చరిత్ర మార్చిన రహస్య గూఢచారి...

జేమ్స్‌ బాండ్‌... ఇది అందరికీ పరిచయమైన పేరు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ తీర్చి దిద్దిన ఒక కాల్పనిక బ్రిటీష్‌ గూఢచారి పాత్ర పేరు జేమ్స్‌ బాండ్‌. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ బ్రిటీష్‌ రచయిత, జర్నలిస్టు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆయన బ్రిటీష్‌ నౌకాదళం రహస్య గూఢచార విభాగంలో పని చేసినవాడు. ఫ్లెమింగ్‌ 1953లో జేమ్స్‌ బాండ్‌ పాత్రకు రూపకల్పన చేసి, రహస్య గూఢచర్యం ఆధారంగా పన్నెండు డిటెక్టివ్‌ నవలలు, రెండు చిన్న కథానికలు రచించాడు. 1964లో ఫ్లెమింగ్‌ మరణించిన తరువాత జేమ్స్‌ బాండ్‌ నవలల స్పూర్తితో ఎనిమిది మంది రచయితలు ఫ్లెమింగ్‌ ధోరణిలోనే మరికొన్ని నవలలు సృష్టించారు. జేమ్స్‌ బాండ్‌ పాత్రను 007అనే రహస్య సంకేతంతో సంబోధిస్తూవుంటారు. ఫ్లెమింగ్‌ నవలలను సినిమాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం 1961లో మొదలైంది. ఈ సినిమాల్లో సీన్‌ కానరీ, జార్జ్‌ లిజెన్బీ, రోజర్‌ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్‌ బ్రోస్నన్, డేనియల్‌ క్రైగ్‌లు జేమ్స్‌ బాండ్‌ పాత్రను పొషించారు. 56 ఏళ్ళ కాలంలో ఇంతవరకు 24 జేమ్స్‌ బాండ్‌ సినిమాలు విడుదలయ్యాయి. తొలి బాండ్‌ సినిమా ‘డాక్టర్‌ నో’ (1962) కాగా తాజా బాండ్‌ సినిమా 2015లో వచ్చిన ‘స్పెక్టర్‌’. ఈ బాండ్‌ సినిమాల స్పూర్తితోనే తెలుగులో 1966లో తొలిసారి కృష్ణ హీరోగా ‘గూఢచారి 116’ సినిమా వచ్చింది. ఇండియాలో ఇదే తొలి స్పై పిక్చర్‌! దీనినే ‘ఫర్జ్‌’ పేరుతో 1967లో రీమేక్‌ చేశారు. తరవాత కన్నడంలో రాజకుమార్‌ హీరోగా ‘జెదర బలే’ (1968) స్పై చిత్రం వచ్చింది. చరిత్ర సృష్టించిన ఈ జేమ్స్‌బాండ్‌ కథాకమామీషును ఒకసారి పరిశీలించి చూద్దాం...


ఇయాన్‌ ఫ్లెమింగ్‌...
ఇయాన్‌ ఫ్లెమింగ్‌ పూర్తి పేరు ఇయాన్‌ లాంకాస్టర్‌ ఫ్లెమింగ్‌. లండన్లోని సంపన్న కుటుంబాలు నివసించే వెస్ట్‌ మినిస్టర్‌ ‘మేఫెయిర్‌’లో 1908 మే 28న జన్మించాడు. తండ్రి వేలంటిన్‌ ఫ్లెమింగ్, తల్లి ఎవేలిన్‌. ఫ్లెమింగ్‌ది సంపన్న కుటుంబం. తండ్రి ‘రాబర్ట్‌ ఫ్లెమింగ్‌ ఖీ కంపెనీ’ అనే మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థకు అధిపతి. పైగా ఆక్స్‌ ఫర్డ్‌ షైర్‌లోని హేన్లే పార్లమెంటరీ నియోజక వర్గానికి అతడు సభ్యుడుగా వుండేవారు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ తండ్రి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు సైన్యంలో చేరి ‘మేజర్‌’ హోదాలో పనిచేశారు. వెస్టరన్‌ ఫ్రంట్‌ సైనిక శిబిరంలో వుండి పోరాడుతూ జర్మన్‌ సైనికుల చేతిలో మరణించారు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ అన్న పీటర్‌ ఫ్లెమింగ్‌ విహార యాత్రల రచయితగా రాణించాడు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌కి మరో ఇద్దరు తమ్ముళ్లు మైఖేల్‌ ఫ్లెమింగ్, రిచర్డ్‌ ఫ్లెమింగ్‌ కూడా వుండేవారు. 1914లో ఇయాన్‌ డర్న్‌ ఫోర్డ్‌ స్కూల్‌లో చేరి ప్రాధమిక విద్యను పూర్తిచేశాడు. 1921లో ఈటన్‌ కాలేజిలో చేరి పట్టా పుచ్చుకున్నాడు. కాలేజిలో ఉండగానే ఆ కళాశాల మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా వ్యవహరించాడు. తరువాత రాయల్‌ మిలిటరీ కాలేజిలోను, జెనీవాలోని మ్యూనిచ్‌ కాలేజీలో చేరి చదువు పూర్తిచేశాడు. బ్రిటీష్‌ ప్రభుత్వ కామన్వెల్త్‌ కార్యాలయంలో చేరి 1933లో మాస్కో కార్యాలయ ప్రతినిధిగా పనిచేశాడు. తరువాత లండన్‌కు వచ్చి స్టాక్‌ బ్రోకర్‌గా వున్నాడు. 1939లో బ్రిటీష్‌ రాయల్‌ నౌకాదళ రహస్య సమాచార విభాగంలో గూఢచారిగా చేరి కమాండర్‌ స్థాయికి చేరుకున్నాడు. అతడి రహస్య సంకేతం ‘17నీ’. 1942లో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇయాన్‌ 30 మంది ముట్టడి చేయగల కమాండోలకు నాయకత్వం వహించాడు. ప్రపంచయుద్ధం సమసిపోయాక ఇయాన్‌ మిలటరీ విభాగాన్ని వీడి ‘ది సండే టైమ్స్‌’ అనే న్యూస్‌ పేపర్‌ బృందంలో చేరాడు. సంవత్సరంలో మూడు నెలలు ఇయాన్‌ వెస్ట్‌ ఇండీస్‌ దీవులలోని జమైకాలో కాలం గడిపేవాడు. అలా ఆ న్యూస్‌ పేపర్‌ సంస్థకు పనిచేస్తూనే గూఢచర్యం నేపథ్యంతో, తన అనుభవాన్ని రంగరించి నవలలు రాయడం మొదలెట్టాడు. అలా 1953లో తొలి స్పై నవల ‘క్యాసినో రాయల్‌’ను ప్రచురించారు. ఆ నవలకు మంచి స్పందన రావడంతో ఆ నవలను సంవత్సరంలోపే మూడు సార్లు ముద్రించాల్సి వచ్చింది. అందులో హీరో జేమ్స్‌ బాండ్‌ పేరుతో ‘సీక్రెట్‌ ఇంటలిజెన్స్‌ సర్వీస్‌’లో పనిచేస్తుంటాడు. ఈ విభాగంను ఎమ్‌-16గా వ్యవహరిస్తారు. జేమ్స్‌ బాండ్‌ కోడ్‌ 007. కెరేబియన్‌ దీవులలో పక్షులమీద పరిశోధన చేసే ఒక అమెరికన్‌ శాస్త్రజ్ఞుడి పేరు ‘జేమ్స్‌ బాండ్‌’. ఇయాన్‌ తన నవలల్లోని హీరోకి ఆ శాస్త్రజ్ఞుడి పేరు పెట్టాడు. అలా జమైకాలో వుంటూ 1953 నుంచి 1966 వరకు పద్నాలుగు నవలలు, రెండు కథానికలు రాసి ప్రచురించారు. వాటిలో ‘ది మ్యాన్‌ విత్‌ ది గోల్డన్‌ గన్‌’, ‘ఆక్టోపస్సీ’, ‘ది లివింగ్‌ దే లైట్స్‌’ నవలలు ఇయాన్‌ ఫ్లెమింగ్‌ మరణించాక విడుదలయ్యాయి.


ఇయాన్‌ ఫ్లెమింగ్‌ నవలల స్పూర్తి...
ఇయాన్‌ రాసిన ఆ పన్నెండు జేమ్స్‌ బాండ్‌ నవలలు వరసగా క్యాసినో రాయల్‌ (1953), లివ్‌ అండ్‌ లెట్‌ డై (1954), మూన్‌ రేకర్‌ (1955), డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌ (1956), ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌ (1957), ది డిమాండ్‌ స్మగ్లర్స్‌ (1957), డాక్టర్‌ నో (1958), గోల్డ్‌ ఫింగర్‌ (1959), ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ (1960), థండర్‌ బాల్‌ (1961), ది స్పై హూ లవ్డ్‌ మి (1962), ఆన్‌ హర్‌ మెజెస్టీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (1963), యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌ (1964), ది మ్యాన్‌ విత్‌ ది గోల్డన్‌ గన్‌ (1965), ఆక్టోపస్సీ అండ్‌ ది లివింగ్‌ డే లైట్స్‌ (1966). వీటిలో థ్రిల్లింగ్‌ సిటీస్‌ (1963), చిట్టి చిట్టి బ్యాంగ్‌ బ్యాంగ్‌ (1964) బాలల కథానికలు. ఫ్లెమింగ్‌ బతికి వుండగా 30 మిలియన్ల (మూడు కోట్ల) పుస్తకాలు అమ్ముడు పోగా, ఫ్లెమింగ్‌ చనిపోయిన తొలి రెండు సంవత్సరాల్లో 60 మిలియన్ల (ఆరు కోట్ల) పుస్తకాలకు పైగా అమ్ముడు పోయాయి. 1945 నుంచి బ్రిటీష్‌ రచయితలు రచించిన 50 అత్యుత్తమ నవలల్లో ఇయాన్‌ ఫ్లెమింగ్‌ నవలలు 14వ స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా డాక్టర్‌ నో, ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌ నవలలంటే అమెరికా పూర్వ అధ్యక్షుడు జాన్‌.ఎఫ్‌.కెనడీకి అమిత ఇష్టం. అంతకు ముందు ఇయాన్‌ ఫ్లెమింగ్‌ కెనడీని కలిసిన సందర్భంలో ఈ పుస్తకాల గురించి చాలాసేపు ముచ్చటించుకోవటం జరిగింది. 1964లో ఇయాన్‌ ఫ్లెమింగ్‌ కాలం చేశాక ‘బాండ్‌’ ప్రచురణకర్తలు ‘గిల్డోజ్ర్‌ ప్రొడక్షన్స్‌’వారు మరొక రచయిత జెఫ్రీ జెంకిన్స్‌ను బాండ్‌ నవలలను ఇయాన్‌ ఫ్లెమింగ్‌ శైలిలోనే రాయమని ఆదేశించారు. ‘పర్‌ ఫైన్‌ ఔన్స్‌’ అనే అసంపూర్తి నవలను జెంకిన్స్‌ పూర్తిచేసినా, ఆ నవల ప్రచురణకు నోచుకోలేదు. మరొక అసంపూర్తి నవల ‘కొలోనెల్‌ సన్‌’ను కింగ్స్లే అమిస్‌ అనే రచయిత రాబర్ట్‌ మర్కహామ్‌ అనే అజ్ఞాత పేరుతో పూర్తిచేసి 1968లో ప్రచురించాడు. ఫ్లెమింగ్‌ మరణానంతరం విడుదలైన తొలి జేమ్స్‌ బాండ్‌ పొడిగింపు నవలగా చెప్పవచ్చు. ఈ నవల డైలీ ఎక్స్‌ ప్రెస్‌లో ధారావాహికంగా వెలువడింది. ఈ నవలలోని అంశాలను ‘ది వరల్డ్‌ యీజ్‌ నాట్‌ ఇనఫ్‌’, ‘డై అనదర్‌ డే’ సినిమాల్లో వాడుకున్నారు. అలాగే 2015లో వచ్చిన ‘స్పెక్టర్‌’ చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలను ఈ నవల నుంచే గ్రహించారు. తరువాత సెబాస్టియన్‌ ఫాక్స్‌ వంటి ఎందరో నిష్ణాతులైన రచయితలు బాండ్‌ నవలలను రాస్తూవచ్చారు.


జేమ్స్‌ బాండ్‌ సినిమాల నేపథ్యం...
1961లో జేమ్స్‌ బాండ్‌ నవలలను సినిమాలుగా తీసేందుకు ముందుకు వచ్చిన హ్యారీ సల్టజ్‌ మన్‌కు ఇయాన్‌ ఫ్లెమింగ్‌ తన నవలల హక్కులను ధారాదత్తం చేశాడు. తరువాత హ్యారీ సల్టజ్‌ మన్‌ తన మిత్రుడు ఆర్‌.సి.బ్రోక్కోలితో కలిసి లండన్‌లోని పికడిల్లీలో ‘ఇయాన్‌ ప్రొడక్షన్స్‌’ సంస్థను స్థాపించి సినిమా నిర్మాణానికి పూనుకున్నాడు. ‘ఇయాన్‌’ అంటే ‘ఎవ్వెరిథింగ్‌’ అని లేక ‘నథింగ్‌’ అని గాని వ్యవహరిస్తారు. తొలి ఐదు సినిమాలలో బాండ్‌గా నటించేందుకు ఎందరో నటులను పరీక్షించి, చివరికి స్కాట్లాండ్‌కు చెందిన ‘సీన్‌ కానరీ’ని జేమ్స్‌ బాండ్‌ పాత్రకు ఎంపిక చేసి, అతనితో ఐదు సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ సినిమాలన్నీ పైన్‌ వుడ్‌ స్టూడియోలో నిర్మితమయ్యాయి. ‘ఇయాన్‌ ప్రొడక్షన్స్‌’ సంస్థ 22 జేమ్స్‌ బాండ్‌ సినిమాలను నిర్మించగా, మరో చిత్ర నిర్మాణ సంస్థ రెండు బాండ్‌ సినిమాలను నిర్మించింది. 2015 లో వచ్చిన ‘స్పెక్టర్‌’తో కలిపి ఇప్పటిదాకా 24 జేమ్స్‌ బాండ్‌ సినిమాలు విడుదలయ్యాయి. హ్యారీ సల్టజ్‌ మన్‌ జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లోని పాత్రలన్నిటికీ పేటెంట్‌ హక్కులు పొందాడు. 1975లో హ్యారీ సల్టజ్‌ మన్‌ తొమ్మిది జేమ్స్‌ బాండ్‌ సినిమా హక్కులను అమెరికాలోని ‘యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ కార్పోరేషన్‌’కు బదలాయించాడు. అయితే ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ప్రతి బాండ్‌ సినిమా టైటిల్‌లో, ముఖ్యంగా ‘ది స్పై హూ లవ్డ్‌ మి’ సినిమా మొదలు, సమర్పకుడుగా ఆర్‌.సి.బ్రోక్కోలి పేరు కనిపిస్తూ వుంటుంది. అతడు 1996లో చనిపోగా బ్రోక్కోలి కూతురు బార్బరా ఆమె సంతతి ప్రస్తుతం జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు హక్కుదారులుగా వున్నారు. ‘డాక్టర్‌ నో’, ‘ది మ్యాన్‌ విత్‌ ది గోల్డన్‌ గన్‌’ వంటి సినిమాలకు ఆర్‌.సి. బ్రోక్కోలి, హ్యారీ సల్టజ్‌ మన్‌ ఇద్దరి పేర్లు సమర్పకులుగా కనిపిస్తాయి. కాపీ రైట్స్‌ మాత్రం యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ కార్పోరేషన్‌ నుంచి 1981లో ‘మెట్రో గోల్డ్‌ విన్‌ మేయర్‌’ సంస్థ కొనుగోలు చేసింది. 2006 నుంచి విడుదలైన బాండ్‌ సినిమాలను మాత్రం ‘కొలంబియా పిక్చర్స్‌’ సంస్థ పంపిణీ చేస్తోంది.


తొలి జేమ్స్‌ బాండ్‌గా సీన్‌ కానరీ...
ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన తొలి బాండ్‌ సినిమా ‘డాక్టర్‌ నో’. టెరెస్స్‌ యంగ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబరు 5, 1962లో విడుదలైంది. ఫ్లెమింగ్‌ రాసిన నవల పేరుతోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. సహచర బ్రిటీష్‌ రహస్య గూఢచారి జమైకాలో అంతర్ధానం కాగా జేమ్స్‌ బాండ్‌ను పరిశోధన కోసం పంపటం ఈ సినిమా నేపథ్యం. తొలి జేమ్స్‌ బాండ్‌గా సీన్‌ కానరీ ఇందులో తొలిసారి నటించాడు. డాక్టర్‌ నో గా జోసెఫ్‌ వైజ్మన్, బ్రిటీష్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధిపతి ‘లీ’ గా బెర్నార్డ్‌ లీ, అతని సెక్రెటరీగా లూయిస్‌ మాక్స్‌ వెల్‌ నటించారు. బ్రిటన్‌లోని 168 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిర్మాణానికి ఒక మిలియన్‌ డాలర్ల వ్యయం కాగా 8 మిలియన్‌ డాలర్ల రాబడిని ఈ చిత్రం వసూలు చేసింది. సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచి భావితరంలో స్పై సినిమాల నిర్మాణానికి నాంది పలికింది. 5, అక్టోబరు 2012న ఈ తొలి జేమ్స్‌ బాండ్‌ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘గ్లోబల్‌ జేమ్స్‌ బాండ్‌ డే’ని నిర్వహించారు. 1966లో తెలుగులో నిర్మించిన గూఢచారి 116 చిత్ర కథకు డాక్టర్‌ నో సినిమా నేపథ్యాన్ని కొంత వాడుకున్నారు. సీన్‌ కానరీ హీరోగా 10 అక్టోబర్‌ 1963న రెండవ బాండ్‌ చిత్రం ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’ సినిమా 16 దేశాల్లో విడుదలైంది. ఇది 1957లో ఇయాన్‌ ఫ్లెమింగ్‌ అదేపేరుతో రచించిన నవలా కథకు వెండితెర రూపం. ‘డాక్టర్‌ నో’ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందమే ఈ చిత్రానికి పనిచేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్టై 78 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు 2 మిలియన్‌ డాలర్లు. ఈ చిత్రం గోల్డన్‌ గ్లోబ్‌ బహుమతికి నామినేట్‌ అయింది. బాండ్‌ సీరీస్‌లో మూడవ చిత్రం ‘గోల్డ్‌ ఫింగర్‌’. ఇది 17 సెప్టెంబరు 1964న విడుదలైంది. గే హమిల్టన్‌ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సీన్‌ కానరీ ఈ చిత్ర హీరో. ఈ చిత్రానికి సౌండ్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చిన నార్మన్‌ వాన్స్టాల్‌కు ఆస్కార్‌ బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని చూశాక గోల్డ్‌ ఫింగర్‌ నవలలు ఆరు మిలియన్లకుపైగా అమ్ముడుపోయాయి. 1965 డిసెంబరు 9న సీన్‌ కానరీ నటించిన ‘థండర్‌ బాల్‌’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని విశాలమైన తెరమీద కనిపించేలా పానావిజన్‌ కలర్‌లో నిర్మించారు. వైడ్‌ స్కీన్ర్‌ మీద నిర్మించిన తొలి బాండ్‌ చిత్రమే కాకుండా తొలి అండర్‌ వాటర్‌ మూవీ గా కూడా ఈ సినిమా రికార్డులను అందుకుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా అమర్చిన జాన్‌ సియర్స్‌కు ఆస్కార్‌ బహుమతి తెచ్చిపెట్టింది ఈ సినిమా. 141 మిలియన్‌ డాలర్ల రాబడి ఈ సినిమాకు రావడం ఒక రికార్డు. ఈ సినిమాలో షార్క్‌ చేపలతో షూటింగులో పాల్గొన్నప్పుడు సీన్‌ కానరీ త్రుటిలో ఒక షార్క్‌ చేప బంధం నుంచి తప్పుకొని బయటపడ్డాడు. అత్యుత్తమ యాక్షన్‌ సినిమాల జాబితాలో ‘థండర్‌ బాల్‌’ 73వ స్థానంలో నిలిచింది. ఇక ఐదవ బాండ్‌ చిత్రం ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’. సీన్‌ కానరీ నటించిన ఈ బాండ్‌ సినిమాకు లీవిస్‌ గిల్బర్ట్‌ దర్శకుడు. ఈ చిత్రం జూన్‌ 12, 1967న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. అమెరికన్, సోవియట్‌లు సంయుక్తంగా నింగిలోకి పంపిన మానవహిత అంతరిక్ష వాహనం మాయమైపోగా, జేమ్స్‌ బాండ్‌ శోధన కోసం జపాన్‌ వెళ్లే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సీన్‌ కానరీ కాంట్రాక్టు ఈ సినిమాతో పూర్తి కావస్తుండడంతో, జపాన్లో సీన్‌కానరీ తను బాండ్‌ సినిమాల నటన నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆరవ సినిమాకు సీన్‌ కానరీతప్పుకున్నా మరలా ఏడవ చిత్రం ‘డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌’ చిత్రంలో నటించాడు. ఇందులో వాల్కనో బేస్‌ సెట్టింగ్‌ నిర్మాణానికే స్టూడియోలో మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టారు. లండన్‌లోని లీసెస్టర్‌ స్క్వేర్‌ ఓడియన్‌ థియేటర్లో ప్రీమియర్‌ షోకు ఎలిజబెత్‌ రాణి రావడం పెద్ద విశేషంగా ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి 111 మిలియన్‌ డాలర్లను ఆర్జించిపెట్టింది. ఆరవ జేమ్స్‌ బాండ్‌ సినిమా ‘ఆన్‌ హర్‌ మెజెస్టీస్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ 18 డిసెంబర్‌ 1969న విడుదలైంది. సీన్‌ కానరీరిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఇందులో బాండ్‌ పాత్రకు బ్రిటీష్‌ మోడల్‌ జార్జ్‌ లిజెన్బిని ఎంపిక చేశారు. బాండ్‌ సినిమాలో నటించడం అంత తేలిక కాదని తెలుసుకున్న లిజెన్బీ తరువాత సినిమాలో నటించలేనని చేతులెత్తేశాడు. అంతకు ముందు సినిమాకు ఎడిటర్‌గా అద్భుత రీతిలో పనిచేసిన పీటర్‌.ఆర్‌.హంట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సీన్‌ కానరీ సినిమా అంతటి హిట్‌ కాకున్నా విజయవంతమైన చిత్రంగానే పేరుతెచ్చుకుంది. రాబడి ఆశించినంత ఎక్కువ రాలేదు. బాండ్‌ ఏడవ చిత్రం ‘డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌’. ఈ సినిమాలో నిర్మాతలు సీన్‌ కానరీని బ్రతిమాలి బాండ్‌గా మరలా నటింపజేశారు. గై హామిల్టన్‌ దర్శకత్వంలో 1971డిసెంబర్‌ 14న ఈ చిత్రం విడుదలై 116 మిలియన్‌ డాలర్ల రాబడిని ఆర్జించిపెట్టింది.


జేమ్స్‌ బాండ్‌గా రోజర్‌ మూర్‌ శకం...
1973-85 మధ్యకాలంలో నిర్మించిన బాండ్‌ చిత్రాల్లో హీరోగా రోజర్‌ మూర్‌ నటించాడు. రోజర్‌ మూర్‌కు తొలి చిత్రం ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’ (1973). మూర్‌ బాండ్‌ సినిమాల నుంచి తప్పుకున్న తరవాత యూనిసెఫ్‌ తరఫున 1991లో గుడ్‌ విల్‌ రాయబారిగా పనిచేశాడు. బ్రిటీష్‌ రాణి ఎలిజబెత్‌ నుండి 2003 లో ‘నైట్‌ హుడ్‌’ బిరుదు స్వీకరించాడు. ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’ సినిమాకు గై హ్యమిల్టన్‌ మూడవసారి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 27 జూన్‌ 1973న విడుదలైంది. చిత్ర నిర్మాణానికి 7 మిలియన్‌ డాలర్లు కాగా 161 మిలియన్‌ డాలర్ల వసూళ్లు చేసింది. రోజర్‌ మూర్‌కు బాండ్‌గా మంచి పేరొచ్చింది. తరువాతి సంవత్సరం గై హ్యమిల్టన్‌ దర్శకత్వంలోనే రోజర్‌ మూర్‌ రెండవ చిత్రం ‘ది మ్యాన్‌ విత్‌ ది గోల్డన్‌ గన్‌’ను నిర్మించారు. ఈ చిత్రం 19 డిసెంబర్‌ 1974న విడుదలై ఢంకా బజాయించింది. ఇందులో క్రిష్టోఫర్‌ లీ విలన్‌గా నటించటం ప్రత్యేకం. ఈ సినిమా నిర్మాణం తరువాత బ్రొక్కోలి, సల్ట్‌ జ్‌ మన్‌ల భాగస్వామ్యం రద్దయింది. సల్ట్‌ జ్‌ మన్‌ తన 50 శాతం వాటాను ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీకి అమ్మేశాడు. ఈ కారణం చేతనే తరువాతి సినిమా ‘ది స్పై హూ లవ్డ్‌ మి’ నిర్మాణం మూడేళ్లు వెనక పడింది. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ రాసిన పదవ నవల కథతో నిర్మించిన ‘ది స్పై హూ లవ్డ్‌ మి’ చిత్రం 7 జూలై 1977న విడుదలైంది. లీవిస్‌ గిల్బర్ట్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రీమియర్‌ షోకి బ్రిటీష్‌ రాకుమారి అన్నే హాజరవడం విశేషం. 185మిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. రోజర్‌ మూర్‌ నటించిన నాలుగవ చిత్రం ‘మూన్‌ రేకర్‌’ (1979). లీవిస్‌ గిల్బర్ట్‌ ఈ చిత్ర దర్శకుడు. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఈ నవల రాసేటప్పుడే సినిమాగా నిర్మిస్తే బాగుంటుందని 1954లోనే తలపోశాడు. ఈ చిత్ర నిర్మాణానికి ఏకంగా 34 మిలియన్‌ డాలర్లు ఖర్చయింది. మూర్‌ బాండ్‌గా నటించిన ఐదవ చిత్రం ‘ఫర్‌ యువర్‌ అయిస్‌ ఓన్లీ’ (1981). ఈ చిత్రానికి జాన్‌ గ్లెన్‌ దర్శకుడు. ఈ సూపర్‌ హిట్‌ చిత్ర రాబడి 195 మిలియన్‌ డాలర్లు. ఈ సినిమా విడుదల తరువాత యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ స్టూడియో మెట్రో గోల్డ్‌ విన్‌ మేయర్‌ స్టూడియోలో కలిసిపోయింది. రోజర్‌ మూర్‌ ఆరవ చిత్రం ‘ఆక్టోపస్సీ’ (1983). ఈ చిత్రానికి ఫ్లెమింగ్‌ రాసిన షార్ట్‌ స్టోరీన్‌ ‘ఆక్టోపస్సీ అండ్‌ ది లివింగ్‌ డే లైట్స్‌’ ఆధారం. ఇందులో కబీర్‌ బేడి ఆఫ్రికన్‌ రాకుమారుడి బాడీ గార్డ్‌ పాత్ర పోషించాడు. అలాగే ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు విజయ్‌ అమృతరాజ్‌ భారత్‌లో బాండ్‌కు సహాయకుడిగా నటించాడు. ఈ చిత్ర సింహభాగం ఉదయపూర్‌ వద్ద గల లేక్‌ ప్యాలెస్, జగ్‌ మందిర్‌ వద్ద చిత్రీకరించారు. ఈ చిత్ర ప్రీమియర్‌ షోకి ప్రిన్స్‌ చార్లెస్, ప్రిన్సెస్‌ డయానా హాజరయ్యారు. ‘ఆక్టోపస్సీ’ చిత్రం 187 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. రోజర్‌ మూర్‌ నటించిన చివరి బాండ్‌ సినిమా ‘ఎ వ్యూ టు ఎ కిల్‌’. అప్పటికే రోజర్‌ మూర్‌కు 57 ఏళ్ళు పూర్తై వయసు మీదపడింది. అయినా ఈ చిత్రం పరవాలేదనిపించింది.


అదే సంవత్సరం వచ్చిన ‘నెవర్‌ సే నెవర్‌ అగైన్‌’ లో సీన్‌ కోన్నెరీ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాను ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించలేదు. తలియా ఫిలిం ప్రొడ్యూసర్స్‌ అనే సంస్థ తరఫున జాక్‌ స్వార్ట్‌ జ్‌ మన్‌ నిర్మించాడు. ఈ సినిమా గతంలో వచ్చిన ఫ్లెమింగ్‌ నవలా చిత్రం ‘థండర్‌ బాల్‌’ ఆధారంగా నిర్మించారు. సీన్‌కానరీ నటించిన చివరి చిత్రం ‘డైమండ్స్‌ ఆర్‌ ఫర్‌ ఎవర్‌’ (1971) కాగా, 12 ఏళ్ల విరామం తరువాత అతడు నటించిన ఏడవ జేమ్స్‌ బాండ్‌ చిత్రమిది. ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ వారు విడుదల చేశారు. ఈ చిత్రం ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ వారు రోజర్‌ మూర్‌తో నిర్మించిన ‘ఆక్టోపస్సీ’ సినిమాకు పోటీగా నిలిచింది. అయితే రెండు సినిమాలూ బాగానే ఆడాయి. ఎటొచ్చీ ‘ఆక్టోపస్సీ’ దే కాస్త పైచేయి. ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించని రెండవ సినిమా ‘కేసినో రాయల్‌’ (1967). బ్రిటన్‌ విండ్‌ డస్ట్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో బ ాండ్‌ పాత్రను డేవిడ్‌ నివెన్‌ పోషించాడు. ఈ చిత్రానికి ఏకంగా ఆరుగురు దర్శకులుగా పనిచేశారు. మిగతా 22 సినిమాలు ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించినవే.


తరువాతి బాండ్‌ సినిమాలు...
జేమ్స్‌ బాండ్‌ సీరీస్‌ లో 15వ ఫ్లెమింగ్‌ నవలా చిత్రం ‘ది లివింగ్‌ దే లైట్స్‌’ (1987). ఇందులో నూతన నటుడు తిమోతీ డాల్టన్‌ బాండ్‌గా నటించాడు. జాన్‌ గ్లెన్‌ దర్శకుడు. ఈ సినిమా కూడా బాగా ఆడి 190 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. జాన్‌ గ్లెన్‌ దర్శకత్వం వహించిన 16వ సినిమా ‘లైసెన్స్‌ టు కిల్‌’ (1989)లో కూడా తిమోతీ డాల్టన్‌ బాండ్‌ పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ఫ్లెమింగ్‌ నవల ఆధారం కాదు. జాన్‌ గార్డనర్‌ రాసిన బాండ్‌ నవలను సినిమాగా నిర్మించారు. తరవాత నిర్మించిన ‘గోల్డన్‌ ఐ’ (1995), ‘టుమారో నెవర్‌ డైస్‌’ (1997), ‘ది వరల్డ్‌ యీజ్‌ నాట్‌ ఎనఫ్‌’ (1999), ‘డై అనదర్‌ డే’ (2002) సినిమాల్లో పియర్స్‌ బ్రోస్‌ నన్‌ బాంè 2006-2015 మధ్య విడుదలైన ‘కేసినో రాయల్‌’, ‘క్వాంటం ఆఫ్‌ సొలేస్‌’, ‘స్కై ఫాల్‌’, ‘స్పెక్టర్‌’ సినిమాలలో డేనియర్‌ క్రైగ్‌ బాండ్‌గా నటించాడు. ఈ సినిమాలు జేమ్స్‌ బాండ్‌ సీరీస్‌లోవే అయినా రచయితలు మాత్రం వేరువేరు.

- ఆచారం షణ్ముఖాచారి
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.