ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన గ్లాడియేటర్‌

అంతరిక్షాన అంతర్జాతీయ ఖ్యాతి కేతనాన్ని సగర్వంగా ఎగురవేసి సరికొత్త సంచలనాలు లిఖించిన గొప్ప సినిమా ఇది. నిఖిల లోకం నిబిడాశ్చర్యంలో మునిగితేలేలా నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన సినిమా కూడా ఇదే. షరా మామూలు సినిమాలు కోకొల్లలుగా బాక్సాఫీస్‌ని బద్దలు కొడుతూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో నిశబ్ద తుఫానులా వినోద ప్రపంచాన్ని చుట్టుముట్టేసి ‘ఔరా!’ అనిపించేలా చేసిన చిత్రం ఇది. మనం రోజూ చూస్తూ... అవగాహన చేసుకుంటున్న సమకాలీన ఇతివృత్తాలతో చిత్రాలు రూపొందించడం కాస్త కష్టసాధ్యమే అయినా ఇష్టసాధ్యమే. అయితే, వందల సంవత్సరాల వెనక్కి వెళ్లి... ఆనాటి స్థితిగతుల్ని మనోనేత్రంతో వీక్షించి... ఆహారం, ఆహార్యం, అలవాట్లు, జీవనశైలి తదితర అంశాలను పరిశోధించి, పరిశ్రమించి గత కాల వైభవ ప్రాభవాలను కళ్లకు కట్టినట్లు చిత్రిక పట్టడం ఓ రకంగా కత్తి మీద సామే. అదో సాహసం. ఆ సాహసం పండితే విజయం సాధించి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓడితే పాతాళంలో సమాధి అవుతుంది. అందుకే... నిర్దేశించిన కాలాన్ని అరచేతుల్లో నింపుకుని అతి భద్రంగా తెరకెక్కించగల దర్శకులు సదా తెరస్మరణీయులే. అప్పటికీ.. ఇప్పటికీ... ఇక, ఎప్పటికీ సినీ వినోదం ఉన్నంతవరకూ యావత్‌ ప్రేక్షకలోకం గర్వంగా చెప్పుకునే ప్రపంచ సినిమా పటంలో మెచ్చు తునక అనదగ్గ చిత్రం ‘గ్లాడియేటర్‌’. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలైన డ్రీమ్‌ వర్క్స్‌ పిక్చర్స్, యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్వహణలో నిర్మితమై 2000 సంవత్సరం మే 1న లాస్‌ ఏంజిల్స్‌ లో, నాలుగు రోజుల తరువాత మే 5న యూఎస్‌లో, అదే సంవత్సరం అదే నెల 11న సింగపూర్‌లో విడుదలై...తర్వాత్తర్వాత ప్రపంచవ్యాప్త కీర్తిని సముపార్జించుకున్న చిత్రం ‘గ్లాడియేటర్‌’.


* తెర వెనుక... తెర ముందు

‘గ్లాడియేటర్‌’ సినిమాని ప్రస్తావించుకోవాలంటే ముందుగా ఆ చిత్ర రూప శిల్పుల్ని స్మరించుకోవాల్సిందే. చిత్ర దర్శకుడు రిడ్లీ స్కాట్‌. 1979లో సైన్స్‌ ఫిక్షన్‌ హర్రర్‌ మూవీ ఏలియన్‌ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి తన ముద్రను ప్రగాఢంగా వేసిన దర్శక నిర్మాత. రొటీన్‌ సినిమాలకు దూరంగా సైన్స్‌ ఫిక్షన్‌లతో ప్రేక్షక లోకాన్ని అబ్బురపరిచే దర్శకుడిగా ఆయన పేరుకు ఓ ప్రత్యేకత. ‘ బ్లేడ్‌ రన్నర్‌’, ‘ది మార్టియû’Â చిత్రాలు కూడా ఆయన దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌లే. డేవిడ్‌ ఫ్రాంజోని, జాన్‌ లోగాన్, విలియం నిఖోల్సన్‌ కలసి రాసిన గత రోమ్‌ చరిత్రలో కీలక ఘట్టానికి గ్లాడియేటర్‌ పేరిట చిత్ర రూపం సమకూర్చారు రిడ్లీ స్కాట్‌.


* మెరిసిన తారలు


రస్సెల్‌ క్రో, జాక్విన్‌ ఫోనిక్స్, కొన్నీ నీల్సన్, ఆలివర్‌ లీడ్, డెరిక్‌ జాకోబి, డై మెన్‌ హనసౌ, రిచర్డ్‌ హర్రీస్‌ గ్లాడియేటర్‌ని తెర పై నడిపించిన పాత్రధారులు...సూత్రధారులు. డానియెల్‌ పి మానిక్స్‌ 1958లో రాసిన ‘దోజ్‌ అబౌట్‌ టు డై’ నవల ప్రేరణగా తెరకు అనువాదం చేసిన చిత్రం ‘గ్లాడియేటర్‌’. ఆ నవలను స్ఫూర్తిగా తీసుకున్న డేవిడ్‌ ఫ్రాంజోని ప్రాధమికంగా తొలిప్రతిని రాయగా... తరువాత జత చేరిన జాన్‌ లోగాన్, విలియం నిఖోల్సన్‌తో కలసి చిత్రానికి సంబంధించి పూర్తి స్థాయి కథను సమకూర్చారు. ఆ కథకు తగ్గ సుందర సురుచిర రూపాన్ని దర్శకుడు తన సృజనతో తెరపై చెక్కారు. దాంతో...ఈ చిత్రం ఎన్నటికీ చెరగని, చెదరని ముద్ర వేసింది. 103 మిలియన్‌ డాలర్లతో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర 460 మిలియన్‌ డాలర్లను కొల్లగొట్టింది. 2000 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం రన్నింగ్‌ టైం మొదట 155 నిముషాలు కాగా...ఆ తరువాత కాస్త పెంచడంతో 171 నిముషాల నిడివిగా మారింది. కనీవినీ ఎరుగని దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తే...దర్శక ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు లభించాయి. హన్స్‌ జిమ్మర్, లిసా గెరార్డ్‌ సమకూర్చిన సంగీతం, ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే యాక్షన్‌ సన్నివేశాలు, గత రోమన్‌ ప్రపంచాన్ని తలపించే ఆహార్యం... ఇవన్నీ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి.


* అవార్డుల పంట

‘గ్లాడియేటర్‌’ చిత్రాన్ని ప్రపంచం ఎంతగా ఆదరించిందో చెప్పడానికి ఆ చిత్రం అందుకున్న అవార్డులు, పురస్కారాలు సాక్ష్యాలు. 73వ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో ఒకేసారి ఐదు అకాడమీ అవార్డులు అందుకున్న చిత్రంగా ‘గ్లాడియేటర్‌’ చరిత్ర సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (రస్సెల్‌ క్రో), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్, ఉత్తమ శబ్ద గ్రహణ, ఉత్తమ విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ అవార్డులు గెలుచుకుంది.


* ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...’ అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. రోమన్‌ చరిత్ర కూడా అందుకు మినహాయింపు కాదు. రాజ్యాధికారం కోసం ఎత్తులు, జిత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, సామ్రాజ్య కాంక్షతో జన్మనిచ్చిన తండ్రిని సైతం మట్టుపెట్టిన ఘాతుకాలు, అన్యాయాలు, అసూయలు, ఆక్రోశాలు, కోపాలు... ఇన్ని జాడ్యాలు అప్పటి రోమ్‌ చరిత్ర కళ్లారా వీక్షించింది. ఆ చరిత్రకు అద్దం పట్టే చిత్రమే ‘గ్లాడియేటర్‌’. కథలోకి వెళ్తే... రోమన్‌ తరపున పోరాడి జర్నన్‌ ట్రైబ్స్‌పై విజయం సాధించి వస్తూ ఉంటాడు మెర్రీడియస్‌.అదే సమయంలో చక్రవర్తి తన కుమారుడు కమోడస్‌ రాజ్యాధికారం చేపట్టేందుకు అనర్హుడని భావించి సేనాధిపతైన మెర్రీడియస్‌ని తన వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించుకుంటాడు. ఇది తెలుసుకున్న కమోడస్‌ తండ్రిని హత్య చేసి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. రాజ్యానికి చేరిన సేనాధిపతి తనకి దాసుడిగా ఉండమంటాడు. అందుకు సేనాధిపతి నిరాకరిస్తాడు. ఆ సమయంలో రాజుకు సంబంధించిన సైన్యం సేనాధిపతి చెరలో బంధించేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగా రాజు సేనాధిపతి కుటుంబాన్ని కూడా హత్య చేయిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న సేనాధిపతి తన కుటుంబమంతా హత్యకు గురవడంతో తీవ్రమైన బాధకు గురై అక్కడే కుప్పకూలుతాడు. అప్పటికే దెబ్బలు తిని ఉండటం వలన కుప్పకూలుతాడు. అక్కడి ప్రాంతంలో ఒక వ్యక్తి ఇతనిని గ్లాడియేటర్స్‌ని తయారు చేసే వాళ్లకి అమ్మేస్తాడు. తన నైపుణ్యంతో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తాడు. రాజు దృష్టికి కూడా వెళ్తాడు. అప్పటి వరకు మాస్క్‌ వేసుకుని యుద్ధవిద్యలు ప్రదర్శించే అతడిని రాజు మాస్క్‌ తీయమంటాడు. మాస్క్‌ తీస్తే మెర్రీడియస్‌ని గుర్తించి ఖంగు తింటాడు. అతడిని ఏమైనా చేస్తే ప్రజావ్యతిరేకతకు గురవుతాడని భావించి మౌనంగా ఉండిపోతాడు. ఆ తరువాత కొంతకాలానికి తనతో పోటీకి సిద్ధమా అని సేనాధిపతి అడిగితే సరే అంటాడు.


పోటీ ప్రారంభం కావటానికి ముందు సేనాధిపతి చేసిన గాయంతో సేనాధిపతి చేతిలోనే మరణిస్తాడు. స్థూలంగా కధ ఇది. ఈ కథను రక్తి కట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించింది చిత్ర యూనిట్‌. ఆ విజయాన్నీ ఇప్పటికీ గర్వంగా ప్రపంచ సినిమా ప్రేమికులంతా స్మరించుకుంటున్నారు. ‘గ్లాడియేటర్‌’ మరెన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.