* రాకాసి కథలకు శ్రీకారం
ఓ భీకర రాకాసి ఆకారం... ఎక్కడో ఉన్న దాన్ని బంధించి నగరానికి తీసుకురావడం... దాన్ని చూడ్డానికి టికెట్టు పెట్టడం... అదక్కడ నుంచి తప్పించుకుని బీభత్సం సృష్టించడం... దాన్ని కాళ్ల కింద పడి కార్లు సైతం పప్పు పప్పు అయిపోవడం... ఇల్లు, మేడలు పడిపోవడం... జనాలు కెవ్వున అరుస్తూ పరుగులు పెట్టడం... ఈలోగా ఆ భీకర ఆకారం పెద్ద పెద్ద టవర్లు, భవనాలు ఎక్కేయడం... దాన్ని చంపడానికి తుపాకులు, ఫిరంగులు, విమానాలతో నానా హంగామా పడడం...

- ఇంచుమించు ఈ అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. ఆ భీకర రాకాసి ఆకారం గాడ్జిలా కావచ్చు, కింగ్‌కాంగ్ కావచ్చు, డైనోసార్ కావచ్చు, గొరిల్లా కావచ్చు, డ్రాగన్ కావచ్చు, యతి కావచ్చు, ఇంకేదో సముద్ర జీవి కావచ్చు... ఏమైనా ఈ కథాంశం అనేక సినిమాలుగా రూపు దిద్దుకుని ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రేక్షకుల చేతిలో ఉన్న పాప్‌కార్న్ ఒలికిపోయేంతగా భయపెట్టి... కాసులు కురిపించాయి. భయం, ఉత్కంఠతో పాటు ఓ అందమైన అమ్మాయిని చూసి, ఇంతటి భీకర ఆకారం కూడా ఏదో తెలియని ప్రేమలో పడిపోవడం అదనపు ఆకర్షణ. వీటిని ‘మాన్స్టర్’ సినిమాలని పిలుస్తారు. ఇలాంటి సినిమాలకు హాలీవుడ్లో శ్రీకారం చుట్టిన సినిమాగా ‘కింగ్‌కాంగ్’ (1933)ను చెప్పుకోవచ్చు. అంతకు ముందు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగి ఉన్నా, పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో భారీ విజయం సాధించడం దీనితోనే మొదలనుకోవచ్చు. ఎప్పుడు విడుదల చేసినా కాసుల పంట పండించిన ఇది, ‘వందేళ్లు... వంద మేటి సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించింది. దీనికి సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ కాంగ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ తర్వాత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో సినిమాలు ప్రపంచ భాషల్లో రూపుదిద్దుకున్నాయి.
ఇదీ కథ: న్యూయార్క్‌లో ఓ చిత్ర బృందం అరుదైన దృశ్యాల కోసం ఎవరికీ తెలియని ఓ దీవికి వెళతారు. ఆ దీవిలోని అడవుల్లో గొరిల్లా అనే ఓ భీకర ఆకారం ఉంటుంది. ఆ గొరిల్లా దండెత్తకుండా ఉండడం కోసం అక్కడి ఆటవికులు తరచు ఓ అమ్మాయిని అడవిలో మంచెపై కట్టేస్తుంటారు. ఆ గొరిల్లా ఆ అమ్మాయిని తీసుకుపోతూ ఉంటుంది. ఈ సారి ఆ సమయానికి ఆ ఆటవికులకు, ఆ దీవికి వచ్చిన చిత్రబృందంలో హీరోయిన్ కనిపిస్తుంది. ఆమెను ఎత్తుకుపోయి ఆ గొరిల్లా కోసం కట్టేస్తారు. గొరిల్లా ఆమెను గుప్పెట్లో పట్టుకుని ఎత్తుకుపోతుంది. కానీ హీరోయిన్ అందంగా ఉంటుంది కదా? ఆమె అందాన్ని చూసి ఆ భీకర ఆకారం, తన భారీ మనసు పారేసుకుంటుంది. అందువల్ల ఆమెను చంపదు సరికదా, ఆమెను కాపాడ్డం కోసం భారీ డైనోసార్లు, కొండ చిలువలు, రాకాసి పక్షులతో కూడా పోరాడుతుంది. ఈలోగా చిత్రబృందంలో ఆ హీరోయిన్ను ప్రేమించిన హీరో గొరిల్లాను వెంబడించి ఆమెను కలుసుకుంటాడు. ఇద్దరూ కలిసి పారిపోతుంటే గొరిల్లా వెంటపడుతుంది. చిత్రబృందం దానిపై గ్యాస్ బాంబ్ విసిరితే అది స్పృహ తప్పుతుంది. అది లేచేలోగా అందరూ ఓడెక్కి పారిపోవచ్చు కదా? కానీ... సినిమా సగమే అయింది కాబట్టి, మిగతా క్లైమాక్స్ న్యూయార్క్‌లో ఉంది కాబట్టి అలా చేయరు. దాన్ని బంధించి నగరానికి తీసుకువచ్చి టికెట్టు పెట్టి, అది మెచ్చిన హీరోయిన్ సమక్షంలోనే దాన్ని ప్రదర్శనకు పెడతారు. జనం విరగబడి వస్తారు. కెమేరాల ఫ్లాష్‌లు వెలిగేసరికి ఆ గొరిల్లా బెదిరి గొలుసులు తెంపేసుకుంటుంది. జనం గగ్గోలు పెట్టి పారిపోతారు. హీరోయిన్ కనబడకపోయేసరికి గొరిల్లా ఊరి మీద పడుతుంది. కార్లు, బస్సులు తొక్కేస్తుంది. రైళ్లు తోసేస్తుంది. భవనాలు కూల్చేస్తుంది. ఆఖరికి న్యూయార్క్‌లోనే ఎత్తయిన ‘ఎంపైర్ స్టేట్ భవనం’ ఎక్కేస్తుంది. ఇహ లాభం లేదని యుద్ధవిమానాలు బయల్దేరి దాని మీదకు బాంబులు కురిపిస్తూ, సినిమాను క్లైమాక్స్‌కి తీసుకువస్తాయి. ఆ గొరిల్లా ఓ విమానాన్ని చేత్తో పట్టుకుని విసిరేసినా, ఈలోగా బాంబులు తగిలి కింద పడి చచ్చిపోతుంది. దాని భారీ దేహాన్ని చూస్తూ ఓ పోలీసు అధికారి ‘ఆఖరికి దీన్ని విమానాలు చంపాయన్నమాట’ అంటాడు. వెంటనే మరో పోలీసు అధికారి, ‘కాదు... అందం చంపింది’ అని వ్యాఖ్యానిస్తాడు.

- సినిమాలో హీరోయిన్గా నటించిన ఫేవ్రే పేరు మార్మోగిపోయింది. ఆమెకు ఆ తర్వాత అనేక అవకాశాలు క్యూకట్టాయి.
- హీరోయిన్ను బుక్ చేసుకునేప్పుడు దర్శకుడు ఆమెతో, ‘‘నల్లగా, ఒళ్లంతా బొచ్చుతో, ఎత్తయిన వాడు మీ సరసన హీరోగా నటిస్తాడు’’ అని చెప్పాడట.
- ఈ సినిమాని స్టాప్ మోషన్ యానిమేషన్ పద్ధతిలో తీశారు. గొరిల్లా బొమ్మలను తయారు చేసి ఒకో కదలికను ఎన్నో ఫ్రేములు చిత్రీకరించి అన్నీ కలిపి కదిలినట్టు చూపించారు.
- సినిమా దర్శక నిర్మాత మెరియన్ సి. కూపర్ ఓసారి కారులో వెళుతూ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ని చూసినప్పుడు, ‘దీనిపైకి ఓ భారీ గొరిల్లా ఎక్కితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన కలిగిందిట. దాన్ని బట్టి కథని అల్లుకున్నారు.
- సింహం గర్జన, పులి గాండ్రింపులను రికార్డు చేసి ఆ రెంటినీ కలిపి, రివర్స్‌లో నెమ్మదిగా ప్లే చేయడం ద్వారా గొరిల్లా అరుపులను వినిపించారు.
- గొరిల్లా హీరోయిన్ను ఎత్తుకుపోయే దృశ్యాల కోసం ఓ భారీ చెయ్యిని తయారు చేసి దాంటో హీరోయిన్ని పడుకోబెట్టి, క్రేన్ ద్వారా పైకెత్తుతూ చిత్రీకరించారు. ‘ఆ సన్నివేశాల్లో నేను నటించలేదు. నిజంగానే భయపడి అరిచాను’ అని చెప్పింది హీరోయిన్.