సినిమా పరిశ్రమకు తొలిరోజుల్లో ఎనలేని సేవ చేసిన వారిలో అగ్రగణ్యులు డేవిడ్ వార్క్ గ్రిఫిత్. గ్రిఫిత్ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’. 1915లో విడుదలయిన ఈ చిత్రం ఆయనకెంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చింది. ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’కు ముందు కూడా ఆయనకెంతో చరిత్ర ఉంది.
నిజానికి గ్రిఫిత్ జీవితం కూడా ఓ సినిమా కథలాగే ఉంటుంది. అమెరికా అంతర్యుద్ధంలో గ్రిఫిత్ కుటుంబం నాశనం అయిపోయింది. తల్లిదండ్రులు చనిపోయారు. అక్క పెంపకంలో గ్రిఫిత్ కాలం గడిపాడు. తర్వాత లిఫ్ట్‌బాయ్‌గా జీవితం ప్రారంభించారు. గోల్ఫ్కాడీగా, న్యూస్‌పేపర్ రిపోర్టర్‌గా, ఫైర్‌మన్‌గా పనిచేసిన తర్వాత నటుడుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 27 సంవత్సరాల వయసులో నటుడైన గ్రీఫిత్.. సినిమాల్లో నటించేవాడేగానీ నటన అంటే సుతరామూ అతనికి గిట్టేది కాదు. ఒకసారి.. తెరమీద తన నటన చూసుకొన్న అతనికి నటించడం పైనే అసహ్యం పుట్టి ‘నటజీవితానికి స్వస్తి చెప్తున్నట్లు’ ప్రకటించాడు. కానీ తమాషా ఏమిటంటే ఆ తర్వాత రోజే ఆయనకు డైరెక్టర్‌గా ఒక ఆఫర్ వచ్చింది.

గ్రిఫిత్ తీసిన తొలిచిత్రం ‘ది అడ్వంచర్స్ ఆఫ్ డాలీ’. జిప్సీలు ఎత్తుకుపోయిన ఒక చిన్నపిల్ల సాహస గాథ అది. దాంతో మొదలుపెట్టి 1912 నాటికి ఆయన అలాంటి ‘వన్రీలర్’ ఫిల్మ్¬్సను నాలుగు వందల వరకు తీశాడు. ఆయన తీసిన చిత్రాల్లో నటించిన కొందరు ఆ తర్వాత కాలంలో ప్రముఖ తారలుగా వెలుగొందారు. గ్రిఫిత్లో గొప్పతనం అంతా − అతని ఫిల్మింగ్ టెక్నిక్‌లోనే ఉంది. చిన్న కథను అందంగా చెప్పగలగటం అతని ప్రత్యేకత. ఎక్కడ క్లోజప్ వాడాలో, ఎక్కడ లాంగ్‌షాట్ ఉపయోగించాలో గ్రిఫిత్కు తెలిసినంతగా ఆ కాలంలో మరొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదు. ‘క్లోజప్’ టెక్నిక్‌ను జి.ఎ.స్మిత్ దాదాపు పదేళ్ల క్రితమే వాడినా కూడా గ్రిఫిత్ మళ్లీ దానికి జీవం పోసేంతవరకు దాని సంగతి ఎవరికీ గుర్తులేదనే చెప్పాలి. కథ చెప్పటానికి ఒక ‘ఆర్డర్’ ఉంటుందని, ఆ ఆర్డర్లో ఏ విషయాన్ని ఎంత ‘లెంగ్త్’లో చెప్పాలో నిర్ణయించుకోవాలని, ఆ లెంగ్త్ (నిడివి)లో ఏ షాట్ ఎలా తీయాలో కూడా గుర్తించాలని, తర్వాత వాటిని సరైన పద్ధతిలో జత చేయాలని (ఎడిటింగ్) గ్రిఫిత్ గుర్తించారు.
గ్రిఫిత్ ఇలా మీడియం మీద పూర్తి అవగాహన సంపాదించుకొనే నాటికే ఇటాలియన్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద సినిమాలు తీయడం మామూలయింది. ఇటాలియన్ల సినిమాలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టిస్తుండేవి. వాళ్లు ఎంచుకొనేవే మంచి చారిత్రికాంశాలున్న కథలు కావటంతో పిక్చరైజేషన్‌కు వీలు కలుగుతోందని గ్రిఫిత్ గుర్తించారు. పొంపై నగరాన్ని ఒక అగ్ని పర్వతం నాశనం చేయటం, రోమ్ నగరం అగ్ని ప్రమాదంలో భస్మమవటం, క్రిస్టియన్ మతస్థులను సింహాలకు ఆహారంగా వేయటం.. ఇలాంటి చారిత్రక ఘట్టాలుండే చిత్రాల కోసం పెద్దపెద్ద సెట్లు కూడా ఇటాలియన్లు నిర్మించటం గ్రిఫిత్లో కొత్త ఆలోచనలు కలిగించాయి. తను కూడా అలాంటిదే ఒక కళాఖండం నిర్మించాలన్న ఉద్దేశంతో అమెరికా అంతర్యుద్ధం బాక్గ్రౌండ్తో ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’ చిత్ర నిర్మాణాన్ని గ్రిఫిత్ ఆరంభించాడు. ఇటాలియన్లు తమ చిత్రాలకు కథ కోసం దాదాపు 20 శతాబ్దాల చరిత్రను తిరగేస్తే, గ్రిఫిత్ సమీప భూతకాలన్నుంచే కథను ఎంచుకోవటం విశేషం.
కాలిఫోర్నియాలోని ‘హాలీవుడ్’ అనే ప్రదేశంలో గ్రిఫిత్ తన ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’ చిత్రాన్ని ఆరంభించారు. అప్పటికి హాలీవుడ్ ఇంకా ఫిల్మ్ మేకింగ్ సెంటర్ కానేలేదు. తను చలనచిత్ర నిర్మాణంలో నేర్చుకొన్న టెక్నిక్లన్నీటినీ గ్రిఫిత్ తన మూడు గంటల ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’లో ప్రవేశపెట్టారు. ఎడిటింగ్ అంటే ఏమిటో, ఆ రంగంలో తన సత్తా ఏమిటో గ్రిఫిత్ స్పష్టం చేశాడు.
ఆ సినిమా చలన చిత్ర రంగంలో చరిత్ర సృష్టించింది. సినిమా అందరికీ నచ్చిందా అంటే అదీ లేదు. చూసిన వారిలో కొందరికి ఆ సినిమాలో ‘వాస్తవ చరిత్ర’ నచ్చలేదు. అందుకే విడుదలయిన కొన్ని సెంటర్లలో ఆ సినిమా పలు ఘర్షణలకు కారణమయింది. ఎందరో ఆ ఘర్షణల్లో చనిపోయారు కూడానూ! ఈ వివాదాలు, ఘర్షణల కారణంగా ఆసక్తితో మరికొందరు ఆ చిత్రాన్ని చూశారు. ఫలితంగా ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’ను ఆ రోజుల్లోనే దాదాపు కోటి మంది వరకు చూశారని అంచనా. గ్రిఫిత్ చూస్తుండగానే ఎన్నో లక్షలు సంపాదించుకోగలిగాడు.
అయితే సినిమా ప్రపంచం చిత్రమైనది. ఎంత త్వరగా ఇక్కడ డబ్బు సంపాదించే వీలుందో అంత త్వరగా డబ్బు పొగొట్టుకొనే అవకాశమూ ఉండటం విశేషం.
1905లో ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’తో ఎంతో డబ్బు సంపాదించుకొన్న గ్రిఫిత్ 1916లో ‘ఇన్టాలరెన్్్స’ పేరుతో ఇంకో సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక్క సెట్టింగ్ కోసం ఆయనెంతో ఖర్చు పెట్టారు. 16 వేల మందిని ఆయన ఆ సెట్లో నటనకు వినియోగించాడు. ప్రాచీన బాబిలోనియా నగరం సెట్‌ను వేశాక.. దాన్ని సినిమాల్లో ఉపయోగించుకోవటానికి బెలూన్లలో కెమేరాను పైకి ఎత్తుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ సినిమా కెమేరామన్ బిల్లీ బిట్టెర్కు పేరు తెచ్చినా, గ్రిఫిత్‌ను మాత్రం నష్టాల్లో ముంచేసింది. ఆ సినిమాలో నాలుగు వేర్వేరు కథల్ని గ్రిఫిత్ ఒక మాలగా కట్టి కలపడం పలువురికి నచ్చకపోవటమే దీనికి కారణం.
ఆ తర్వాత గ్రిఫిత్ ‘ఆర్ఫన్స్ ఆఫ్‌ది స్టార్మ్’ (తుఫాను బాధితులు) అనే సినిమాతోబాటు మరెన్నిటినో తీసినా, ఆయన మాత్రం నష్టాల ఊబిలోంచి బయటపడలేదు. 1948లో హాలీవుడ్లో కన్నుమూసిన ఆ మహానుభావునికి సినీ పరిశ్రమ ఎంతగానో రుణపడిఉంది. కెమేరా ఎలా ఉపయోగించుకోవచ్చో, షాట్స్‌ను ఎలా ఎడిట్ చేసుకోవచ్చో, నటనకన్నా సినిమా నిర్మాణంలో టెక్నిక్కే ఎంత ప్రాముఖ్యం ఉందో పరిశ్రమకు నేర్పిన మహానీయుడు గ్రిఫిత్.
(ఇంకా ఉంది)