాలనుంచే గ్రహించాననీ జేమ్స్‌ క్యామెరాన్‌ చెప్పారు. ఇక, ‘నావి చంద్రుడిమీద పాత్రల రూపాలకు మా అమ్మకు వచ్చిన కల ఆధారం. ఆమెకు ఆ కలలో ఎందరో నీలివర్ణ శరీరాలతో ఉన్నవారు కనిపించారు. ఈ ‘శ్యామవర్ణ’ చర్మధారులు తెరమీదకూడా అందంగా కనిపిస్తారనే నేను ఆ పాత్రలకు ఆ రూపమే ఉంచాను’ అని చెప్పారు జేమ్స్‌ క్యామెరాన్‌. కేవలం చర్మవర్ణమే కాదు, మన పురాణాలలోని అవతారాలకు మల్లే, ఈ చిత్రంలోని పాత్రలూ ‘అవతారా’లే ఎత్తుతాయి. వైకుంఠంలోని శ్రీమహావిష్ణువు, భూమి మీదకు వివిధ అవతారాలలో వచ్చాడు. ఈ చిత్రంలో భూమిమీది మనుషులు, ‘అవతార్‌’లు ఎత్తి, ‘పండోరా’కు వెళతారు. అంటే, చిత్రం టైటిల్‌నుంచీ, జేమ్స్‌ క్యామెరాన్‌ చాలావరకూ మన వాటినుంచే స్ఫూర్తి పొందారన్నమాట!! ‘అందుకే ఆ చిత్రానికి అంత ఘనత’ అనికూడా మనం అనుకోవచ్చు!! ఏమైనా, ‘అవతార్‌’ చిత్రం ఒక గొప్ప సంచలనం. అద్భుత విజయాల జేమ్స్‌ క్యామెరాన్‌ జీవితంలో మరో మహాద్భుత విజయం!! ఆర్థికంగానూ అనూహ్య విజయం పొందిన ఈ చిత్రానికి సీక్వెల్స్‌ వస్తున్నాయి. ‘అవతార్‌ 2’ చిత్రం 2020 డిసెంబర్‌ 18న, ‘అవతార్‌ 3’ చిత్రం 2021 డిసెంబర్‌ 17న విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ‘అవతార్‌ 4’ కూడా వప్తుంది కానీ, ఆ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రాలు చాలావాటిలో ‘అవతార్‌’ మొదటి చిత్రంలో నటించినవారే ఉంటారని తెలుస్తోంది.

సాహోరే బాహుబలి!
కొసమెరుపు : మన దేశంలో సూపర్‌హిట్‌ అయిన ‘బాహుబలి’ చిత్రంలో కాలకేయులు మాట్లాడేందుకు ఒక కొత్త భాష రూపొందించామని ఆ చిత్రనిర్మాత, దర్శకులు చెప్పుకున్నారు. ఈ ‘అవతార్‌’ చిత్రం గురించి రాస్తున్న ఈ సందర్భంగా ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానో మీకు అర్థమయిందా? ఆలోచించండి మరి!!

- డా. పాలకోడేటి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.