నేలమీద నడిచిన ‘మహాత్ముని’ కథ: ‘గాంధీ’
‘గాంధీ’ - సర్‌ రిఛర్డ్‌ ఆటెన్‌బరో అద్భుత చిత్రం
దర్శకుడు: రిఛర్డ్‌ ఆటెన్‌బరో
నిర్మాత: గోల్డ్‌క్రెస్ట్‌ ఫిల్మ్స్, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
ప్రివ్యూ: 30 నవంబర్, న్యూఢిల్లీ నగరంలో
నిడివి: 191 నిమిషాలు

తారాగణం
: బెన్‌ కింగ్‌స్లే (గాంధీ), రోషన్‌ సేథ్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ), రోహిణీ హట్టంగడి (కస్తూర్‌బా), అలెక్‌ పదమ్‌ సీ (మహామ్మద్‌ ఆలీ జిన్నా), కాండిస్‌ బెర్జెన్‌ (మార్గరెట్‌ బౌర్క్‌-వైట్‌),ఎడ్వర్డ్‌ ఫాక్స్‌ (బ్రిగేడియర్‌ జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌), ట్రెవర్‌ హూవార్డ్‌ (జడ్జ్‌ ఆర్‌.ఎస్‌.బ్రూమ్‌ఫీల్డ్‌), జాన్‌ మిల్స్‌ (థర్డ్‌ బ్యారన్‌ ఛెమ్స్‌ఫోర్డ్‌), మార్టిన్‌ షీన్‌ (జర్నలిస్ట్‌ విన్స్‌ వాకర్‌) తదితరులు.


‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందుతరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, మహాత్మా గాంధీ గురించి, గాంధీ 70వ జన్మదిన సందర్భంగా. నిజమే, ఒక వ్యక్తి దేశాన్ని ఏకం చేయటం, దేశప్రజలను కులమతాలకు అతీతంగా ఒక్కమాట మీద నడిపించడం, ఏ ఆయుధమూ ప్రయోగించకుండా, కేవలం అహింస, సత్యం అనే అప్పటికి ఎవ్వరూ ఎరుగని అత్యంత ఆధునిక పద్ధతులతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధింపచేయటం..అంతా కల్పనలాగ అనిపిస్తుంది. కానీ అది గత శతాబ్దం ప్రథమార్థంలోనే జరిగింది. ఇంత చరితార్థకమైన వ్యక్తి గురించి సినిమా తీయాలనుకోవటం యాదృచ్ఛికం ఏమీ కాదు. ముందు తరాలకు ఆయన జీవితగాథను దృశ్యరూపంలో అందించడం కూడా అనుహ్య పరిణామం కాదు. అది నేడో రేపో జరిగి తీరాల్సి ఉన్న విషయమే! అలాగే జరిగింది. ఆ చిత్రరూపకల్పనకు నడుం బిగించిన దర్శకుడు సర్‌ రిఛర్డ్‌ ఆటెన్‌బరో.


* సినిమా..ఆయన జీవితం!
రిచర్డ్‌ ఆటెన్‌బరో పూర్తిగా చిత్రరంగానికి అంకితమైన జీవితమనే చెప్పాలి. 29 ఆగస్టు 1923న ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ నగరంలో జన్మించిన ఆయన ‘సినిమా’ జీవితం, రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగంతోనే ఆరంభం అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ఆయనను రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌కు బదిలీ చేశారు. ఆయన ఉద్యోగ జీవితంలో భాగంగా, 1943లో ‘జర్నీ టుగెదర్‌’ అనే ప్రచార చిత్రంలో నటించారు. తరువాత, నాటకరంగం వేదికమీద ‘ది మౌస్‌ట్రాప్‌’ అనే నాటకంలో నటించడం ఆరంభించాడు. ఈ నాటకాన్ని ఆగథా క్రిస్టీ రాశారన్నదీ తెలిసిందే! లండన్‌లో అత్యధిక కాలం ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించిన నాటకం ఇది. ఈ నాటకాన్ని వేసిన తొలి బృందంలో సభ్యులైన ఆటెన్‌బరో, ఆ నాటకంలో నటించడానికి 10 శాతం లాభాల పంపకమనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘నా జీవితంలో అత్యంత లాభదాయకమైన వ్యాపార ఒప్పందం ఇదే!’ అనేవారు ఆటెన్‌బరో. ఈ వాటాలను ఆయన మొదట్లో ఒక రెస్టారంట్‌ స్థాపనకూ, తరువాత మిగిలిన వాటాలను ‘గాంధీ’ చిత్ర నిర్మాణం కోసం అమ్మేశారు. చిత్రరంగంలో నటుడుగా ఆయన ‘బ్రైటన్‌ రాక్‌’, ‘దిగ్రేట్‌ ఎస్కేప్‌’, ‘ది శాండ్‌ పెబల్స్‌’, ‘మిరకిల్‌ ఆన్‌ థర్టీఫోర్త్‌ స్ట్రీట్‌’ (1994), ‘జురాసిక్‌ పార్క్‌’, ‘10 రిలింగ్‌టన్‌ ప్లేస్‌’ వంటి చిత్రాలతో నటించారు. తరువాత, చిత్రనిర్మాతగా 1959లో ‘ది లీగ్‌ ఆఫ్‌ జెంటిల్‌మెన్‌’, 1960లో ‘ది యాంగ్రీ సైలెన్స్‌’, 1961లో ‘విజిల్‌ డౌన్‌ ది విండ్‌’ చిత్రాలనూ తీసి, తరువాత దర్శకత్వం వైపు దృష్టి మరల్చారు. 1969లో ‘ఓ, వాట్‌ ఏ లవ్లీ వార్‌’, 1972లో ‘యంగ్‌ విన్‌స్టన్‌’, 1977లో ‘ఏ బ్రిడ్జ్‌ టూ ఫార్‌’ తీశారు. తరువాత ఆయన తనకు ఎంతో ఇష్టమైన ‘గాంధీ’ చిత్రంవైపు కదిలారు.


* జీవితకాల స్వప్నమిది!

మహాత్మాగాంధీ జీవితగాథ అంటే ఆటెన్‌బరోకు చెప్పలేనంత ఇష్టం ఉండేది. ‘గాంధీ జీవితగాథను చలనచిత్రంగా తీయటం నా జీవిత స్వప్నం’ అనేవారు ఆయన. అసలు గాంధీ జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన మొట్టమొదటిసారిగా గేబ్రియాల్‌ పాస్కల్‌ అనే వ్యక్తికి కలిగింది. ఆయన తన ఉద్దేశ్యాన్ని 1952లోనే భారతదేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ముందుంచారు. దానికి నెహ్రూ కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ, చిత్రనిర్మాణానికి తగిన ఏర్పాట్లు జరగకమునుపే, 1954లో పాస్కల్‌ కన్నుమూయటంతో, ఆ చిత్ర నిర్మాణం పక్కన పడింది. 1962లో మళ్లీ గాంధీ చిత్రకథ, కొన్ని అడుగులు ముందుకు వేసింది. ఈసారి ఈ కథకు సూత్రధారి, లండన్‌లోని భారతదేశ హైకమీషన్‌లో పనిచేస్తున్న మోతిలాల్‌ కొఠారీ అనే ఉద్యోగి. ఆయనకు మహాత్మా గాంధీ అంటే అమితమైన అభిమానం. అందుకే, ‘గాంధీ’ చిత్రాన్ని తీసే విషయంలో ఒకసారి కలుద్దామని కొఠారీ, ఆటెన్‌బరోకు కబురుపెట్టారు. లూయీ ఫిషర్‌ రాసిన మహాత్మాగాంధీ జీవిత గాథను చదివిన ఆటెన్‌బరో, తనకు భారతదేశానికి మొదటి గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన మౌంట్‌బాటెన్‌తో ఉన్న పరిచయాల కారణంగా, ఆయన సహకారంతో నెహ్రూను, ఆయన కుమార్తె ఇందిరను కలుసుకున్నారు. కానీ, 1964లో ప్రధాని నెహ్రూ మరణంతో, చిత్రనిర్మాణం కథ వెనక్కుపోయింది. మళ్లీ 1976లో ఆటెన్‌బరో, ఈ చిత్ర నిర్మాణానికి యత్నాలు ఆరంభించారు. కానీ, అప్పట్లో భారతదేశం అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ఉండటంతో షూటింగ్‌ జరగటం అసాధ్యం అనిపించి, వెనుకంజ వేశారు.

* అంచెలంచెల ప్రయత్నం!
‘గాంధీ’ జీవితం ఆధారంగా ఒకసారి హాలీవుడ్‌ దర్శకుడు డేవిడ్‌ లీన్‌ కొన్ని ప్రయత్నాలు చేశారు. అలెక్‌ గిన్నెస్‌ను గాంధీ పాత్రకు ఎంపిక చేసుకున్నారనే వార్తలూ వెలువడ్డాయి. కానీ, ఎందుకో, డేవిడ్‌ లీన్‌ మొదట అనుకున్నట్లు ‘గాంధీ’ చిత్రాన్ని చేపట్టక ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’ చిత్రనిర్మాణంలో ముందుకెళ్లారు. ఇది కూడా ఒక జీవితకథ ఆధారంగానే రూపొందిందనేది విశేషం. ఆ తరువాత మరోసారి, డేవిడ్‌ లీన్, ‘గాంధీ’ చిత్రం గురించి ఆలోచించినా, మళ్లీ దాన్ని పక్కనపెట్టి ‘ర్యాన్స్‌ డాటర్‌’ చిత్రాన్ని చేపట్టారు. ఆ తరువాత, ఎలాగైతేనేం, మనదేశంలోని నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యన్‌.ఎఫ్‌.డి.సి) సంస్థవారు ఈ చిత్రనిర్మాణానికి పెట్టుబడిగా 1 కోటి డాలర్లను ఆర్థిక రుణం అందించడానికి సిద్దపడటంతో, ఆటెన్‌బరో అనుకున్నట్లుగా చిత్రనిర్మాణం కల సాకారం కాసాగింది. ఆ సమయంలో ఎన్‌.ఎఫ్‌.డి.సికి ఛైర్మన్‌గా మన తెలుగు నిర్మాత డి.వి.ఎస్‌.రాజు ఉండటం మనకు ఎంతో గర్వకారణం. (ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టినందుకు తమ వాటాగా ఎన్‌.ఎఫ్‌.డి.సి. ఎన్నో లాభాలను అందుకుంది అనేదీ వాస్తవమే) ఎన్‌.ఎఫ్‌.డి.సి వారి పెట్టుబడికి తోడుగా మరిన్ని చోట్లా ఆటెన్‌బరోకు ప్రోత్సాహం లభించింది. ఈ చిత్రానికి రచన చేసిన జాన్‌ బ్రెయిలీ, దర్శకుడు అటెన్‌బరోను, గోల్డ్‌క్రెస్ట్‌ కంపెనీకి చెందిన జేక్‌ ఎబర్ట్‌కు పరిచయం చేశారు. ఆ సంస్థ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి అంగీకరించడంతో, చిత్రనిర్మాణం మొదలైంది. అలా, దాదాపు ఇరవై సంవత్సరాల ఆటెన్‌బరో కల, స్వప్నంగానే మిగిలిపోక, వాస్తవమైన రూపుదిద్దుకోనారంభించింది. 26 నవంబర్‌ 1980న షూటింగ్‌ ఆరంభం చేసుకున్న ‘గాంధీ’ చిత్రం 1981 మే 10కి ముగిసింది. ‘గాంధీ’ జీవితగాథ అందరికీ, ముఖ్యంగా మన దేశంలో అందిరికీ బాగా తెలిసిందే అయినా, చిత్రకథను మాత్రం గాంధీ పేరు అంతర్జాతీయంగా ప్రముఖంగా వినిపించడం మొదలైన దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఒక సంఘటనతో ఆరంభించారు.


* ‘గాంధీ’ చిత్రకథ సంక్షిప్తంగా!

భారతదేశ చరిత్రలో అదొక విషాదఘట్టం. 30 జనవరి 1948. సాయంత్రం ప్రార్థనల కోసం మహాత్మాగాంధీ బయలుదేరారు. అక్కడికి వచ్చిన ఎంతోమంది సందర్శకులలో ఒకరైన నాథూరామ్‌ గాడ్సే ఒక్కడుగు ముందుకు వేసి, అతి దగ్గర నుంచి (పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌) గాంధీపై రివాల్వర్‌ పేల్చారు. ‘హే రామ్‌’ అంటూ ఒక్క మాటతో గాంధీ నేల మీదకు ఒరిగిపోయారు. క్షణాలలోనే ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. భారతదేశం అంతటా రోదనలు ఆరంభం అయ్యాయి. ఆ ఒక్కమరణం.. దేశాన్ని కుదిపేసింది. ప్రపంచాన్ని నెవ్వరపరచిందది.

గాంధీ సినిమా కథ ఇలా ఆరంభం అయినా, జరిగిన కథంతా నాటికి గతంలోనే ఉంది. 1893లో ఆరంభం అవుతుంది గాంధీ (సినిమా) కథ. శ్వేతజాతి అహంకారం అనూహ్యంగా ఉన్న దక్షిణాఫ్రికాలో కేవలం వారికి పరిమితమైన రేల్వే కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన బక్కపలచని వ్యక్తి, ఆయనవద్ద ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ఉన్నా, బలవంతాన బయటకు తోసేశారు. (ఆ తరువాత అదే బక్కపలచటి వ్యక్తి ఆ ‘రవి అస్తమించని’ బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఏకంగా భారతభూభాగం నుంచే బయటకు తోసేశాడనేది చరిత్ర సత్యం!) తనను అలా తోసెయ్యటం అంటే, వర్ణవివక్షకు అదే పరాకాష్ట అని భావించిన ఆ వ్యక్తి, దక్షిణాఫ్రికాలోని భారతీయుల హక్కుల కోసం ‘అహింసాయుత నిరసన’ ఆరంభించాడు. అనేక ఆందోళనల తరువాత, భారతీయులకు కొన్ని హక్కులను ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అమోదించడం.. ఆనాటి సంఘటనకు కొసమెరుపు. అంతటి విజయం సాధించిన ఆ బక్కపలచని వ్యక్తికి స్వదేశం సాదరంగా ఆహ్వానం పలికింది. ఆయన తన మాతృదేశం గడ్డమీద అడుగుపెట్టినప్పుడు, దేశం అంతా ఒక్కటై ‘గాంధీ, గాంధీ’ అని నినదించింది. ప్రతి భారతీయుని మదిలోనూ ఆ నినాదం ప్రతిధ్వనించింది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా దేశం ఆయనను కోరింది. దేశంలో ‘సత్యగ్రహం’, ‘అహింసావాదం’, ‘సహాయనిరాకరణ ఉద్యమం’ వంటి కొత్త నిరసన విధానాలు అందరికీ పరచయం అయ్యాయి. మెట్టుమెట్టుగా బ్రిటీష్‌ ప్రభుత్వం దిగిరావటం ఆరంభం అయ్యింది. 1930లో ఉప్పు సత్యగ్రహం జరిగింది. ఫలితంగా లండన్‌లో చర్చలు ఆరంభం అయ్యాయి. కానీ, అవి నిష్పలమయ్యాయి. తరువాత, రెండో ప్రపంచయుద్ధం రావటంతో, ప్రపంచ రాజకీయాలో మారటం ఆరంభం అయ్యింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి శ్వేతజాతి పాలకులకు ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చే పరిస్థితి ఉన్నా, దేశం రెండు ముక్కలయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల గాంధీ మనసు క్షోభకు గురయింది. మతపరంగా దేశం ఏ పరిస్థితులోనూ రెండుముక్కలు కారాదనేది గాంధీ భావన. దానికి ఆయన, స్వతంత్య్రం లభించాక ఈ భారతదేశానికి నాయకత్వం వహించే బాధ్యతను మహ్మద్‌ అలీజిన్నాకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆయన ప్రయత్నాలు అన్నీ వ్యర్థమయ్యాయి. మరో మార్గం లేక, దేశం రెండు భాగాలయింది. కొత్తగా పాకిస్థాన్‌ దేశం రూపుదిద్దుకుంది. రెండు ప్రాంతాలలోనూ కోట్లాదిమంది ప్రజల హృదయాలు గాయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అల్లర్లు మితిమీరిపోయాయి. ఎందరో అకారణంగా బలి అయ్యారు. వీటిని నిరోధించేందుకు గాంధీ శతథా ప్రయత్నించారు. ముస్లిమ్‌ల పట్ల గాంధీ అవాంఛనీయమైన ఆదరణ చూపిస్తున్నారనే ఆక్రోశం చాలామంది భారతీయులలో కలిగింది. అలాంటివారిలో ఒకరు నాథూరామ్‌ గాడ్సే. అందుకే, ఆయన తూటాకు గాంధీ బలి అయ్యారు. గాంధీ పార్థివ శరీరం రాజ్‌ఘాట్‌లో అగ్నికి ఆహుతి అయింది. ఆయన అస్థికలు గంగానదదిలో కలిసిపోయాయి.


* ‘గాంధీ’ చిత్రవిశేషాలు..
అటెన్‌బరో నిర్మిస్తున్న ‘గాంధీ’ చిత్రంలో గాంధీగా నటించనున్నారనే విషయమై చాలా తర్జనభర్జనలు జరిగాయి. చివరకి ఆ పాత్రను బెన్‌ కింగ్‌స్లే పోషించారు. చిత్రంగా ఆయన అసలు పేరు ‘కృష్ణ భాంజీ’ కావటం విశేషం. ఆయన మూలాలన్నీ భారతదేశంలోని గుజరాతీయులకు చెంది ఉండటం మరో విశేషం. ఆయన సతీమణి కస్తూర్‌బా గాంధీగా రోహిణీ హట్టంగడి నటించారు. మనదేశానికి చెందిన రోషన్‌ సేథ్, అనుపమ్‌ ఖేర్‌ వంటి ఎందరో ఆ చిత్రంలో నటించారు. దేశ విభజనకు కారణమైన మహ్మద్‌ అలీ జిన్నా పాత్రను, ఇటీవలే మరణించిన అలెక్‌ పదమ్‌సీ పోషించారు. చిత్రానికి సంగీతాన్ని మన ‘భారతరత్న’ రవిశంకర్‌తో బాటు జార్జ్‌ ఫెంటన్‌ సమకూర్చారు. డైరక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా బిల్లీ విలియమ్స్, రోనీ టేలర్‌లు పనిచేశారు. రచనను జాన్‌ బ్రెయిలీ అందించారు. ఈ చిత్రాన్ని తనకు గాంధీ చిత్రంవైపు దృష్టిని మళ్లించిన కొఠారీకి, నెహ్రూకు కలుసుకొని చిత్రనిర్మాణం గురించి తొలి ఆలోచనలు పంచుకోవడానికీ సాయపడిన మౌంట్‌బాటన్‌కు, నెహ్రూకు అంకితం ఇచ్చారు నిర్మాత, దర్శకుడు అయిన రిఛర్డ్‌ ఆటెన్‌బరో.


* విడుదల అనంతరం..

‘గాంధీ’ చిత్రం విడుదల అయిన నాటి నుంచీ అనుహ్యమైన ఆదరణ పొందింది. మొదటిసారి విడుదలలోనే ఈ చిత్రం దాదాపు 105 కోట్ల రూపాయల్ని సంపాదించింది. ఇక, ఈ చిత్రం పొందిన పురస్కారాలకైతే లెక్కే లేదు. ఒక్క ఆస్కార్‌ పురస్కారాల విషయమే ఆలోచిస్తే, ‘గాంధీ’ చిత్రానికి మొత్తం 11 పురస్కారాలకు నామినేషన్‌ లభించగా, చివరకి వాటిలో 8 పురస్కారాలను ‘గాంధీ’ దక్కించుకుంది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (‘గాంధీ’గా బెన్‌ కింగ్‌స్లే), ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ కళాదర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్‌లతోబాటు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లకూ ఆస్కార్‌ అవార్డ్‌లు లభించాయి. ఈ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ అవార్డ్‌ను జాన్‌ మోలోతోబాటుగా మనదేశానికి చెందిన భానూ అథయా అందుకోవడం విశేషం. మనదేశ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తికి ఆస్కార్‌ రావడం ఇదే ప్రథమం. ఆ తరువాత, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఏ.ఆర్‌.రెహమాన్, ‘జయహో, పాట రాసిన గుల్జార్, ఆ చిత్రానికి ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌క్ష చేసిన వారిలో ఒకరుగా రసూల్‌ పోకుట్టీలు ఆస్కార్‌ విజేతలయి, మన దేశానికి పేరు తెచ్చారు.


* ‘గాంధీ’ చిత్రప్రభావం!
‘గాంధీ’ చిత్రప్రభావం అనలేము కానీ, ‘గాంధీ’ చిత్రం విడుదలైన తరువాత రెండేళ్ల కాలానికి మనదేశంతో సంబంధం ఉన్న కథలతో హాలీవుడ్‌ చిత్రాలు చాలానే నిర్మితమయ్యాయి. వాటిలో ‘హీట్‌ అండ్‌ డస్ట్‌’, ‘అక్టోపుస్సీ’, ‘ది జ్యువెల్‌ ఇన్‌ ది క్రౌన్‌’, ‘ది ఫార్‌ పెవిలియన్‌’, ‘ఏ పాసేజ్‌ టు ఇండియా’ వంటి ఎన్నో చిత్రాలు రూపొందాయి. గాంధీజీని కళ్లారా చూసిన తరం దాదాపు ముగిసిపోయింది. గాంధీ ఆత్మకథ అయిన ‘మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ చదివే ఓపిక ఇప్పుడు మనలో చాలామందిలో తగ్గిపోయింది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్నట్లు ‘గాంధీలాంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద నడయాడారంటే ముందుతరాలవారు విశ్వసించడం కూడా కష్టమే’ కనుక, మన ముందుతరాలవారిలో ఆ విశ్వాసం కలిగించడానికై, మనం ఈ చిత్రాన్ని చూడటం, చూపించడం చారిత్రక అవసరం. నిజమే, ఈ చిత్రం గాంధీ జీవితాన్ని సమగ్రంగా చూపించలేదు. అసలు ఏ వ్యక్తి జీవితాన్నీ మూడుగంటల వ్యవధి ఉండే ఒక సినిమా సమగ్రంగా చూపడం అసాధ్యం. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇతురులపైనా, ఒక జాతిపైనా చూపిన ప్రభావాన్ని సంక్షిప్తమాత్రంగానే చిత్రీకరించగలదు. అయినా కూడా, ‘గాంధీ’ చిత్రాన్ని ఇప్పటికే మీరు చూసి ఉండకపోతే, ఇప్పుడైనా చూడటం అవసరం!!

- డా.పాలకోడేటి
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.