నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ తీసిన ఆఖరి నిశ్శబ్ద చిత్రం...పారిశ్రామిక విప్లవంపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం...ఫ్యాక్టరీ కార్మికుల కష్టాల నేపథ్యంలో చిందిన హాస్యం...అదే ‘మోడర్న్ టైమ్స్’ (1936) సినిమా!చార్లీ చాప్లిన్ రచించి, స్వీయ దర్శకత్వంలో అద్భుతంగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ అలరిస్తుంది.

ప్రపంచంలోని అన్ని సమస్యలకూ పారిశ్రామిక విప్లవమే పరిష్కారమని భావించే పెట్టుబడిదారుల వాదనకు ఈ సినిమా వ్యంగ్యాత్మక సమాధానం. ఓ పక్క టాకీలు విజృంభిస్తున్నా చాప్లిన్‌కు ఎందుకో నిశ్శబ్ద చిత్రాలంటేనే మక్కువ. కానీ మాట్లాడే సినిమా ప్రభావానికి చాప్లిన్ కూడా తన పంధాను మార్చుకోక తప్పలేదు. ‘మోడర్న్ టైమ్స్’ సినిమా కూడా మాటలు లేని సినిమానే అయినా సౌండ్ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా వాడాడు చాప్లిన్. ఆర్థిక మాంద్యం దేశదేశాల్లో ప్రభావం చూపిస్తున్న కాలంలో ఓ ఫ్యాక్టరీలోని సగటు కార్మికుడి పరిస్థితికి అద్దం పడుతూ చాప్లిన్ నవ్వులు పండించాడు. ఆధునికతను అర్థం చేసుకోలేని కార్మికుడిగా రకరకాల ఉద్యోగాలు మారుతూ చేరిన ప్రతిచోట హాస్యం చిందిస్తాడు.
* చాప్లిన్ తీసిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచంలోని మేటి హాస్య చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
* ప్రతి వ్యక్తి మరణించేలోపు చూసి తీరాల్సిన ‘1001’ సినిమాల జాబితాలో ఇది కూడా ఉంది.
* సినిమాలో ఆటోమేటిక్ ఫీడింగ్ మెషిన్ యంత్రాన్ని పరీక్షించడానికి చాప్లిన్‌ను ఎంచుకున్నప్పుడు అది విఫలమయ్యే సన్నివేశం చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. దీని చిత్రీకరణకు ఏడు రోజులు పట్టింది.
* ఓ డిపార్ట్మెంట్ స్టోర్ నాలుగో అంతస్తులో చాప్లిన్ కళ్లకు గంతలు కట్టుకుని రోలర్‌స్కేటింగ్ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం చాప్లిన్ 8 రోజులు ప్రాక్టీస్ చేసి మరీ ఆ దృశ్యాలను పండించాడు.